స్వప్నములు (కలలు) – వాటి అర్థాలు

“స్వప్నములు”(కలలు/డ్రీమ్స్-Dreams) అనేవి నిజమా? అబద్దమా?
కలలో వచ్చేవి జరుగుతాయా?
అని నన్ను అడిగితే…
నాకు వచ్చిన కలల ను బట్టి నేను ఇక్కడ నా అభిప్రాయాన్ని మీతో చెప్తాను.
ముందుగా నాకు వచ్చిన కలల్లో నాకు ఒకే కల మూడు సార్లు వచ్చింది. ఈ మూడు సార్లు వచ్చిన కలలు ఒక నెలో రెండు నెలల్లో వచ్చినవి కావు.
మొదటి సారి- నేను నాలుగవ తరగతి, రెండవ సారి- ఆరవ తరగతి, మూడవ సారి- ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు వచ్చింది. ఆ కల నేను ఇంటర్ చదివేటప్పుడు నిజమయింది. కాని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కలలు నిజమవుతాయా అని నాకనిపించింది. ఈ కల జరిగింది, అలా అని అన్ని కలలు జరగలేదు. కొన్ని జరిగాయి. కొన్ని జరగలేదు. నాకు వచ్చిన కలలను బట్టి, నాకు కల నిజమయిందాన్ని బట్టి, కలలో ఏమి వస్తె మంచిదో, ఏమి వస్తే మంచిది కాదో చెప్తాను. ఇది నా అభిప్రాయం మాత్రమే.

ముందుగా మూడు సార్లు వచ్చిన కలలో ఏమి ఉందో చెప్తాను. ఈ కలలో నాకు ఒక బంగ్లా కనపడేది. నిజం చెప్పాలి అంటే అలాంటి బంగ్లాను ముందెప్పుడు మా ఊర్లో కాని, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కానీ చూడలేదు. నేను వేరే ఊర్లకి వెళ్ళినపుడు అక్కడ ఉన్న బంగ్లాలని కూడ చూసాను కాని నా కలలో కనిపించినటువంటి బంగ్లా కనపడలేదు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మేము అందరము ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాము. అక్కడ నా కలలో ఎలాంటి బంగ్లా కనిపించిందో అదే బంగ్లా కనిపించింది. నేను వెంటనే మా అమ్మకు తమ్ముడికి చెప్పాను. మా అమ్మ చెప్పింది, అది మన చుట్టాల వాళ్ళ ఇల్లే, ఆ ఇంటికే వెళ్తున్నాం మనం ఇప్పుడు అని. నాకు చాలా అశ్చర్యం కలిగింది, ఎప్పుడో పడిన కల ఇన్ని సంవత్సరాలకు నిజమయిందా అని.