ఆ అమ్మాయి కి పిచ్చిరా …దెయ్యం పట్టిందంటా – కథ

          ఇంటర్మీడియట్ పూర్తయింది. B.Sc జాయిన్  అయ్యాను. ఊరు వెళ్ళక చాలా కాలం అయ్యింది అనిపించింది. దాంతో ఈ సంక్రాంతి సెలవలకు ఊర్లోకి వచ్చాను, ఊరు ఏమి మారలేదు. ఊరు కదా! నా చిన్నప్పుడంతా పండుగ హడావిడి కాదు గాని బాగానే జరుగుతుంది.చాలా కాలం తర్వాత వచ్చాను కదా మా అమ్మానాన్న నన్ను ఒక ప్రత్యేక అతిధి లా చూసుకుంటున్నారు రోజంతా అమ్మతో  ఇంట్లోనే ఉన్నాను కొంచెం ఊర్లోకి వెళ్దాం అనిపించి బయటకి వచ్చి అలా మా వీది నుండి బజారుకు వెళుతుండగా నా చిన్నప్పడి  స్నేహితులు మరి నా దగ్గరి బందువులు అయిన ఇద్దరు స్నేహితులు దూరంనుండే హార్న్ కొడుతూ బైక్ ని నా దగ్గరకు తీసుకువచ్చి ఆపారు ,కొన్ని పలకరింపుల తర్వాత ఆ బైక్ మీదే ముగ్గురం కలసి ఊరు చివర జమ్మి చెట్టు అరుగు దగ్గరకి వచ్చి కుర్చుని చిన్నప్పటి సంగతులన్నీ చెప్పుకుంటున్నాం,అలా స్నేహితులతో మాట్లాడుతున్న నా మనసు ఊరు ని పలకరిస్తూనే ఉంది.సాయంత్రం 6:00 అయ్యింది.పౌర్ణమి ఏమో చంద్రుడు చాలా పెద్దగా ఉదయిస్తున్నాడు…గాలి నెమ్మదిగా చల్లగా వీస్తుంది…పొలం వెళ్ళిన కూలీలు, గొర్రెలు,గొర్రెల కాపర్లు, ఇళ్ళకు వస్తున్నారు…కొంచం దూరంలో రెండు మఱ్ఱిచెట్లు గూళ్ళకు తిరిగివచ్చిన పక్షుల అరుపులతో నిండి ఉన్నాయి.కొంచం సేపటికి నెమ్మదిగా ఊరు మొత్తం చీకటి కమ్ముకుంది.ఊరు వీదుల్లో ,ఇళ్ళల్లో లైట్స్ వెలిగాయి ఉదయం మా అమ్మ చెప్పింది ఎవరింట్లోనో పుష్పవతి ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అని బహుశా ఆ ఇంట్లో నుండేనేమో మంగలస్నానం పాటలు వినపడుతున్నాయి.అప్పుడు ఎందుకో నా ఆలోచనలోకి ఆ అమ్మాయి వచ్చింది వెంటనే నా పక్కన  ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్న నా స్నేహితులని అడిగాను ఆ అమ్మాయి గురించి ,నాకు సమాదానం గా అందులో ఒకడు “ఒరేయ్ ఆ అమ్మాయికి పిచ్చిరా ! దెయ్యం పట్టింది అంటారా బాబూ” అన్నాడు నాకు నమ్మబుద్ది కాలేదేమో ఇంకా  వాడి  వైపే చూస్తున్న నాతో “నిజం రా బాబూ”అన్నాడు.

          పక్కనే ఉన్న మరో స్నేహితుడు “అవున్రా ఆ అమ్మాయిని వారానికో ఆసుపత్రికి రోజుకో దర్గాకు తిప్పారు మొన్నఈమధ్య.ఇంట్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుందంటా! సాయంత్రం అయితే చాలు ఏడుస్తూ వీదుల్లోకి వస్తుందంటా! అని అన్నాడు దానికి నేను వాడితో “వాళ్ళ అమ్మమ్మ ఉండాలి గదరా!” అన్నాను.  వాడు “ఎక్కడ్రా వాళ్ళ అమ్మమ్మ చనిపోయి సంవత్సరం అయ్యింది. అప్పటికి 3  నెలల ముందే ఆ అమ్మాయి కి గాలి సోకింది అని పుకార్లు ఉన్నాయి” అన్నాడు. అలా వాడు చెపుతున్డగానే నా ఆలోచనలు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ మీదకు వెళ్ళాయి ఇద్దరు స్నేహితులు మాట్లాడుతూనే ఉన్నారు నాకు ఏమి తెలియటంలేదు చీకటి పడింది మా ఊరు నిద్రలోకి వెళ్ళింది .వీదుల్లో ఒక్కరు లేరు అరుగు మీద మేము ముగ్గురం తప్ప అలా ఆలోచిస్తున్న నన్ను మేల్కొలుపుతున్నట్లు నా స్నేహితుడు “అరేయ్ ” అన్న పిలుపుతో యధాస్తితికి వచ్చాను “టైం 10:00 అయ్యింది పదండి ఇళ్ళకు వెళ్దాం ” అని వాళ్ళు అనడం తో ముగ్గురం అక్కడ నుండి లేచాం ఇద్దరు వాళ్ళ ఇంటి వైపు వెళ్లారు.

          నేను మా ఇంటికి వెళ్లి స్నానం ,భోజనం చేసి ఆరుబయట పడుకుని ఉన్నాను ఆకాశంలో చంద్రుడి మీద మబ్బుల్లా నా ఆలోచనలు కూడా మరల ఆ అమ్మాయి మీదకు వెళ్ళాయి అవి నా 10th class రోజులు ఆ అమ్మాయి ఆ సంవత్సరం మే మా class లో జాయిన్ అయ్యింది అప్పటి వరుకు మాకు దగ్గరలో ఉన్న టౌన్ లో చదవుకుని   వచ్చింది ఇంగ్లీష్ మీడియం నుండి అందులోను పెద్ద స్కూల్ పేరు చెప్పడం తో మేమంతా ఆ అమ్మాయి ని వింతగా చూసేవాళ్ళం మా class మిగితా ఆడపిల్లలయితే మరీను ఆ అమ్మాయి అలంకరణ గురించి తెగ చెప్పుకుని అసూయ పడేవాళ్ళు నిజమే మరి ఆ అమ్మాయి వేసుకునే బట్టలు ఆ అమ్మాయి అలవాట్లు మాకు బిన్నంగా చాలా మంచివిగా ఉండేవి. మా మాష్టారు ఆ అమ్మాయి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు. ఆ అమ్మాయి మాతో ఎవరితోనూ మాట్లాడేది కాదు తన పనేదో తాను అన్నట్లు ఉండేది. మా మాష్టరు ఏవైనా ప్రశ్నలు ఆ అమ్మాయిని అడిగినా ఆ అమ్మాయి ఏమైనా సమాధానాలు మా మాష్టరు ను అడిగినా అంతా ఇంగ్లీష్ లోనే దాంతో మేము ఇంకా ఆ అమ్మాయి తో మాట్లాడడానికి ఇంకా జంకే వాళ్ళం అలా కొంత కాలం గడిచిన తర్వాత కుడా ఆ అమ్మాయి మాతో ఉంటున్నా,మా class అయినా కుడా మేము ఆ అమ్మాయి మాలో ఒక్కరుగా చేసుకోలేకపోయాం.

          కాని మాకు ఆ అమ్మాయి కి మద్యలో సందానకర్త గా వాళ్ళ అమ్మమ్మ వ్యవహరించేది.
          అవి మా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్న రోజులు.రోజుకు 18 నుండి 20 గం|| చదువు చదువు గా ఉన్న రోజులు రాత్రులు అందరం ఇంటికి వెళ్ళేసరికి 11:00 గం|| అయ్యేది మరల ఉదయం 5:30 గం|| క్లాసు లు ప్రారంభం చదవుతూ సమయం మరిచిపోయేవాళ్ళం కాని ఆ అమ్మాయి కోసం వాళ్ళ అమ్మమ్మ రోజు లాంతరు తీసుకుని టంచనుగా గంటకొట్టినట్టు సరిగ్గా రాత్రి 10:30గం|| మా స్కూల్ కి వచ్చేది అప్పుడు మాకు అర్ధం అయ్యేది సమయం 10:30 అయ్యిందని .ఆమె రాగానే మా మాష్టరు ఆమె కు కుర్చితెప్పించి ఆమెను కూర్చోమని కుశల ప్రశ్నలు వేసి వాళ్ళ మనవరాలి గురించి గొప్పగా పోగిడేవాడు. 11:00గం|| అవ్వగానే ఆమె లాంతరు సహాయం తో వాళ్ళ మనవరాలిని వెంటబెట్టుకుని వెళ్ళేది ఏమైయ్యేదో తెలీదు కాని అప్పుడప్పుడు ఆమె వచ్చేది కాదు అప్పుడు మాలో ఎవరో ఒకరం ఆ అమ్మాయికి తోడుగా వెళ్ళేవాళ్ళం అప్పుడుకుడా ఆ అమ్మాయి మాతో ఎవ్వరితోను మాట్లాడేది కాదు టౌన్ అమ్మాయి కదా అంతే అనుకునే వాళ్ళం. ఆ అమ్మమ్మ గారు అప్పుడప్పుడు ఇంట్లో వండుకునే వంటకాలు తెచ్చి మా మాష్టరుకు ఇవ్వటమే కాకుండా కాస్త మాకు కుడా పెట్టేది.ఆ వంటకాలు మేము ఎక్కడ తిన్నవి కాదు మా ఇళ్ళల్లో వండేవి కావు చాలా గొప్ప రుచిగా ఉండేవి తింటుంటే మరల మరలా ఎప్పుడు తెస్తుందా అనుకునేవాళ్ళం.అలా వాళ్ళ అమ్మమ్మ గారు మా క్లాసు లో ఒక బాగం అయ్యారు.

          ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యిపోయాయి. అందరం కలిసి farewell party చేసుకున్నాం ఆ పార్టీ లోను, మేము దిగిన గ్రూప్ ఫోటో లోను ఆ అమ్మాయే ప్రధాన ఆకర్షణ. అందరి results వచ్చాయి అందరం పాస్ అయ్యాం క్లాస్ first ఆ అమ్మాయినే, స్కూల్ చదవు అయ్యిపోయింది, ఆ తరువాత ఎవరిదారి వాళ్ళు అన్నట్లు అయ్యాం కొంతమంది కాలేజీ చదవులకు కొంతమంది వ్యవసాయం మరియు కులవృతుల పనులకు అమ్మాయిలకు ఆ ఇయర్ లోనే పెళ్ళిళ్ళు అయ్యాయి(పల్లెటూళ్ళు మరీ అంతేఉంటాయి) అలా ఆ ఆలోచనల తోనే నిదురపట్టింది.

          తెల్లారగానే మొదటి బస్సు కు నేను నా కాలేజీ కి వచ్చాను .

          కాలేజీ కి వచ్చాక కూడా ఒక వారం రోజులు ఆ అమ్మాయి గురించే ఆలోచనలు. తర్వాత మరలా నేను నా చదవు లో పడి ఆ అమ్మాయి గురించి ఏంటి మా ఊరు గురించి కుడా మరిచిపోయాను ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆ తర్వాత మెయిన్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంతే ఇంటి నుండి వచ్చాక క్షణం తీరిక లేదు…ప్రపంచం తో సంబంధం లేదు. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయాయి అన్ని సబ్జక్ట్స్ బాగా రాసాను ఒక కెమిస్ట్రీ కొంచం పర్లేదు మరి తక్కువు మార్క్ లు ఏమి రావులే అని నాలో నేను ఆలోచించుకుంటూ కాలేజీ మెయిన్ గేటు దాటి వచ్చాను అంతలో నా ఫోన్ మోగింది, చూస్తే ఊరినుండి అప్పుడు కలిసిన నా స్నేహితుల్లో ఒకడు. మాట్లాడదాం అని కాల్ లిఫ్ట్ చేసాను. వాడి గొంతు లో చాలా  ఆత్రుత ఉంది ఇలా..
          “ఒరేయ్ మొన్న అడిగావ్ కదా ఆ అమ్మాయి గురించి అదే రా మనమ్ మాట్లాడుకున్టిమే! ఆ అమ్మాయి”
          నేను :-(వాడికి సమాధానంగా ) “హా..చెప్పురా ! ఆ అమ్మాయి గుర్తుంది…చెప్పు ఏమైంది”
          వాడు:-“అరేయ్  బావా చనిపోయింది రా ఆ అమ్మాయి ఈ రోజు తెల్లవారుజామునా “
          వినగానే నాకు అర్ధంకాని ఒక కలవరం నన్ను ఆవరించింది ఉన్నచోటే నిలబడిపోయాను, నేను ఎదో నడవటం మర్చిపోయినట్టు ఆ అమ్మాయి నా ముందే నిల్చునట్టు ఉంది నాకు వాడు ఇంకా ఎదో చెప్తూనే ఉన్నాడు ఫోన్లో నాకేమి వినపడడం లేదు మళ్ళి వాడి “hello… ఒరేయ్…నీకే చెప్తున్నా” అన్న పిలుపుతో వచ్చాను ఈ ప్రపంచం లోకి, ఆ తర్వాత కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసాడు.ఆ తర్వతా చాలా రోజులు నేను ఆ అమ్మాయి ఆలోచనల నుండి బయటపడలేక పోయాను కళ్ళ ముందు ఆ అమ్మాయే మెదిలేది…ఆ అమ్మాయికి అలాంటి పరస్తితి వస్తుందని ఎవ్వరం అనుకోలేదు ఆ అమ్మాయి ముఖం లో చాలా నిర్మలత ఉండేది…చాలా పెద్ద పెద్ద కళ్ళు,గుండ్రటి ముఖం,రెండు జల్లు చాలా బాగుండేది అలాంటి అమ్మయికి పిచ్చి అని దెయ్యం పట్టింది అని అంటుంటే నాకు నమ్మబుద్ది కాలేదు.

          ఇప్పటికి నమ్మను ఒక రెండు నెలలు తర్వాత మరల మా ఊరికి వెళ్ళాను కొంచం మా స్కూల్ మాష్టర్ దగ్గర ఆ అమ్మాయి గురించి వాకబు చేసాను. కొంత దైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పుడు తెలిసినవి నాకు అసలు విషయాలు!
          ఆమె ఆ అమ్మాయికి సొంత తల్లి కాదని సవతి తల్లి అని. ఆ అమ్మాయి అమ్మమ్మ గారు కూతురు చనిపోవటం తో అల్లుడికి వేరే అమ్మాయి తో వివాహం జరిపింది. కాని ఆమె ఆ అమ్మాయి కి సవతి తల్లి గానే ఉంటూ వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూడా తన రెండో బార్యకు సంతానం కలగగానే ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మకు మాత్రమే పరిమితం చేసాడు. అప్పటినుండి ఆ అమ్మమ్మ గారే ఆ అమ్మాయిని గారాబంగా చూసుకుంటూ  పెంచింది. తర్వాత కొన్నాళ్ళకి ఆ ఆమ్మమ్మ చనిపోవటం తో ఆ అమ్మాయి ఆ ఇంట్లో పరాయిది అయ్యింది. రాను రాను ఆ అమ్మాయి కి ఆ ఇంట్లో ప్రేమ కరువైంది. ఇక ఆ అమ్మాయి పరద్యానంగా ఒంటరిగా ఉంటూ వుండేది, దాంతో ఆ ఇంట్లో వాళ్ళు గాలి సోకింది, అని ఆ అమ్మాయిని రకరకాల దర్గాలకు, బాబాల దగ్గరకు తిప్పి నిజంగా పిచ్చిదాన్ని చేశారు. ఊర్లో వాళ్ళందరికీ పిచ్చిపట్టినట్టు చెప్పారు. దాంతో ఊరి వారంతా  ఆ అమ్మాయిని పిచ్చిదానిలా చూసేవారు.

          ఆ అమ్మాయి తన చుట్టూ ఏమి జరుగుతుందో అది ఎవరితో చెప్పుకోవాలో తెలియక తన అమ్మమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడవటం మొదలెట్టేది. అలా ఏడుస్తూ వీదిలోకి వచ్చేది దాంతో ఇలాగే వింతగా ప్రవర్తిస్తుంది, అని చెప్పేసరికి ఊర్లో వాళ్ళంతా దెయ్యం కుడా పట్టింది అని పుకార్లు పుట్టించారు. దీన్ని అవకాశం గా బావించిన సవతి తల్లి అన్నం తినే పళ్ళెంలన్నిటిని విసిరేస్తుందని, ఇంట్లోనే ఉమ్మేస్తుందని, మూత్ర విసర్జన చేస్తుందని, ఇంకా పుకార్లు పుట్టించి ఆ అమ్మాయిని గదిలోనే మంచానికి బందించి రక రకాల భూత వైద్యాలతో హింసించి, చివరకు ఆ అమ్మాయి ప్రాణం పోయేంతవరకు వేదించారు.

          నిజమే మరి ! ప్రేమ, ప్రేమించే వ్యక్తులు దూరం అయినప్పుడు ఎవరికైనా సంఘం అనే పిచ్చి…బంధవులు అనే దయ్యాలు పడుతూనే ఉంటాయి.

          వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక విషయం గమించాను చనిపోయిన ఆ అమ్మాయి ఫోటో వాళ్ళ అమ్మమ్మ ఫోటో పక్కపక్కనే ఉంచారు, ఈ మధ్యకాలం లో దింపిన ఫోటో అనుకుంటా
నిజంగానే దెయ్యం పట్టిన పిచ్చి అమ్మాయిలా ఉంది తను …..