ఆడజన్మ – కవిత

మనిషి మృగంగా మారి, మనసులేని రాతి బొమ్మై

అపరంజి బొమ్మని, అసువులు ఊదిన అమ్మని

అనంత దూరాలకు, అలుపులేని లోకాలకు

ఆత్మని చేసి పంపేస్తే, అడిగే దిక్కు లేదే

అడుగడునా అన్యాయం, అనుక్షణం అధర్మం

శివమెత్తి చిందేస్తే, తోలు బొమ్మలు

రంగుల బొమ్మల కాగితాలకు లోబడి

రక్కసి లోకం కోరలు చాచి కాటేస్తే

ఉసురున చలించే శివం, శిలలా శవమై కళ్ళు మూసేసి

కానరాని తీరాలకు చేరింది. ప్రశ్నించే ప్రాణేదీ

లోకమే ఎరుగని, కష్టమే తెలియని

కరుణ లేక కారడవుల కదలమంటే

ఆ విభావరి వారించలేదని,

ఆ వాక్కుని అక్కున చేర్చుకొని గళమెత్తక, 

గతి తప్పే జీవితం గురుతును చెరిపి

గుండెల్లో కార్చిచ్చుని మిగిల్చి

తడబాటులో తనువొదిలేసిన తరుణికి

ఈ తరానికి మిగిలేది గుప్పెడు మన్నేనా

ఆటవిక సమాజానికి స్వస్తి పలికి, అంగారకుడిపై అడుగేసినా

ఆడ బతుకు కన్నీటి కడలిలో, కలిసి వైతరిణి దాటాల్సిందేనా