అద్భుతం – కథ

          అంతులేని కథ లో మగ జయప్రద లా తయారయ్యింది సూర్యం పరిస్థితి. నిరుపేద కుటుంబం లో పుట్టినా, తల్లిదండ్రుల కృషి, పట్టుదల వల్ల, తాను డిగ్రీ చదివి, కాల్ సెంటర్ లో జాబు సంపాదించాడు. ఐదేళ్ళు అక్కడ తక్కువ జీతం తో కష్టపడ్డాక, ఈ మధ్యనే పెద్ద కంపెనీ లో మంచి జీతానికి ప్రాజెక్టు మేనేజరుగా కుదిరాడు. అన్ని కష్టాలు పడ్డ అమ్మానాన్నలకి మంచి జీవితం కూడా చూపించాలని ఆశ పడ్డాడు. అన్నీ తానై, తమ్ముడి ని ఇంజినీరింగు లో చేర్చాడు. అంతా బాగుందనుకున్న సమయం లో, తల్లిదండ్రులిద్దరూ కొద్ది తేడాతో కాలం చేశారు. ఆ బాధ నుండి కోలుకోక ముందే, తమ్ముడి కి ఏదో అరుదైన వ్యాధి అని తేలింది. వాణ్ణి ఎలాగైనా కాపాడాలని తాను చెయ్యని ప్రయత్నం లేదు. కంపెనీ యాజమాన్యాని కి తన పరిస్థితి వివరిస్తూ మెయిల్సు పంపాడు. హెచ్చార్ వాళ్ళు, అతనికి కావాల్సిన ఇరవై లక్షలూ అప్పుగా గా కూడా ఇవ్వడం కుదరదని తేల్చేశారు. అతడు ఉద్యోగం లో చేరి మూడేళ్ళు కూడా కానందున, మహా అయితే రెండు లక్షల అప్పు ఇవ్వగలమనీ తెలిపారు. కంపెనీ లో పనిచేస్తున్న మిగతా వాళ్ళందరినీ చందాలివ్వమని ప్రోత్సహిస్తామన్నారు. గతం లో ఎన్నోసార్లు ఉద్యోగులందరూ భూరి విరాళాలిచ్చారు గానీ, ఎన్నడూ ఆ విరాళాలు ఐదారు లక్షలు దాటింది లేదు. ఎంత కాదన్నా, తనకు ఇంకా  చాలా డబ్బే అవసరమైంది. దిక్కు తోచని స్థితి లో సీ.ఎఫ్.ఓ రావుకి మెయిలిచ్చాడు. పలుమార్లు ప్రయత్నించాక, అతడి అపాయింట్మెంట్ దొరికింది.

          సీ.ఎఫ్.ఓ రావు చాలా మంచివాడు. బాగా పలకరించాడు. విషయం ముందుగానే తెలుసుకున్నాడు. తమ్ముని ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. కష్టం తీరుతుందన్న ఆశ పుడుతున్న సమయం లో, చావు కబురు చల్లగా చెప్పాడు. ఎంత సహాయం చెయ్యాలని తనకున్నా, అతని పవర్ లో రెండు లక్షల కన్నా ఎక్కువ ఇవ్వడం సాధ్య పడదుట. పదే పదే నొచ్చుకున్నాడు ఈ విషయం చెప్పాల్సి వస్తున్నందుకు. ఇక కంపెనీ యజమానే దిక్కుట. ప్రయత్నిస్తానన్నాడు. వారం రోజుల తర్వాత కనపడమన్నాడు. ఈలోగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తన తమ్ముణ్ణి కాపాడుకోలేడు తను. అక్కడినుంచి బయటకొచ్చాక, సుర్యానికి, దుఃఖం ఆగలేదు.

          కొన్ని నెలలు గా డబ్బు కోసం ఎంతో ప్రయత్నించి విసిగి పోయాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఎక్కువ జీతాలిస్తున్నాయి కాబట్టి, ఇంత పెద్ద మొత్తం లో సాయం చేసే, (కనీసం అప్పుగా అయినా ఇచ్చే) ఉదార స్వభావం ఆయా కంపెనీల యజమానుల కుండదని తాను ముందే విని ఉన్నాడు. ఇదేమీ, ఇన్ఫోసిస్ కాదు. ఆ యజమాని నారాయణ మూర్తీ కాదు. గతం లో ఒక మేనేజరు, నాలుగు వందలకి బదులు నాలుగు వేలు వేసి తప్పుడు బిల్లు పెట్టేడని, అతడిని తొలగించిన సంస్థ ఇది. ఇన్ని లక్షలు ఇస్తారన్న ఆశ పూర్తిగా అడుగంటి పోయింది.ఆ బాధలో అక్కడే, ఏడుస్తూ కూచున్నాడు.

          అటుగా వెళ్తున్న ఆ యజమాని, సూర్యాన్ని చూసీ చూడనట్లే వెళ్ళాడు. ఒక వైపు రావు, యజమానికి ఈ విషయం చెప్పాలంటే భయపడుతున్నాడు. ఆర్ధిక మాంద్యం పుణ్యమాని, ఈ మధ్య కంపెనీ ఖర్చు లు తగ్గించే విషయం లో కొన్ని ఐడియాలతో రమ్మన్నాడు. ఇంతలో యజమాని నుండి పిలుపు వచ్చింది. ఆ విషయం గురించే అయ్యుంటుందని, ఫైల్సు పట్టుకుని వెళ్ళాడు. బయట ఏడుస్తున్న సూర్యాన్ని గురించి ఆరా తీశాడు యజమాని. రావు విషయం వివరించి, రెండు లక్షలు శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పాడు, యజమాని ఏమంటాడా అని భయపడుతూనే. ఆయన మొహం చిట్లించాడు. రావుకి పై ప్రాణం పైనే పోయింది.

          రెండూ ఇచ్చాక ఇంక ఎంత తగ్గుతుంది? అడిగాడు యజమాని.

          ఇంకో పది పడుతుందన్నాడు రావు.

          మనం చేసే సాయం తో పిల్లవాడి ప్రాణం కాపాడ గలమా? మళ్ళీ అడిగాడు.

          లేదన్నాడు రావు.

          మరి ఆ రెండూ ఇచ్చి ప్రయోజనం లేదుకదా.. సగం డబ్బులిస్తే, సగం ప్రాణం నిలవదు కదా.అందుకని.. 

          రావుకి అర్ధమవుతోంది ఆయనేం అనబోతున్నాడో. ప్రయోజనం లేనప్పుడు ఇవ్వడం ఎందుకూ అసలే కంపెనీ లాభాలు తగ్గు ముఖం పడుతున్న కష్టకాలం లో అంటాడు. అతనికి ఏదో ఒకటి చెప్పి పంపెయ్యమంటాడు అనుకున్నాడు.

          ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ అతని తమ్ముడు బతకడు, అతనికి చెప్పి పంపెయ్యమంటారా అని అడిగాడు.

          ఇప్పటి వరకూ పోగవుతాయనుకుంటున్న పది లక్షలూ ఎలా వస్తున్నాయో వివరం అడిగాడు యజమాని.

          కొద్ది గా అలోచించి, రావు చేతిలో ఒ చెక్కు పెట్టేడు.

          ఏంటిది అన్నాడు రావు.

          అద్భుతం అన్నాడు యజమాని. అక్షరాలా ఇరవై లక్షల చెక్కు అది.తన పర్సనల్ ఎకౌంటు నుంచి రాసిచ్చాడా యజమాని.

          నమ్మబుద్ధి కాలేదు రావుకి. నాలుగు వేల విషయంలో, చిన్న మొత్తానికే మనోహర్ ని తొలగించాలని పట్టుపట్టిన యజమాని, ఇరవై లక్షలు ఎలా ఇస్తున్నారు?

          రావు ముఖం చూసి అన్నాడాయన,

          మనోహర్ మనల్ని మోసం చేసాడు. అప్పుడు మీకు ఎమౌంట్ చిన్నదే కదా అని డబ్బు కనపడింది, నాకు మోసం కనపడింది. అందుకనే అతన్ని తొలగించాలన్నాను.

          ఇప్పుడూ మీకు ఇరవై లక్షలు అనే డబ్బే కనపడింది, నాకు అవసరం కనిపించింది. ఒక పిల్లవాడి భవిష్యత్తు కనపడింది. అందుకే ఇస్తున్నాను.

          రావు పరిగెత్తుకెళ్ళి ఆ చెక్కుని ఏడుస్తున్న సూర్యానికిచ్చాడు.

          అద్భుతం!! సూర్యం అనందానికి హద్దుల్లేవు.

          అద్భుతాలు జరగాలంటే దేవుడు దిగిరానక్కరలేదు, మనసున్న సాటి మనిషి చాలు.