Baamma – Katha

బామ్మ

సంధ్యాకాలం సూర్యుడి కిరణాలు ఎంతో ప్రేమతో భూమిని తాకుతున్నవి. పక్షులు ఆ రోజుకి కావలసిన జ్ఞాపకాలని గుండెనిండా నింపుకొని వాటి గూటిలో కి ప్రయాణం సాగిస్తున్నాయి. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం లో గాలి కూడా దాని చల్లటి స్వభావంతో అందరి హృదయాలను ఆనదింపచేస్తున్నది. ఇంత చక్కటి సాయంత్రం వేళ గుండెనిండా ఎంతో బాధని వుంచుకొని మొఖం మీద ఒక చిన్న చిరునవ్వుతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక డెబ్బైయేళ్ళ ముసలావిడ ఒక అందమైన వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుంది.

ఆ సమయంలో..
“బామ్మ..” అని మృదువైన గొంతుతో ఒక పదిహేడు ఏళ్ల అందమైన అమ్మాయి పిలిచింది.
“ నమస్తే బామ్మ, నా పేరు ప్రియ నేను ఒక కథ రాయడానికి మీ సహాయం కోసం వచ్చాను.. నేను మీ పేరు తెలుసుకోవచ్చా?”
“నా సహాయం..!? సరే ఏం సహాయం చెయ్యాలి?” అని బామ్మ అడిగింది.
“నేను మీ జీవితం గురించి తెలుసుకొని మీ కథ రాయాలి అని అనుకుంటున్నాను. నాకు మీరు మీ జీవితంలో జరిగిన విషయాలను, ఇంకా దాని మీద మీ అభిప్రాయంను కూడా తెలుపుతారు అని ఆశిస్తున్నాను.” అని ప్రియ బదులు ఇచ్చింది .
“సరే అమ్మా ప్రియ.. నాకు కూడ కాలక్షేపం అవుతుంది. ఇంకా నా కథ చెపుతాను నా అభిప్రాయం కాదు నీ అభిప్రాయం నాకు తెలుపు” అని బామ్మ అంటుంది.

“నా పేరు సరోజా, నేను ఆత్రేయపురం లో పుట్టాను. నాకు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసేశారు, ఇరవై ఏళ్ళకు ఒక పిల్లవాడు కూడా పుట్టాడు. మా అబ్బాయి పేరు నవీన్. ఇరవై రెండు ఏళ్ళకి మా ఆయన మంచాన పడి చనిపోయారు. మా ఆయనగారి ఉద్యోగం నాకు ఇచ్చారు. నేను నా తంటాలు పడి వాడిని చదివించానూ. వాడు మంచిగా చదువుకొని ఉద్యోగం లో చేరాడు , అక్కడ మధు అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వాళ్ళు వాళ్ళు అనుకున్నాక మనం ఏం చేస్తాం. నాకు వున్నది వాడొక్కడే.. వాడికోసమే నేను వున్నది. వాడి ఇష్టాన్ని నేను కాదనలేక పెళ్లి చేశాను. రెండు సంవత్సరాలు ముగ్గురం చాలా సంతోషంగా వున్నాం. రెండు ఏళ్ల తరువాత నాకు మనవరాలు పుట్టింది. నా సంతోషానికి అవధులు లేవు. నా మనవరాలి ఆలన పాలనలో నా కోడలికి నాకూ గొడవలు అయ్యాయి. తెల్సిందే కదా ‘modern culture’ కి మా ‘culture’ కీ విభేదాలు వుంటాయి అని. మా మనవరాలి రెండవ పుట్టినరోజు అయ్యాక నన్ను ఇక్కడి తీసుకొని వచ్చి వదిలేశాడు మా అబ్బాయి. రోజుకి ఒకసారి ఫోన్ కాస్త వారానికి ఒకసారి అయ్యింది, వారం కాస్త నెల,నెల కాస్త సంవత్సరం.. వాళ్ళ నాన్నగారి సంవత్సరీకానికి న దగ్గరికి వస్తాడు అంతే. నా మనవరాలిని చూసి పదిహేను సంవత్సరాలు అవుతున్నాయి. నా జీవితం లో అన్ని కోల్పోయిన నేను వారికోసమే బ్రతుకుతున్న అని అర్థంచేసుకో లేని వాడు నాకు కొడుకు (అని నవ్వుతుంది). నువ్వు మా జీవితం గురించి రాస్తాను అని అన్నప్పుడే నాకు నవ్వు వచ్చింది ఈ వృద్ధాశ్రమం లో వున్నవారి జీవితం లో నువ్వు రాసుకోవడానికి బాధ, దుఃఖం తప్ప ఏమీ వుండదు అని. అందరూ పిల్లలు ఎంతో ఉన్నతంగా ఆలోచించి మా వయసువారు మా వయసువారితో వుంటేనే సంతోషంగా ఉంటారు అని ఇక్కడికి తీసుకొని వస్తారు, కానీ మీకు తెలియని విషయం ఎంటి అంటే ఇక్కడ మీరు అనుకొనే సంతోషంలో కూడా మీరే వుంటారు. మేము మా వయస్సు వాళ్ళతో ఇక్కడ వుండి పంచుకోనేది కూడా మీతో నిండిపోయిన మా జీవితాలే. అందరూ పొద్దున్నే మా మనవడు ఇలా చేసేవాడు, మా మనవరాలు ఇలా చేసేది, మా కొడుకు ఇలా చేశాడు, మా కూతురు ఇలా చేసింది అనే ఆలోచనలతో మొదలయ్యి, వాళ్ళని ఎప్పుడు కలుస్తామో అనే ఆలోచనలతో రోజు ను ముగిస్తున్నం. ఇక్కడ నువ్వు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా నీకు ఇదే కథ దొరుకుతుంది, పాత్రలు మాత్రమే మారతాయి అంతే. ఎదో చిన్న ఆశ ఎప్పుడైనా నా మనవరాలిని నేను కలుస్తాను ఏమో అని. (కళ్లు తుడుచుకుంటూ) నాకు చాలా సంతోషంగా వుంది నువ్వు అయ్యిన మా జీవితాలు తెలుసుకోవడానికి వచ్చినందుకు. ఇప్పుడు నీ అభిప్రాయం ఎంటో చెప్పు (అంది నవ్వుతూ).”

“బామ్మ మీ జీవితం మీద అభిప్రాయం తెలిపెంత వయస్సు నాది కాదు, నేను ఒక్కటే చెప్పగలను మీరు వస్తదో రాదో తెలియని మనవరాలి గురించి అలోచించి బాధపడకుండా నేనే మీ మనవరాలిని అని అనుకొని నన్ను దీవించండి” అని బామ్మ గారి కాళ్ళకి నమ్మస్కరిస్తుంది.
“దీర్ఘాయుష్షుమాన్ భవ.. చల్లగా నూరేళ్ళు సుఖసంతషాలతో జీవించు” అని బామ్మ అంటుంది. ప్రియ నీ పైకి లేపి నుదిటి మీద ముద్దు పెడుతుంది. అలా ప్రియ కంటిలోనుంచి కన్నీళ్ళు వస్తుంటాయి, అవి తుడుచుకొని ప్రియ బయలుతేరుతుంది. బామ్మ కూడా ఎంతో ఆనందంగా తన గదిలోకి వెళ్ళి చాలా సంవత్సరాలుగా రాయడం ఆపేసిన తన డైరీ నీ తెరిచి “ప్రియ లాంటి మనవరాలు నాకు వుంటే బాగుండు” అని రాస్తుంది. అలా ఆ డైరీ నీ తిరగేస్తూ తను ఆనందంగా వున్న క్షణాలను గుర్తుచేసుకుంటూ ఆ రాత్రిని గడిపేస్తుంది.

ఇలాంటి కథలు ఒకటి కాదు ఎన్నో వేలల్లో వృద్ధాశ్రమం లో ఈ ప్రపంచానికి తెలియకుండా దాగి ఉన్నాయి .

రచన: అర్జ. నీలిమ

మరిన్ని రచనలకు: http://www.manandari.com/arja-neelima/