భారతీయ అంతరిక్ష పరిశోధనలకు పితామహుడు -డాక్టర్ విక్రమ్ సారాభాయ్

19, ఏప్రిల్, 1975న  భారతదేశము మొట్టమొదటి ఉపగ్రహము ఆర్యభట్ ను విజయవంతముగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది ఈ అసాధారణమైన విజయము వెనుక  ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఏంతో ఉన్నది. ఇస్రో తన అమూల్యమైన అంతరీక్ష పరిశోధనలతో పాటు సోలార్ ఫిజిక్స్ ఎరోనామిక్స్, ఎక్స్ రే ఆస్ట్రానమీ లలో కూడా పరిశోధనలు కొనసాగించారు. 1975 నుండి నేటివరకు అంటే 43 ఏళ్లలో అభివృద్ధి చెంది ఒకే రోజు 104 ఉపగ్రహాలను అంతరీక్షంలోకి ప్రయోగించే స్థాయికి భారత దేశము చేరుకున్నది.  ఇస్రో స్థాపనకు కృషిచేసి ఈ విజయాలన్నిటికి కారణము అయినా వ్యక్తి డాక్టర్ విక్రమ్ అంబాలాల్  సారాభాయ్. ఆయన అంతరిక్ష రంగములో చేసిన అవిరళ కృషి వల్ల నేడు ఆయనను ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కు పితామహుడిగా కీర్తించవచ్చు ఆయన చేసిన నిరంతర కృషి వల్ల స్వాతంత్రము తరువాత ఖగోళశాస్త్రము లో ఒక ఘనత వహించిన దేశముగా ఇండియాకు కీర్తి సంపాదించి పెట్టాడు అంతేకాకుండా డాక్తర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తల ప్రతిభను వెలుగులోకి తెచ్చి వారిని ప్రోత్సహించిన వాడు విక్రమ్ సారాభాయ్. ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన 1919లో వస్త్ర పరిశ్రమలో పేరుగాంచిన అంబాలాల్ సారాభాయ్ ఎనిమిది మంది సంతానంలో ఒకడిగా జన్మించాడు. అంబాలాల్ సారాభాయ్  మహాత్మా గాంధీకి మంచి మద్దతుదారుడు స్వయముగా మహాత్మా గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమము ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు  భారీగా విరాళాలు ఇచ్చిఆదుకున్న  వ్యక్తి . విక్రమ్ సారాభాయ్ సోదరి మృదుల సారాభాయ్ భారతీయ స్వాతంత్ర సంగ్రామములో చురుకైన పాత్ర పోషించింది. గుజరాత్ లో కాలేజీ చదువు పూర్తి చేసుకొని పై చదువులకు కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయానికి వెళ్ళాడు రెండవ ప్రపంచ యుద్దము మొదలవగానే  ఇండియా కు తిరిగి రావలసి వచ్చింది. ఆయన డాక్టరేట్ చేయటానికి సలహాలు ఇచ్చిన వ్యక్తి మరెవరో కాదు అప్పట్లోనే  ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత అయినా డాక్టర్ సివి రామన్. 1947 నాటికి సారాభాయ్ ట్రాపికల్ లాటిట్యూడ్ లలో కాస్మిక్ కిరణాల ప్రభావము గురించి పరిశోధన చేసి తన డాక్టరేటును పొందాడు. 

అందవాద్ లోని షాహిబాగ్ లోగల రిట్రీట్ బంగళాలోని  అవుట్ హౌస్ లో ఒక గదిని తన ప్రయోగాలకు వాడు కున్నాడు.ఆగదిలో నుండే యువ మేధావి అయిన  సారాభాయ్ తన ఫిజికల్ రీసర్చ్ లేబొరేటరీ పనిని ప్రారంభించాడు. ఆ విధముగా 1947లోస్వాతంత్రము తరువాత అవిశ్రాన్తాముగా కృషి చేసి  అంతరిక్ష ప్రయోగాలు చేయటానికి  ఫిజికల్ రీసర్చ్ లేబొరేటరీని (PRL)ను ప్రారంబించాడు.ఈ రోజుకి ఆ లేబొరేటరీ అంతరిక్ష పరిశోధనలలో అగ్రగామిగా నిలిచింది సారాభాయ్ కి గురువు మార్గదర్శకుడు అయిన డాక్టర్ సివి రామన్  1952లో ప్రస్తుతము ఉన్న PRL కేంపస్ కు పునాది వేశాడు. 28 ఏళ్ల  వయస్సులోనే సారాభాయ్ భారత ప్రభుత్వాన్ని ఒప్పించి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ను (ISRO) స్థాపించాడు. ఆ వయస్సులో అందరు వాళ్ళ వాళ్ళ సొంత ప్రయోయోజనాలకు తాపత్రయ పడుతుంటే సారాభాయ్ భారతదేశములో అంతరిక్ష సంస్థను స్థాపించటానికి కృషి చేసి సఫలీకృతుడైనాడు. ఆ రోజుల్లో రష్యా స్పుత్నిక్ అనే రాకెట్ ను ప్రయోగించింది అది ప్రేరణగా తీసుకొని ఇండియా వంటి అభివృద్ధి చెందే దేశము కూడా ప్రయత్నిస్తే  చంద్ర మండలము మీదికి రాకెట్ ప్రయోగించగలదు  అని ప్రభుత్వాన్ని నమ్మించ గలిగాడు.ఆ నమ్మకము వల్లే ISRO స్థాపించబడింది. ఒక సందర్భములో ఈ అంతరిక్ష పరిశోధనలు మన ఇండియా వంటి అభివృద్ధి చెందే దేశాలకు అనవసరం అని వాదించే వారికి దీటైన సరిఅయిన సమాధానము సారాభాయ్ చెప్పాడు. “మనకు అభివృద్ధి చెందిన దేశాలతో అంతరిక్ష పరిశోధనలో పోటీ పడాలని వారిని మించి పోవాలని బలమైన కోరిక ఏమిలేదు. కానీ మనము ఎవరికీ ఏవిధముగాను తీసిపోము ముఖ్యముగా సాంకేతిక రంగములో అని ప్రపంచానికి తెలియజేయాలి అంటే ఈ అంతరిక్ష పరిశోధనలు అవసరము.”అని సారాభాయ్ అంటాడు. భారత దేశము యొక్క మొదటి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతముగా 21 నవంబర్ 1963న ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలోకి మొట్టమొదటి రాకెట్ ప్రయోయోగము జరిపాడు తిరువనంతపురం సమీపాన గల తుంబా అనే గ్రామములో త్రివేండ్రం బిషప్ ను ఒప్పించి ఒక పునరుద్ధరింపబడిన చర్చ్ నుంచి ఈ ప్రయోగమును సారాభాయ్ నిర్వహించాడు ఆ విధముగా తుంబా గ్రామములో తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచ్ కేంద్రము (ప్రస్తుతము విక్రము సారాభాయ్ జ్ఞాపకముగా”విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గా పిలవబడుతుంది) ప్రారంభించబడింది. విజయవంతముగా రాకెట్ ప్రయోగము జరిగినాక ఇంటికి ఒక చిన్న టెలిగ్రామ్ ఇచ్చాడు అందులో “అభ్డుతమైన రాకెట్ షో “అని తెలియజేశాడు. డాక్టర్ అబ్దుల్ కలాం ఉద్యోగ నిమిత్తము వచ్చినప్పుడు ఆయనను ఇంటర్వ్యూ చేసినది విక్రమ్ సారాభాయే తరువాత ప్రారంభ దశనుండి కలాం కు మార్గదర్శకుడిగా ఉండి అయన విజయాలన్నిటికి కారణభూతుడైనాడు. ఈ విషయాన్ని కలాం స్వయముగా తెలిపాడు.”నేను చాల ఎక్కువ విద్యాధికుడిని కాకపోయినప్పటికీ కష్టించి పనిచేసేవాడిని అవటంవల్ల సారాభాయ్ నన్ను గుర్తించి అన్ని విధాలుగా ప్రోత్సాహించేవాడు నేను అయన ద్వారా చాలా జ్ఞానాన్ని సంపాదించు కున్నాను. అయన నా అభివృద్ధికి దోహదపడ్డాడు నన్ను సెలెక్ట్ చేసుకోవటమే కాకుండా నాకు భాద్యతలు అప్పజెప్పి నా విజయాలకు కారణము  అయినాడు ,నా అపజయాలకు నా ప్రక్కనే వుండి  నన్ను నిరుత్సహానికి గురికాకుండా కాపాడేవాడు”, అని కలాం తెలియజేశాడు. భారతదేశము యొక్క మొదటి ఉపగ్రహము ఆర్యభట్ ప్రయాగములో  విక్రమ్ సారాభాయ్ కీలక పాత్ర వహించాడు. దురదృష్ట వశాత్తు 1971లో, చిన్న వయస్సులోనే (52 ఏళ్లకే ) స్వర్గస్తుడైనప్పటికీ మొదటి ఉపగ్రహ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగానే పూర్తిచేసాడు. అయన ఉపరితల వాతావరణములో  కాస్మిక్ కిరణాల ధర్మాల గురించి చేసిన ప్రయోగాలు నేటికీ సైన్సులో ముఖ్యమైన మైలు రాళ్లుగా నిలిచిపోయినాయి.

ఈ రోజు మనము ఇళ్లలో కూర్చుని కేబుల్ టివి చూస్తున్నాము అంటే మనము విక్రమ్ సారాభాయ్ కి కృతజ్ఞతలు చెప్పాలి నాసా తో అయన జరిపిన సంప్రదింపుల ద్వారానే  1975  లో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ (SITE) ప్రారంభించటం వల్ల ఇండియాలో కేబుల్ టివి ప్రారంభమైంది. అహమ్మదాబాద్ టెక్స్టయిల్ ఇండస్ట్రీస్ రీసర్చ్ అసోషియేషన్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ వంటి పెద్దవైన సైన్ టిఫిక్ సంస్థలను స్థాపించటమే గాకుండా నాణ్యమైన విద్యావ్యాప్తికి అహమ్మదాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ అనే సంస్థను ప్రారంభించటంలో ప్రముఖ పాత్ర వహించాడు ఈ రోజున ఆ సంస్థ మేనేజ్మెంట్ విద్య నందించే సంస్థలలో అగ్రగామి గా నిలిచింది ఈ విధముగా భారత దేశ  శాస్త్ర ప్రగతికి అంతరిక్ష పరిశోధనలకు మూల పురుషుడుగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.