బిపిన్ చంద్ర పాల్

          స్వాతంత్ర సమరయోధులలో “లాల్బాల్, పాల్”  త్రయములో ప్రస్తుతము పాల్ గా ప్రసిధ్ధి చెందిన బిపిన్ చంద్ర పాల్ గురించి తెలుసుకుందాము. ఈయన ప్రస్తుతము బాంగ్లాదేశ్ లో ఉన్న పూర్వ బెంగాల్ రాష్ట్రము లోని హాబీగంజ్ జిల్లా లోని పోయిల్ గ్రామములో ఒక సాంప్రదాయక హిందూ వైష్ణవ కుటుంబములో నవంబర్ 7, 1858లో  జన్మించాడు. తండ్రి చంద్ర పాల్ పర్షియన్ భాషా పండితుడు. తల్లి నారాయణి దేవి . మొదటి భార్య గతించటం వల్ల 1891లో ద్వితీయ వివాహము చేసుకున్నాడు. ఈయన కొడుకు నిరంజన్ పాల్ బాంబే టాకీస్ వ్యవస్థాపకులలో ఒకడు.  ఈయన చర్చ్ మిషన్ కాలేజీలో చదువుకొని అక్కడే బోధించాడు కూడా. ఉపాధ్యాయుడిగా ప్రారంభించి కలకత్తాలోని పబ్లిక్ లైబ్రరీలో లైబ్రరీయన్ గా ఉద్యోగమూ చేసెవాడు. ఆప్పుడే కేశవ్ చంద్ర సేనాడ్, శివనాథ్ శాస్త్రి, బికె గోస్వామి, ఎస్ ఎన్ బెనర్జీ వంటి  ప్రముఖుల పరిచయము వల్ల ప్రత్యక్షరాజకీయాలలో పాల్గొనే ఆసక్తి ఏర్పడింది. ముఖ్యముగా ఈయన తిలక్లజపతిరాయ్ వంటి ప్రముఖుల భావజాలానికి ఆకర్షితుడైనాడు. బిపిన్ చంద్ర పాల్ ను ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్స్ గా పేర్కొంటారు అంతేకాకుండా భారత స్వాతంత్ర సంగ్రామములో ప్రముఖ పాత్ర వహించిన వారిలో ముఖ్యుడు. స్వాతంత్ర పోరాటంలో ఆరునెలలపాటు జైలు జీవితము గడిపాడు.            1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జేరాడు. 1887లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ సమావేశములో బ్రిటిష్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఆయుధాల చట్టమును ఉపసంహరించాలని గట్టిగా వాదించాడు. 1898లో ఇంగ్లండ్ వెళ్లి కంపేరిటివ్ థియాలజిని అధ్యయనము చేయటానికి వెళ్లి స్వదేశీయ ఉద్యమాన్ని ప్రబోధించటానికి భారతదేశానికి తిరిగివచ్చాడు. లాలా లజపతిరాయ్, బాల గంగాధర తిలక్ లతో కలిసి విప్లవ భావాలతో పనిచేశాడు. పూర్ణ స్వరాజ్, స్వదేశీ ఉద్యమం, జాతీయ విద్యావిధానము వంటి పథకాలకు అరబిందోఘోష్ తో కలిసి వ్యూహ రచన చేయటంలో ప్రముఖపాత్ర వహించాడు. స్వదేశీయ వస్తువుల వాడకము విదేశ వస్తువుల బహిష్కరణల గురించి ప్రజలకు తీవ్రముగా ఉద్భోధించాడు దానివల్ల మనదేశములో నిరుద్యోగము దారిద్య్రాన్ని నిర్ములించవచ్చు అని ప్రజలకు అర్ధమయేటట్లుగా ఉపన్యాసాల ద్వారా వివరించాడు. 

          సమాజములో సామాజిక రుగ్మతలను తొలగించి తద్వారా జాతీయభావాలను ప్రజలలో పెంపొందించవచ్చు అని వాదించాడు. సహాయ నిరాకరణ వంటి ఉద్యమాల వల్ల పెద్దగా ఫలితము ఉండదు, వీటివల్ల బ్రిటిష్ ప్రభుత్వము ఏమి దారికి రాదు అనినమ్మేవాడు. ఈ విధముగా మహాత్మ గాంధీతో విభేదించేవాడు. స్వతహాగా జర్నలిస్ట్ అవటం వల్ల తన జర్నలిజం వృత్తిని దేశభక్తి భావాలను, సామాజిక స్పృహలను ప్రజలలో పెంపొందించటానికి కృషి చేసేవాడు. డెమొక్రాట్, ఇండిపెండెంట్ వంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేశాడు. బెంగాలీ భాషలో క్వీన్ విక్టోరియా జీవితచరిత్రను వ్రాశాడు. స్వరాజ్ అండ్ ప్రెసెంట్ సిట్యుయేషన్, ద సోల్ అఫ్ ఇండియా వంటి అనేక గ్రంథాలను రచించిన మహా మేధావి బిపిన్ చంద్ర పాల్.          బిపిన్ చంద్ర పాల్ చివరి వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పోరాటం సాగించాడు. హిందూ మతములోని చెడు  సాంప్రదాయాలపైనా తిరుగుబాటు చేశాడు. బ్రహ్మ సమాజములో సభ్యుడిగాజేరి స్త్రీ, పురుషుల మధ్య తారతమ్యాలు ఉండరాదని వాదించాడు. విధవ వివాహాలను ప్రోత్సహించాడు. స్త్రీ విద్యను ప్రోత్సహించాడు.   

          తన జీవితములో చివరి ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ ను వీడి ఒంటరి జీవితాన్ని గడిపాడు. జాతీయ ఉద్యమానికి బలమైన నాయకుడిగా అరబిందో ఘోష్ చే కొనియాడబడ్డాడు. ఈయన ప్రముఖ రాజకీయవేత్త మాత్రమే కాదు ప్రముఖ జర్నలిస్టు, మంచి వక్త, బెంగాల్ విభజనను తీవ్రముగా వ్యతిరేకించిన నాయకుడు. మే 20, 1932లో పరమపదించాడు. స్వతంత్ర సమరంలో ఈయన ఎంత మందికో స్ఫూర్తిదాయకంగా ఉండి ఆయన తన కీర్తి ప్రతిష్ఠలతో  భారత దేశ చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు.