ఎవరు… గ్రహాంతరవాసులా? – ఎ-6

 – బి. అఖిల్ కుమార్

జవాన్లను దృష్టి మరల్చి అడవిలోకి వచ్చారు వినీత్, కాత్యాయని.

“అడవిలోకి వచ్చేసాం. పద లోపలి వెళదాం” అంది చుట్టూ చూస్తూ.

“బట్ బి కేర్ ఫుల్. నేను అడవిలోకి రావడం ఇది రెండో సారి” అన్నాడు వినీత్.

“వాట్. అంటే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చావా?”

“ఎస్. కాని లోపలికి రాగానే నా తల బరువెక్కి స్పృహ తప్పి పడిపోయా. ఆ హోటల్ అబ్బాయి వచ్చి హోటల్ కి తీస్కేళ్ళాడు” అని వినీత్ అనడం పూర్తీ కాక ముందే వాళ్లిద్దరికి తలలు బరువు ఎక్కుతున్న భావన కలిగింది. బరువు ఎక్కుతున్న భావం విపరీతంగా మారుతుండగానే ఇద్దరు  స్పృహ తప్పి నేల మీద కుప్పకూలిపోయారు.

*        *        *        *

కాత్యాయని ఏ క్షణంలోనైన బయటికి వెళ్ళవచ్చని నిద్రని నటిస్తూ మేల్కునే ఉంది ప్రియాంక. కాత్యాయని బయటకి వెళ్ళగానే ఆమె వెనకాలే తానూ వెళ్దామని. కాత్యాయని బురఖాలో బయటకి వెల్లగానే పడక మీద లేచి కూర్చుంది ప్రియాంక. ‘ఒక ఐదు నిమిషాలు ఆగి వెళతా’ లేకపోతే నేను వస్తున్నా అని కనిపెట్టేస్తుంది’ అనుకుని ఓ ఐదు నిముషాల పాటు అలాగే కూర్చుంది. వాచ్ చూసి లేచి కాత్యాయని మూసి వెళ్ళిన తలుపులను తెరవబోయింది. కానీ బయట గడియ ఉండటం తో ఎంత తీసిన తలుపులు తెర్చుకోలేదు. ప్రియాంక ఊహించని విషయం అది. ‘నేను కూడా వెనకే వస్తా అని ఎలా ఊహించింది అసలు’ బయట గడియ వేసినందుకు కాత్యాయినిని తిట్టుకోవాలో నేను వెనకే వెళితే నాకేమన్న అవుతుందన్న భయంతో వేసిందని ఆనందించాలో తెలియని సంకట స్తితిలో అక్కడే కింద కూలబడింది ప్రియాంక.

క్షణాలు… నిమిషాలు… గంటలు…. అలా చూస్తుండగానే తెల్లవారిపోయింది… అయిన ఇంకా కాత్యాయని తిరిగి రాలేదు.. తలుపు తెర్వనూ లేదు. ప్రియాంక గుండెల్లో గుబులు మొదలైంది. మనసు అదే పనిగా కలవరపడసాగింది. ఇక ఇలాగే ఉండి లాభం లేదనుకుని లేచి తలుపులను బలంగా బాదడం ప్రారంభించింది.

ఆ చప్పుడుకి రంగ వచ్చి బయట గడియ తీసి “బయట నుండి ఎవరు గడియ పెట్టారు మేడం” అన్నాడు లోపల మనుషులు ఉండగా బయట నుండి ఎవరు గడియ పెట్టారో అర్థం కాక.

“నా స్నేహితురాలు అడవిలోకి వెళ్ళింది” అతని మాటలని పట్టించుకోకుండా గాబరాగా అంది.

“ఏంటి మేడం”

“నాతో పాటు ఈ గదిలో దిగిన ఇంకో అమ్మాయి నేను ఇద్దరం ఫ్రెండ్స్. తను నాకు తెలియకుండా అడవిలోకి వెళ్ళింది. ప్లీజ్ హెల్ప్ మీ” అంది దీనంగా.

ఓ క్షణం పాటు నివ్వేరపోయి అంతలోనే నవ్వేస్తూ “మీ ఫ్రెండ్ అడవిలోకి వెళ్దామని వెళ్ళినా అక్కడ జవాన్లు రాత్రి పగలు తేడ లేకుండా కాపల ఉన్నారు. ఎవ్వరని వెళ్ళనివ్వరు. మీరేం కంగారు పడకండి. నాకు తెలిసి మీ స్నేహితురాలు అక్కడే జవాన్ల దగ్గరే ఉండి ఉండొచ్చు. అడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నించిందని అక్కడే ఎక్కడికి వెళ్ళనివ్వ కుండ ఉంచి ఉండొచ్చు” అన్నాడు.

ఆ మాటలు వినగానే అప్పుడు  ఆమె మనసు కాస్త తేలిక పడినట్టు అయింది. “అంతే అంటావా. అయితే ఇపుడు అక్కడే ఉండొచ్చు. నేను వెళత.” అంటూ కదలబోయింది..

“తొందర ఎందుకు మేడం మీ ఫ్రెండ్ ఎటు వెళ్లారు అక్కడే ఉంటారు. నిదానంగా  వెళ్ళండి. టిఫిన్ చేసి.” అన్నాడు రంగ.

“లేదు నేను వెళతా” అతని మాటలు పట్టించుకోకుండా అదే నైట్ ప్యాంట్ షర్టు దుస్తుల్లో బయల్దేరింది.

అడవి దగ్గరికి వచ్చింది ప్రియాంక. నేరుగా జవాన్ల  దగ్గరకు వెళ్లి “మా ఫ్రెండ్ ఎక్కడ?” అని అడిగింది.

“ఎవరు మీ ఫ్రెండ్? అయినా ఇక్కడ ఎందుకు ఉంటుంది మీ ఫ్రెండ్?” అంటూ కరుకైన స్వరంతో ఎదురు ప్రశ్న వేసాడు వారిలో ఒక జవాను. మరో  జవాను “అసలు నువ్వు ఎవరు? ఇంత  ప్రొద్దునే ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఏం  పని నీకు ఇక్కడ? చూడ్డానికి ఈ ఊరి అమ్మాయిలా లేవే” అన్నాడు.

వారు అడిగే ఏ ప్రశ్న పట్టించుకోకుండా “అదేంటి రాత్రి నా ఫ్రెండ్ అడవికి వచ్చింది కదా మీరు చూడలేదా?” అడిగింది.

“ఏంటి అమ్మాయి ఉదయాన్నే జోకు చేస్తున్నావు. అడవికి  ఎవరు వస్తారు. ఎవరు రాలేదు. మేము రాత్రి అంత ఇక్కడే ఉన్నాం” అన్నాడు ఓ జవాను.

“లేదు నా ఫ్రెండ్ వచ్చింది. జవాన్ల దృష్టి మరల్చి అడవిలోకి వెళ్త అని అన్నది. … అంటే ఆమె మీకు కనిపించలేదు అంటే… అంటే… అడవిలోకి వెళ్ళింది అన్నమాట…” అంటూ ఒక్కసారిగా రోదిస్తూ  కింద కూలబడిపోయింది ప్రియాంక. జవాన్లు అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.

*        *        *        *

విపరీతమైన తలనొప్పితో  మెలకువ వచ్చింది కాత్యాయానికి. బరువుగా కళ్ళు తెరిచింది. ఎదురుగా అంతా చీకటి. “ఎక్కడున్నా నేను?” అనుకుంటూ లేవ్వబోయింది. కాని అందుకు ఆమె శరీరం సహకరించలేదు. ఒంట్లో శక్తి లేదు. బలవంతంగా  లేచి కూర్చుంది. “ఎక్కడున్నా అసలు” అని ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంది.

‘అతను నేను అడవిలోకి వచ్చాం.. ఆ తరువాత అతను ఏదో చెబుతూండగా నాకు తల బరువు ఎక్కినట్టు అనిపించింది. అంతే.. తరువాత ఏమైంది? నేను స్పృహ తప్పి పడిపోయానా? మరి అతను? అసలు ఇపుడు ఎక్కడున్నా? అడవిలోనేనా..’ అనుకుంటూ తానూ ఉన్న చోట నేల తడిమి చూసింది. చేతికి గడ్డి, కొమ్మలు, ఆకులు, చెత్త, చెదారం తగులుతుంది అనుకుంది కానీ…. ఆమె చేతికి నునుపైన నేల తాకింది.  ‘ఇదేంటి నేల ఇలా ఉంది? అంటే నేను అడవిలో లేనా? ఆ జవాన్లు వచ్చి నన్ను బయటకు తీస్కొచ్చి గదిలో దింపారా?’ ఎన్నో ప్రశ్నలు ఆమె మెదడును తొలుస్తుంటే తన భుజాన్ని తడుముకుంది. తనతో పాటు తెచ్చుకున్న బ్యాగు భుజానికి ఇంకా అలాగే ఉంది. తన బ్యాగు తన వద్దే ఉందని అర్థమవగానే కొండంత ధైర్యం వచ్చినట్టు అయింది కాత్యాయానికి. వెంటనే భుజానికున్న బ్యాగు తీసి చేతులతో తడుముతూ లోపలి నుండి  టార్చి బయటకు తీసి ఆన్ చేసింది. కాని టార్చి వెలగలేదు. ‘ఏమైంది దీనికి కొత్తదే కదా. ఎందుకు వెలగడం లేదు’ అనుకుంటూ ఇంకో సారి ఆన్ చేసింది. ఊహూ.. ఆన్ కాలే. బలంగా తన చేతిపై దాన్ని కొట్టి మల్లి ఆన్ చేసింది. చిన్నగా వెలిగింది. ఆ వెలుగులో ముందుకు చూసిన ఆమె అదిరిపడింది. టక్కున టార్చి ఆఫ్ చేసింది. ఆమె ఒళ్ళంతా భయంతో వణికిపోతోంది… అసలు తాను చూసింది నిజమా లేక నా భ్రమా? అన్న అనుమానం వచ్చి మల్లి టార్చి ఆన్ చేసి ముందుకు చూసింది. అది భ్రమ కాదని అర్థమైంది ఆమెకి. టక్కున టార్చి ఆఫ్ చేసింది. ఆమె ఒంటి మీద రోమాలు అన్ని నిక్కపొడిచాయి.. భయంతో ఒళ్ళంతా ముచ్చెమటలు కమ్మేశాయి.

(ఇంకా ఉంది)