ఎవరు… గ్రహాంతరవాసులా? – భాగం: 1

          ఈ కథ, ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మొదలగునవి అన్నీ కల్పితము మాత్రమే. ఎవరినీ/దేనినీ ఉద్దేశించి లేదా అనుసరించి రాసింది కాదు.

*        *        *        *        *        *

          ‘మన అందరిని తొలిచే ప్రశ్న గ్రహాంతర వాసులు ఉన్నారా… లేరా?

          ఉంటే అసలు వాళ్ళు ఎక్కడ.. ఏ గ్రహంలో ఉంటారు?

          చూడ్డానికి ఎలా ఉంటారు?

          వాళ్ళు నిజంగానే మన భూమి పైకి వచ్చి వెళుతున్నారా?

          వీటన్నింటికి సమాధానం నల్లమల అడవుల్లో జరిగే కొన్ని సంఘటనలే ఆధారమా?

          ఈ ప్రశ్నకి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే ప్రజలు మాత్రం అవుననే అంటున్నారు. గత కొద్ది కాలంగా నల్లమలలో మనుషులు మాయమవుతున్న సంగతి అందరిని ఎంతో కలవరానికి గురిచేస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఇపుడు తాజాగా నల్లమలలో మనుషులు మాయమవడానికి అసలు కారణం మరెవరో కాదు ఏలియన్స్ అని ఇక్కడ నివసించే గ్రామస్తులు అంటున్నారు’ టీవిలో యాంకర్ ఇంకా మాట్లాడుతోంది. న్యూస్ చానల్ లో మధాహ్నం స్పెషల్ ఫోకస్ ప్రోగ్రాం చూస్తోంది కాత్యాయని.

          టుయ్… టుయ్… టియ్… టియ్… మంటూ మొబైల్ మోగసాగింది.

          విసుగ్గా సోఫాలోంచి లేచి బల్ల మీదున్న మొబైల్ అందుకుని తెర చూసింది. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక నుండి కాల్ అది. విప్పారిన ముఖంతో కాల్ రిసీవ్ చేసి “హేయ్ ప్రియ ఎలా ఉన్నావ్?” ఆప్యాయంగా పలకరించింది కాత్యాయని.

          “ఏదో అలా ఉన్నా”      

          టీవీ వాల్యూం తగ్గించి “అదేంటే అలా అంటావ్? ఏమైంది? చాలా రోజుల తరవాత కాల్ చేసావని నేను ఆనంద పడుతూంటే.. నువ్వెంటే ఇలా..” అంది.

          “నీతో మాట్లాడాలి కాత్య నువ్వు మా ఇంటికి వస్తావా?” అభ్యర్తనగా అవతలి నుండి ప్రియాంక గొంతు.

          “అదేంటే అలా అడుగుతావ్.. రా అని ఆర్డర్ వేస్తె నేను రానా?”

          “ఎపుడు వస్తావు? ఇవ్వాళ రాగలవా?”

          “ఈరోజా? మీ ఇల్లు మా పక్క వీధిలో ఉందనుకుంటున్నావా తల్లి”

          “ఇపుడే అన్నావ్. ఆర్డర్ వెయ్యి వస్తా అని. మర్చిపోయావా”

          “అది కాదే.. వస్తా. కానీ ఇప్పటికిప్పుడు ఉన్నపళాన ఎలా వచ్చేది. ఇంతకీ అంత అర్జంట్ విషయం ఏంటే?”

          “అవన్నీ ఫోనులో చెప్పేవి కావు. నువ్వు ముందు రా అంతే. ఇక నీ ఇష్టం” కాల్ కట్ అయింది.

          ‘ప్చ్… ఏంటిది ఇలా కట్ చేసింది?’ అనుకుని తిరిగి కాల్ చేసింది. స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. కాత్యాయని భృకుటి ముడివడింది. అప్రయత్నంగా ఆరోజు అపూర్వతో మాట్లాడుతూంటే కాల్ కట్ అవడం మళ్ళీ చేస్తే అపూర్వ ఎత్తకపోవడం అంతా ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఆ వెంటనే చలిగాలి వీచిన భావనకి లోనయింది. ‘ఏమైంది ప్రియాంకకు? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది?’ రకరకాల ప్రశ్నలు ఆమెలో తలెత్తసాగాయి. ‘ఒకటి మాత్రం అనిపిస్తోంది ప్రియ ఏదో ప్రమాదంలో ఉందేమోనని’ అలా అనుకుంటూ మనసులో ఓ స్థిర నిర్ణయానికి వచ్చి ‘ప్రియాంక దగ్గరికి వెళ్ళాల’ని అనుకుంది.

          “ఎవరు కాత్యా ఫోనులో?” వంట గదిలో నుండి హాల్లోకి వస్తూ అడిగింది యశోద.

          “ప్రియాంక అమ్మ. నన్ను అర్జంట్ గా రమ్మని ఫోన్ చేసింది”

          “ఏంటట విషయం?”

          “అదే నేనూ ఆలోచిస్తుంది. ఏంటని అడిగితే ఇంటికి రా అక్కడే చెప్తా అని కాల్ కట్ చేసింది. మళ్ళి నేను చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తోంది”

          “అదేంటి..”

          “అదేగా నాకర్థం కానిది. నాకెందుకో కంగారుగా ఉంది అమ్మ. ఇంత అర్జంట్ గా రమ్మంది అంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. నేను ఇవ్వాళే బయల్దేరతానమ్మా”

          “ఇప్పుడా? నాకు తెలియదు. వద్దన్నా నువ్వు నా మాట వినవు, మీ నాన్నని అడిగి వెళ్ళు” అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది యశోద.  

          సరిగ్గా అప్పుడే బయటి నుండి కాత్యాయని తండ్రి మోహన్ లోపలకు వచ్చాడు. భార్య మాటలు విని “ఏమైంది రా? ఏం అడిగావేంటి మీ అమ్మని” అన్నాడు కాత్యాయనితో.

          “చూడు నాన్న. నా ఫ్రెండ్ అర్జంట్ పని మీద ఇవ్వాళ రమ్మంది. నేను వెళతానంటే అలా అంటోంది” గారాలు పోయింది కాత్యాయని.

          చిన్నగా నవ్వి “ఇంతకీ ఏ ఫ్రెండ్? ఎక్కడికి వెళ్ళేది?” అడిగాడు సోఫాలో కూర్చుంటూ.

          “ప్రియాంక నాన్న. వరంగల్”

          ఆలోచిస్తూ “హైదరాబాద్ నుండి వరంగల్ కి ఇప్పుడా. రేపు వెళ్ళు” అన్నాడు.

          “ప్లీజ్ నాన్న. అర్ధరాత్రిల్లు కూడా దేశాలు దాటి వెళ్తున్న రోజులు ఇవి. నేను వరంగల్ కే కదా నాన్న వెళ్ళేది”

          “సరే నీ ఇష్టం”

          “థాంక్యూ నాన్న”

*        *        *        *        *        *

          బ్యాగులో కావలసిన వస్తువులు, బట్టలు సర్దుకుని తన గదిలోంచి హాల్లోకోచ్చింది కాత్యాయని. ఎదురుగ హాలులో విమల కనిపించగానే “అత్తయ్య ఎప్పుడొచ్చారు?” అడిగింది బ్యాగుని బల్ల మీద పెట్టి దగ్గరికి వెళుతూ.

          “ఇందాకేరా. మీ అమ్మతో మాట్లాడుతున్న… ఇంతలో నువ్వు వచ్చేసావ్” అంది. బ్యాగుని చూసి “ఎక్కడికి వెళుతున్నావ్?” అడిగింది విమల.

          “మా ఫ్రెండ్ దగ్గరికి అత్తయ్య”

          “అలాగా”

          “అవునత్తయ్య” విమలతో అని, “అమ్మ.. నాన్నేరి? నేను బయల్దేరతా..” అడిగింది యశోదని.

          “మేడ మీద ఉన్నారమ్మా”

          “నాన్నని పిలువమ్మ.. టైం అవుతోంది ట్రైన్ కి”

          “పిలుచుకువస్త” అంటూ లేచెళ్ళింది యశోద మేడ మీదకు.

          “కాత్యా” అంది విమల.

          “చెప్పండి అత్తయ్య”

          “ఇలా రా పక్కన కూర్చో” అని, “నిజం చెప్పాలంటే నేను నీతోనే మాట్లాడదామని వచ్చాను. కానీ నువ్వు ఊరెలుతున్నావు..”

          “ఇంకా వెళ్ళలేదుగా.. చెప్పండత్తయ్య”

          కాస్త తటపటాయించింది విమల.

          “పర్వాలేదు అత్తయ్య. చెప్పండి” అంటూ ఆమె పక్కన వెళ్లి కూర్చుంది కాత్యాయని.

          యశోదా, మోహన్ లు మేడ దిగి వచ్చారు.

          “మీ అమ్మనాన్నలతోనూ ఈ విషయం మాట్లాడా. వాళ్ళు నిన్నే అడగమన్నారు. నీ ఇష్టమే వాళ్ళ ఇష్టమని..” అంటూ సందిగ్ధంగా ఆగిపోయింది.

          “అబ్బా.. అత్తయ్య.. ఏంటిది.. సాగదీస్తున్నారు సీరియల్లోలా? చెప్పేయండి. నేనేమన్నా పరాయిదాన్నా.. ఇలా మాట్లాడుతున్నారు”

          దాంతో చిన్నగా నవ్వింది విమల.

          విమల అడిగేదానికి కాత్యాయని యేమంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు యశోద, మోహన్ లు.

          “మీ బావ గురించేర కాత్యా. ఇలా అడగడం తప్పో రైటో అర్థం కావడం లేదు కానీ.. అడగక తప్పడం లేదురా. నువ్వు వరుణ్ ని పెళ్లి చేసుకుంటావా?” టక్కున అడిగేసింది విమల.

          విమల అలా అడుగుతుందని ఎంతమాత్రం ఊహించని కాత్యాయని ఓ నిమిషం పాటు బొమ్మలా అయిపోయింది. ఏమనాలో తెలియలేదు తనకు. “అత్తయ్య..” అంటూ ఆగిపోయింది.

          “చెప్పు తల్లి వరుణ్ ని చేసుకుంటావా?”

          “ఏంటత్తయ్య ఇది? నేను వరుణ్ ని పెళ్లి చేసుకోవడమేంటి? వరుణ్ ని… అసలు అపూర్వ భర్త ని నేను అలా ఎలా….” ఇకపై మాట్లాడలేకపోయింది కాత్య.

          “అది కాదమ్మా.. అపూర్వ దూరమైన దగ్గరి నుండి వాడి పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. వాడు చాలా ఒంటరి వాడైపోయాడు. ఎంత బలవంతం చేసినా ఇంకో పెళ్లి చేసుకోమంటే చేసుకోనని మొండికేసాడు. కానీ నేనోటి గమనించాను. వాడు నీతో మాట్లాడే సమయంలో మామూలుగా.. మునుపటి వరుణ్ లా మాట్లాడటం. నాకు ఏమనిపిస్తోందంటే వాడు అపూర్వను నీలో చూస్తున్నాడేమోనని”

          “వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అందుకే అలా మాట్లాడతాడు. మీరు తప్పుడు అర్థాలు తీస్తున్నారు అత్తయ్య. అయినా నేను వరుణ్ ని ఎప్పుడు అలాంటి ఉద్దేశంతో చూడలేదు… చూడను కూడా. సారీ అత్తయ్య. మీరు ఎన్ని సార్లు అడిగిన మీ ప్రశ్నకు ఇదే నా సమాధానం. బావ అంటే నాకు ఎంతో అభిమానం.. అదీ కాక నా బెస్ట్ ఫ్రెండ్. అంతే! అంతకు మించి నేను ఊహించుకోలేను. ఎందుకంటే తను అపూర్వ భర్త అత్తయ్య. ప్లీజ్ ఈ విషయంలో నన్ను బలవంత పెట్టొద్దు” అంది కాత్యాయని.

          అప్పటి వరకూ విమలలో ఉన్న ఆశ కాస్త పోయింది. “వాడిని కూడా ఈ మాట అడిగా కాత్య. వాడూ నీ లాగే అంటున్నాడు. నువ్వు మంచి స్నేహితురాలివని. ఇంకోసారిలా మాట్లాడొద్దని నన్ను కసురుకున్నాడు. కానీ ఎంతైనా వాడి తల్లిని కదా. ఎక్కడో ఆశ. వాడు నీకు ఇష్టమయితే… పెళ్ళికి నువ్వు వాడిని ఒప్పించగలవనే నమ్మకం… అందుకే ధైర్యం చేసి అడిగా కాత్య. చేసుకుంటావా అని..”

          “వరుణ్ పెళ్లి గురించి మీరేం దిగులు పడకండి అత్తయ్య. వరుణ్ తో నేను మాట్లాడత. ఇంకో పెళ్ళికి ఒప్పిస్త. సరేనా. నేను ఊరి నుండి రాగానే వరుణ్ ని పెళ్లికి ఒప్పించకపోతే నా పేరు కాత్యానే కాదు. ఓకేనా. మీరు దిగులు పడకండి” అంటూ లేచింది.

          అందరికి వెళ్ళొస్తానని చెప్పి బ్యాగుని తీసుకుని తండ్రితో రైల్వే స్టేషనుకి బయలుదేరింది కాత్యాయని.

          వాళ్ళు వెళ్ళగానే హాల్లో అంతా నిశ్శబ్దం పరుచుకుంది.

          “గంపెడు ఆశతో వచ్చా యశోద..” దిగాలుగా అంది విమల.

          “బాధపడకు వదిన” అంది యశోద.

          “బాధపడకుండా ఎలా ఉండగలను. ఒక్కగానొక్క కొడుకు. వాడి జీవితం ఇలా అవుతుందని నేననుకోలేదు”

          విమల అలా అనగానే అపూర్వ కళ్ళ ముందు మెదిలింది యశోదకు.

          “నాకు వరుణ్ పెళ్లి కాత్యాయనితో అయితేనే సంతోషంగా ఉంటాడనిపిస్తోంది వదిన. కానీ వీళ్లేమో…” అంది విమల.

          యశోదకు కూడా వరుణ్ కి కాత్యాయనిని ఇవ్వడం ఇష్టమే. ఎందుకంటే మంచి గుణవంతుడు.. అపూర్వను ఎంత బాగా చూసుకున్నాడో వాళ్ళకి తెలుసు. ఇంత మంచి అల్లుణ్ణి వదులుకోవడం ఒక రకంగా ఆమెకు కూడా ఇష్టం లేదు. అలా అని కాత్యాయనిని బలవంత పెట్టనూలేదు. “ఈ కాలం పిల్లలు మన మాట ఎక్కడ వింటారు వదినా” అంది.

          “దేవుడా.. నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేయు” అంటూ దేవుణ్ణి ప్రార్థించింది విమల.

*        *        *        *        *        *

          కాత్యాయనిని రైలెక్కించి వెళ్ళిపోయాడు మోహన్.

          రైల్లో కూర్చున్న కాత్యాయని ఆలోచనంత ప్రియాంక తనతో మాట్లాడిన మాటల గురించే. ‘ఏమైంది అసలు? ఎందుకు తనని ఇంత అర్జెంట్ గా రమ్మంది? మళ్ళీ కాల్ చేస్తే ఎందుకు తన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది?’ ఇలా ఎంత బుర్రచించుకున్నా ఒక్క ప్రశ్నకూ ఆమెకు బదులు దొరకడం లేదు. ఎన్నో సార్లు మళ్ళీ మళ్ళీ ప్రియాంకకు కాల్ చేసింది. కానీ ఎన్ని సార్లు చేసిన స్విచ్డ్ ఆఫే.

          ‘ప్రియాంక దగ్గరికి వెళితే కాని అసలు విషయమేంటో తెలియదు’ అనుకుంటుండగా ప్రియాంక తల్లి జ్ఞాపకం వచ్చింది. ‘నా తెలివి తెల్లారినట్టే ఉంది. వాళ్ళ అమ్మ నంబరు ఉండి కూడా నేను ప్రియాంకకే ఫోన్ చేస్తున్న. ఛ..’ అనుకుని ప్రియాంక అమ్మగారికి కాల్ చేసింది.

          చాలాసేపు రింగ్ అయిన తరువాత కాల్ లిఫ్ట్ చేసారు.

          “హలో ఆంటీ. నేను కాత్యా. హైదరాబాద్ నుండి. ప్రియ ఉందా?”

          “ఏమ్మా కాత్య ఎలా ఉన్నావ్. ఏంటి ప్రియ నెంబర్ లేదా? నాకు కలిపావ్?”

          “నేను బాగానే ఉన్నాను ఆంటీ. ప్రియ నెంబర్ ఉంది. కానీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది”

          “అవునా.. ప్రియ హన్మకొండలో ఉంది కదరా. అక్కడేగా జాబ్ దానిది. నీకు చెప్పలేదా”

          “తెలుసు ఆంటీ. నాకు ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అందుకే ఇంట్లో ఉందేమోనని మీకు చేశా. అయితే ఇంట్లో లేదా? మరి నన్ను ఏంటీ ఇంటికి రమ్మంది?” ఆశ్చర్యంగా అడిగింది కాత్యాయని.

          “అవునా. మళ్ళీ ఇంకోసారి చేయు. నేను కూడా చేసి కనుక్కుని చెబుతాలే నీకు”

          “హన్మకొండలో ఎక్కడ ఉంటుంది ఆంటీ?”

          “ఏమోనమ్మ. పాత అడ్రస్ తెలుసు కానీ… మొన్నే ఇంకో ఇంటికి షిఫ్ట్ అయ్యానంది. మీ అంకుల్ ఇంట్లో లేరు. వచ్చాక అడ్రస్ కనుక్కుని చెబుతా సరేనా”

          “అంటీ ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి కాల్ చేసి అంకుల్ ని అడుగుతారా?”

          “ఊరికి వెళ్ళాడమ్మా. కాల్ కలవదు. మీ అంకుల్ కలిపితేనే మాట్లాడటం. వచ్చాక అడిగి చెబుతాలే.. తొందరేముంది”

          “ఒకే అంటీ” అనేసి ఉంటానని చెప్పి కాల్ కట్ చేసింది కాత్యాయని.

          ‘ఇపుడు ఎక్కడికి వెళ్ళాలి? హన్మకొండా? వరంగలా? హన్మకొండ చేరగానే ఇంకోసారి ఫోన్ చేస్తా. అంకుల్ వస్తే ఆంటీ చెబుతారు. సో అక్కడి నుండి అటే ప్రియ దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ రాకపోతే.. ఇక వరంగల్ వెళ్ళాల్సిందే’ అనుకుంది.

          రైలు… కూ… అంటూ వరంగల్ దిశగా దూసుకుపోతోంది.

(ఇంకా ఉంది)

ప్రణయమా.. స్వార్థమా? 2 – భాగాలు: 12

ప్రణయమా… స్వార్థమా? 1  భాగాలు: 1234567