హ్యాపీ బర్త్ డే – కురచ కథ

          వంశీకి ఆరో బర్త్ డే ఫంక్షన్ నిర్వహింపబడుతోంది.

          ఆహ్వానితులతో ఫంక్షన్ హాలు సందడిగా ఉంది.

          వంశీ తన క్లాస్ మేట్స్ తో ఉత్సాహంగా ఉన్నాడు.

          వంశీ తల్లిదండ్రులు శివరావు, కవిత కలివిడిగా అక్కడ అన్ని పనులు దగ్గరుండి చూస్తున్నారు.

          శివరావు, కవితల ఏకైక సంతానం వంశీ.

          వంశీ కోరిక మేరకే ఈ ఫంక్షన్ వేడుగ్గా జరిపిస్తున్నారు ఈ మారు.

          శివరావు బిజినెస్ మేన్.

          కవిత హౌస్ వైఫ్.

          ఆ ఇరువైపుల వారి బంధువులు, స్నేహితులు ఆహ్వానింపబడ్డారు.

          వంశీ గత పది రోజులుగా తన ఈ పుట్టిన రోజును చాలా మంది సమక్షంలో చేయమని మరీ మరీ కోరడంతో, ఆ దంపతులు చాలా శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

          ఫంక్షన్ మొదలయ్యింది.

          కేక్ కట్టింగ్ పూర్తయ్యింది.

          “వంశీ కోరిక మేరకు ఇంతగా ఈ ఫంక్షన్ను చేపట్టాను. పైగా తను ఆహ్వానితుల సమక్షంలోనే ఈ తన పుట్టిన రోజు కానుకను కోరుకుంటానన్నాడు. సో, వంశీ, గో హెడ్. ఏం కావాలో కోరు. తప్పక ఇస్తాను” అన్నాడు శివరావు చాలా ఉత్సాహంగా.

          వంశీ, “డియర్స్, నేను మీ అందరి ముందు నా డాడీని నా బర్త్ డే గిఫ్టుగా ఒకటి కోరాలనుకున్నాను. అందుకు డాడీ కూడా ఒప్పుకున్నారు. పైగా నేను కోరే గిప్టును తప్పక ఇస్తానని మీ అందరి ముందు డాడీ కూడా ఇప్పుడే చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. డాడీ, ఈ రోజు నుండి మీరు డ్రింకింగ్, స్మోకింగ్ మానేయాలి. ఇది నా ఈ బర్త్ డే గిప్టుగా కోరుకుంటున్నాను.” అని మాట్లాడేడు.

          ఆ హాలు చాలాసేపు నిశ్శబ్దం ఐపోయింది.

          కొంత సేపు తర్వాత, శివరావు, వంశీని దగ్గరగా తీసుకొని, “ష్యూర్ మై సన్. గ్రాంటెడ్.” అని చెప్పాడు, ఉబికి వస్తున్న తన కన్నీరుకు అడ్డుపడక.

          “ప్రామిస్” అన్నాడు వంశీ తన కుడి అర చేతిని చూపుతూ.

          శివరావు తన కుడి అరచేతిని వంశీ తల మీద పెట్టి, “ప్రామిస్ కన్నా” అన్నాడు.

          కవిత ఉక్కిరిబిక్కిరైపోతోంది – తను ఇన్నాళ్లు తన భర్త చేత మానిపించలేనివి, ఇలా ఇప్పుడు గట్టెక్కి పోతున్నాయన్న ఆనందంతో. అతి ప్రయత్నంతో కదిలి వెళ్లి వంశీని దగ్గరగా తీసుకొని, గట్టిగా వాడిని తన గుండెకేసి హత్తుకుంది.

          ఆ హాలు చప్పట్లతో మారుమోగిపోతోంది.

***

24 thoughts on “హ్యాపీ బర్త్ డే – కురచ కథ”

  1. కథ చక్కగా సందేశాత్మకంగా ఉంది.

Comments are closed.