జీవన పోరాటం – కవిత

అదృశ్యం నుండి దృశ్యం

చీకటి నుండి వెలుగు

ఉదయం నుండి అస్తమయం

వెలుగు నుండి చీకటి

కరిగిపోకుండా వెలగలేదు ఏ దీపం

ఇదంతా జీవన పోరాటం

ఇదెంతో విచిత్రం

వికాసం నుండి వార్ధక్యం

రాలిన చోటే చిగురు

భ్రమణంతో వలయం పూర్తిచేసే పరిభ్రమణం

మధ్యలో మిగిలేదే జీవితం

దారిలో కలిగేదే అనుభవం

ఇదంతా జీవన పోరాటం

ఇదెంతో విచిత్రం

శూన్యం నుండి అనంతం

అనంతం నుండి శాశ్వతం

కష్టమైన కలలు నిజమైనా నీళ్ళు

కన్నీళ్లు ఆనంద భాష్పాలని వాటికి పేర్లు

మొదటి నుండి మొదటికే ఈ ఆరాటం

ఇదంతా జీవన పోరాటం

ఇదెంతో విచిత్రం

ఓడితే ఒంటరి మధనం

జయిస్తే జనవలయం

ఆటుపోట్లలో అధఃపాతాళం

ఆశయం సాధిస్తే అందలం

ఒక్క మనిషికి రెండు ప్రతిబింబాలు

ఇదంతా జీవన పోరాటం

ఇదెంతో విచిత్రం