జ్వాలముఖి – భాగం – 4

          ఇద్దరు రాజులు కలిసి కుముది రాజ్యంపై దాడి చేసి ఆ జ్వాలముఖి మణి ఫలితం పంచుకోవాలనుకొంటారు. అలా ఒప్పందం కుదుర్చుకొంటారు. యుద్ధం ప్రకటించకుండానే దాడి చేయాలి అని నిర్ణయించుకొంటారు. ఆరోజు రాణిగారు యుద్ధంలో పాల్గొని గెలిపొంది అలసిపోయి రాజ్యం చేరుకొంటారు. అలసట వలన తన మందిరంలో పవళిస్తారు. ఈ లోపు రాజులు సైన్యంతో దాడికి బయలుదేరతారు. రాజా మందిరంలో ఉన్న జ్వాలముఖి మణి నుంచి సంకేతాలు వస్తుంటాయి, ఆ ఓంకార నాదం రాణి వారికి వినిపించదు. మెలుకువ వచ్చేసరికి రాజులు కోట పై దాడికి దిగుతారు. రాణిగారికి ఏమి చేయాలో తోచక తన చెలికత్తెకి ఆ జ్వాలముఖి మణి, మంత్రం గల లేఖను ఇచ్చి తన మందిరం లోపలి నుండి ఉన్న రహస్య దారి నుండి పంపిస్తారు. కాని అక్కడ ప్రాణాలు హరించే విష సర్పం ఉందని రాణిగారు హడావిడిలో మర్చిపోయారు. రాజావారు ఇంక రాణివారు ఆ రహస్యదారి కట్టించినప్పుడు అక్కడ ఒక విష సర్పం పెట్టారు. అది రాజు కుటుంబీకులను తప్ప మరెవరు వచ్చినా వారి ప్రాణలు తీస్తుంది. ఆ చెలికత్తెని ఆ విష సర్పం కాటేస్తుంది. ఆ విషసర్పం దాడిలో ఆ జ్వాలముఖి మణి ని లేఖని పక్కన ఉన్న రాళ్ళలోకి విసిరేసి ప్రాణాలు వదులుతుంది చెలికత్తె.

          ఋషి చెప్పిన విధముగా జ్వాలముఖి మణి దూరం అవగానే ఆ రాజులు చేసిన దాడిలో మహారాణి మరణిస్తుంది. రాజకోటలో ఎంతవెతికినా ఆ జ్వాలముఖి మణి దొరకదు రాజులకి. నిరాశగా వెనుదిరుగుతారు  రాజులు. ఆ తర్వాత కొంతకాలానికి రాజులు కాలం చేస్తారు.  అన్ని ప్రాణాలు బలి తీసుకున్న ఆ జ్వాలముఖి మణి ఆ రాళ్ళలో భద్రంగా ఉండిపోతుంది. 

250 సంవత్సరాల పిమ్మట 

          ఆచార్య శ్రీ రాఘవులు పురాతన తవ్వకాలపై పరిశోధన చేస్తుంటారు. ఎన్నో వస్తువులు అలా వెతికి తన కార్యాలయంలో భద్రపరచుతుంటారు. రాజులు వారి జీవిత చరిత్రలపై పరిశోధన చేస్తు అంతా ఒక డైరీలో రాసుకుంటాడు. రాజులవారి చిత్రపటాలు గీయడం ఈయన అలవాటు. అలా పురాతన వస్తువులపై పరిశోధనలో భాగంగా కుముది రాజకోటకి వస్తాడు. ఆ రాజకోట శితిలావస్తలో ఉంటుంది. అక్కడ చాల ఖడ్గాలు, రాజుల కిరిటాలు, చాలా వస్తువులు దొరుకుతాయి. అలా పరిశోధన చేస్తున్న తనకి ఆ రుమూలో ఒక అద్భుతమైన వస్తువు(జ్వాలముఖి మణి) కనపడుతుంది. ఆ జ్వాలముఖి మణి, మంత్రం చూసిన ఆయనకి దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆ రాజకోట పురాణం గురించి శోధించాలి అని గ్రంథాలయానికి వెళ్ళి ఆ రాజ్యంకి సంబంధించిన గ్రంథాలు అన్ని చదివేస్తాడు, ఆ జ్వాలముఖి మణి గురించి తెలుసుకుంటాడు. సంతోషంతో తన భవిష్యవాణి తెలుసుకుందామని ఆ మంత్రం ఉచ్ఛరిస్తాడు. కాని ఆ జ్వాలముఖి మణి ఏ మహాశక్తి రూపంలోకి మారదు. ఎన్ని సార్లు ఉచ్ఛరించిన ఫలితం కనిపించదు. కాలం గడుస్తున్న కొద్ది నిరాశకి లోనౌతాడు. ఆ జ్వాలముఖి మణి తన దగ్గరికి వచ్చినప్పటి నుండి, రోజు ఏవో భయంకరమైన కలలు వస్తుంటాయి. ఇంక వయసు మీద పడతున్నకొద్ది ఏమి చేయాలో పాలుపోక ఆ జ్వాలముఖి మణి అక్కడ ఏదో ఒక దైవ కారణం వల్లనే దేవుడు పెట్టి ఉంటాడు, ఆ దైవకార్యం తన వల్ల నాశనం అవకూడదని చెప్పి ఆ జ్వాలముఖి మణి, మంత్రం ఎక్కడ నుంచి తీసాడో అక్కడే మరల చేరుస్తాడు. జ్వాలముఖి మణి బొమ్మని ఇంక అది ఎక్కడ ఉంది అన్న వివరాలు కూడా తన డైరీలో రాసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కాలం చేశారు. ఇంతమంది ప్రయత్నాలని విఫలం చేస్తు ఆ జ్వాలముఖి మణి అక్కడే సురక్షితంగా ఉండిపోయింది.

75 సంవత్సరముల తర్వాత

          AVIT యూనివర్సిటీ భారతదేశంలో అతి ముఖ్యమైన యూనివర్సిటీలో ఇది ఒక యూనివర్సిటీ. ఇంకా చెప్పాలి అంటే ఈ కాలేజ్ లో చదివాను అని చెప్తే చాలు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ లేకుండానే తీసుకుంటారు. ఎంట్రన్స్ పరిక్షలో మెరిట్ లో వస్తేగాని ఈ యూనివర్సిటీలో ప్రవేశం దొరకదు. ఎందరో విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదవాలని ఎంట్రన్స్ లో మెరిట్ లో సంపాదించుకోవాలనుకుంటారు.

          అలాంటి విద్యార్థుల్లో కృష్ణప్రతిక్, చైతన్య వర్మ కూడా ఉన్నారు. ఈ యూనివర్సిటీలో చదవాలని వీళ్ళ జీవిత ధ్యేయం. కృష్ణప్రతిక్ చాలా తెలివైన కుర్రాడు. యూనివర్సిటీ ఎంట్రన్స్ లో మొదటి ర్యాంకు తెచ్చుకున్నాడు. చాలా చురుకైన విద్యార్థి. ఏదన్నా విషయం చూస్తే దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పగల మేధావి.

          చైతన్య వర్మ ఆటలో నెంబర్ 1. చదువులో అంతంత మాత్రం అయినా ఆటలో మాత్రం నేష్నల్ ప్లేయర్. నేష్నల్ సర్టిఫికెట్ ఉండడం వల్ల యూనివర్సిటీలో సీటు లభించడం కష్టం అవ్వలేదు. చలాకీ కుర్రాడు. అందరితో స్నేహంగా ఉండడం అతని నైజం. మంచి మాటకారి. మాటలతో మాయచేయగల నేర్పరి. మొత్తానికి ఒకరు చదువులో ఇంకొకరు స్పోర్ట్స్ కోట ద్వారా యూనివర్సిటీలో సీటు సంపాదించి వారి లక్ష్యంలో ఒక మెట్టు ఎదిగారు.

          యూనివర్సిటీలో సీటు సంపాదించడం లక్ష్యం కదా మళ్ళీ ఒక మెట్టు మాత్రమే అంటారేంటి అనుకుంటున్నారా? యూనివర్సిటీ చరిత్ర తెలుసుకుందాం ఇప్పుడు.

          యూనివర్సిటీ మరేమిటో కాదు, కుముది రాజ్యం రాజకోట మరమత్తులు చేసి అందమైన, విశాలమైనా యూనివర్సిటీగా మార్చారు. అందుకే రాణి అవంతిక దేవి నామధేయమే యూనివర్సిటీకి పెట్టారు AVIT(Avantika Varshini Institute of Technology) యూనివర్సిటీ అని. మరి ఈ యూనివర్సిటీలో చేరడానికి కృష్ణప్రతిక్, చైతన్య కి ఏదైనా కారణం ఉందా? అవును వీరిద్దరు ఎవరో కాదు ఇద్దరు రాజుల వారసులు. ఆ రాజుల వారసత్వంతో పాటు పట్టుదల, పౌరుషం కూడా పునికిపుచ్చుకున్నారు. రాళ్లలో పడిపోయిన జ్వాలముఖి మణి ని సంపాదించి వాళ్ళ మునిముత్తాతల సంకల్పం పూర్తిచేయడమే ఆశయంగా పెట్టుకున్నారు. స్వతహాగా ఆటలంటే పడని చైతన్య తన చదువుపై ఉన్న నమ్మకం వల్ల ఎలాగూ మెరిట్ సాధించలేనని ఇలా స్పోర్ట్స్ కోటలో సంపాదించడానికి ఆటలని ఎంచుకున్నాడు. ఇరువురు ఒకటే కార్యం పై చేరిన ఒకరికి ఇంకొకరు పరిచయం లేదు.

          ఇద్దరు హీరోలని సృష్టించినప్పుడు హీరోయిన్ కూడా ఉండాలి కదా! పేరు అపుర్వ. చాలా సుకుమారి. నిమ్మపండు రంగులో, మృదువైన చర్మం, పలికితే కోకిలా స్వరమా అన్నట్టుగా ఉండే గొంతు కవి భాషలో వర్ణించాలి అంటే దివి నుండి భువికి వచ్చిన దేవకన్యలా ఉంటుంది.

          అపూర్వ యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న వేరే కాలేజ్ లో చేరుతుంది. కాని ఎందుకో ఆ కళాశాల నచ్చదు తనకి. కాలేజ్ మొదటి రోజు యూనివర్సిటీలో కొత్త స్టూడెంట్స్ కి ఘనస్వాగతం లభించింది. ఇంజినీరింగ్ కాలేజ్  అంటే సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ సహజమే. అది తప్పించుకునే ప్రయత్నాలలో పడతాడు చైతన్య. అందుకోసం ఓ పథకం వేస్తాడు. దానిలో భాగంగా ఆ ఏరియా పోలీస్ కి కాల్ చేసి కాలేజ్ లో మీ అమ్మాయిని ఎవరో అబ్బాయి ఏడిపిస్తున్నారు అని చెప్తాడు. ఆ పోలీస్ రాగానే అందరూ పారిపోయారు మిమల్ని చూసి అని చెప్తాడు. సరే అని చెప్పి చైతన్యని జాగ్రత్తగా ఉండమని,  పిచ్చి వేషాలు వేయద్దని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఇవ్వన్ని సీనియర్స్ గమనిస్తూ ఉంటారు. పోలిస్ వెళ్ళిపోగానే చైతన్యని పిలుస్తారు. పోలిస్ ఎవరు? ఎందుకొచ్చారు? అని అడుగుతారు.

          దానికి చైతన్య ఆయన మా నాన్నగారు కాలేజ్ లో దిగపెట్టి వెళ్ళడానికి వచ్చారు అని చెప్తాడు. మరి ఎందుకలా హెచ్చరించి వెళ్తున్నారు అని అడుగుతారు. దానికి చైతన్య, ఏమి లేదు ఎవరన్నా ర్యాగింగ్ చేస్తే తనకి చెప్పమన్నారు అని చెప్తాడు.  

          తను మాట్లాడుతుంది సీనియర్స్ తో అని తెలిసి కూడా కావాలని “మీరు కూడా జూనియర్స్ లాగా ఉన్నారు, మిమల్ని అంటే చెప్పండి” అని చెప్తాడు. దానికి పాపం వాళ్ళు కంగారు పడిపోయి “మేము నీ సీనియర్స్, కాని ఇవాళ నుండి నువ్వెవరో మేమెవరమో” అని అక్కడి నుండి జారుకుంటారు. అలా తన బుద్ది బలంతో తప్పించుకుంటాడు చైతన్య.   

          ఇక కృష్ణప్రతిక్. కాలేజ్ లో ప్రవేశించగానే పాపం సీనియర్స్ పట్టుకొంటారు. వాళ్ళు ఉండి ఇలా చెప్తారు – “మేము ఈ యూనివర్సిటీలో 4 సం||లుగా ఉంటున్నాము ఈ కాలేజ్ గురించి మాకు తెలియని 15 విషయాలు చెప్పు” అని చెప్తారు. స్వతహాగా మేధావి. ఏరికోరి ఆ కాలేజ్ లో సీటు సంపాదిస్తాడు. ఆ కాలేజ్ చరిత్ర మొత్తం తెలుసుకొని వచ్చిన కృష్ణప్రతిక్ కి ఆ ప్రశ్నకి నీళ్ళు తాగినంత తేలిక కదా! ఇక చెప్పడం మొదలు పెట్టాడు కృష్ణప్రతిక్ – “కాలేజ్  ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు, మొత్తం ఎన్ని రూములు, మొదటి కాలేజ్  ప్రిన్సిపాల్ ఎవరూ! ఆ కాలేజ్ స్థాపకులు, దాతలు, ఏ సంవత్సరంలో ఎన్ని ర్యాంకులు”- ఇలా చెప్తానే ఉంటాడు. కొన్ని విషయాలు అయితే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కి కూడా తెలియవు. ఇవన్నీ విన్న సీనియర్స్, ప్రిన్సిపాల్ కంగుతింటారు. కృష్ణప్రతిక్ కి సంస్కృతం గ్రాంథికంలో కూడా ప్రావీణ్యం ఉంది. అలా మొత్తానికి ఒకరు మేధస్సుతో ఇంకొకరు బుద్ధి బలంతో ర్యాగింగ్ భాద నుండి తప్పించుకుంటారు. ఇక అపూర్వ అయిష్టాంగానే కాలేజ్ లో చేరుతుంది. అపూర్వ స్నేహితురాలు AVIT యూనివర్సిటీలో చేరుతుంది. ఇద్దరు ఒకే బైక్ పై రావడం, వెళ్ళడం కాబట్టి అపూర్వ కాలేజ్ అయిపోయాక యూనివర్సిటీకి వచ్చి తన స్నేహితురాలిని తీసుకెళ్ళేది. వారం రోజులు గమనించాక అపూర్వకి యూనివర్సిటీ బాగా నచ్చుతుంది. ఇంక ఆ యూనివర్సిటీ లోపలకి అడుగుపెట్టంగానే అపూర్వ కి మనసులో ఏదో తెలియని సంతోషం, ఎన్నో సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీ తో సంబంధం ఉన్నది అన్న ఒక అనుభూతి. ఎలా అయినా ఈ కాలేజ్ లో చేరాలని నిర్ణయించుకుంటుంది. వాళ్ళ నాన్నకు ఉన్న పలుకుబడితో సీటు సంపాదిస్తుంది.

          అపూర్వ ని చూడగానే ముగ్ధుడౌతాడు కృష్ణప్రతిక్. కాని నెమ్మదస్తుడు కాబట్టి మాట్లాడే ధైర్యం చేయలేకపోతాడు. కనీసం తన పేరు కూడా తెలుసుకోడు. మరోవైపు వాళ్ళు వచ్చిన పని కూడా కానిస్తూ ఉంటారు. కృష్ణప్రతిక్ ఆ కాలేజ్ గ్రంథాలయంలో కోటకి సంబంధించిన పుస్తకం ఉండాలి అని గట్టినమ్మకం. అదే పనిగా రోజుల తడబడి వెతుకుతుంటాడు. అది విషాలమైయిన గ్రంథాలయం, అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి. 4 వారాలు వెతుకుతాడు ఆ పుస్తకం కోసం అయిన దొరకదు. నిరాశ చెందుతాడు.

          ఇదంతా గమనిస్తుంటాడు ఆ యూనివర్సిటీ ప్రిన్సిపాల్. పేరుకి ప్రిన్సిపాల్ అయిన అందరు స్టూడెంట్స్ తో సరదాగ ఉంటాడు. గణితం లెక్చరర్. బాగా చదువుతాడు కాబట్టి మంచి అభిప్రాయం ఉంది కృష్ణప్రతిక్ పైన. కృష్ణప్రతిక్ ని పిలిచి అడుగుతాడు -“ఏంటి ఈ మధ్య గ్రంథాలయంలో కనిపిస్తున్నావు. దేని కోసం వెతుకుతున్నావ్” అని ప్రశ్నిస్తాడు. కృష్ణప్రతిక్ – “ఒక పుస్తకం కోసం వెతుకుతున్నా కాని దొరకడం లేదు” అని చెప్తాడు. దానికి ప్రిన్సిపాల్ ఒక పుస్తకం కోసం కాలయాపన దేనికి, మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి వెళ్ళి చదువు అని చెప్పి వెళ్ళిపోబోతూ ఈ మధ్య గ్రంథాలయం మరమత్తులు చేసి కొత్త పుస్తకాలు అమర్చారు. నీకు కావలిసిన పుస్తకం ఆ గదిలో ఉందేమో చూడు అని చెప్తాడు. కృష్ణప్రతిక్ ధన్యవాదాలు చెప్పి ఆ గది వైపు పరుగుతీస్తాడు.   

          తన శ్రమ ఫలిస్తుంది. ఆ రాజకోట చరిత్రతో పాటు అప్పుడు ఆచార్య శ్రీరాఘవులు తాను రాసుకున్న డైరీ కూడా అక్కడ ఉంటది కాని అది ఎవరు అక్కడ పెట్టారో అర్ధమవదు. చాలా సంతోషంగా అవి తీసుకుని బయలు దేరుతాడు. మరోవైపు చైతన్య, ఆ కాలేజ్  మ్యాప్ చూస్తే మొత్తం కాలేజ్  స్థలంలో 75% కాలేజ్  భూమి, 25% భవనాలు కట్టి ఉన్నాయి. ఆ భవనాల కింద ఉండదు జ్వాలముఖి మణి ఎందుకంటే ఒక వేళ ఉండి ఉంటే భవనం కట్టినప్పుడు బయటపడి ఉండేది. అలా జ్వాలముఖి మణి దొరికినట్టు ఎక్కడ వినపడలేదు. కాబట్టి ఆ కాలేజ్  భూమిలోనే ఏదో మూల రాళ్ళలో ఉండి ఉండాలి అనుకున్నాడు. తనకి అనుమానం ఉన్న స్థలాలు అన్ని గుర్తు పెట్టుకొని అవి అన్ని వెతికితే సునాయాసంగా కనుకోవచ్చు అని అనుకొంటాడు.

          అనుకున్నదే తడవుగా వెళ్ళి ప్రిన్సిపాల్ తో ఇలా చెప్తాడు. మన కాలేజ్  గ్రౌండ్ లో కొన్ని మార్పులు చేసి కావలిసినవి కట్టిస్తే సౌకర్యంగా ఉంటుంది. ఆడేవాళ్ళకి బాగా సహాయం అవుతుంది, ఇంక చాలా బాగా నేర్చుకొని కప్పులు కొట్టి కాలేజ్ కి మంచి పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటది అని చెప్తాడు. ప్రిన్సిపాల్ కి చైతన్య బాగా ఆడతాడని తెలుసు, కాలేజ్  టోర్నమెంట్స్ లో కప్పులన్ని అతనికే వచ్చాయి కాబట్టి అడగగానే ఒప్పుకుంటాడు. అలా చైతన్య తాను అనుకున్న స్థలాలు మార్పులు చేయిస్తాడు కాని ఫలితం కనిపించదు.

          చైతన్యకి కృష్ణప్రతిక్ పై అనుమానం ఉంటుంది. సీనియర్స్ అడిగినప్పుడు మాట కూడా మార్చకుండా కాలేజ్ చరిత్ర గురించి చెప్పినప్పుడు మొదలవుతుంది అనుమానం. అప్పటి నుండి గమనిస్తూ ఉంటాడు. గ్రంథాలయం చుట్టూ కృష్ణప్రతిక్ తిరగడం అంతా గమనిస్తాడు. కాని ఎప్పుడు ఎదురుపడలేదు కృష్ణప్రతిక్ కి. తన అనుమానం నిజమైతే ఒకవేళ నిజంగా కృష్ణప్రతిక్ కూడా జ్వాలముఖి మణి కోసం వెతుకుతుంటే అప్పుడు పరిచయం చేసుకుందామనుకుంటాడు. ఇదంతా కృష్ణప్రతిక్ కి తెలియదు.

          కృష్ణప్రతిక్ ఆ పుస్తకమును డైరీని ఇంటికి తీసుకెళ్ళి చదవడం మొదలు పెడతాడు. డైరీలో మంత్రం చూసి సంతోషపడతాడు. కాని ఆ మంత్రం కింద “ఇదే ఆ జ్వాలముఖి మణి చిత్రం ఇలా ఉంటుంది చూడడానికి” అని రాసి ఉంటుంది. కాని అక్కడ జ్వాలముఖి మణి తాలుక చిత్రం ఉండదు. ఒక కాగితం చించి ఉంటుంది. అప్పుడు కృష్ణప్రతిక్ కి అర్ధం అవుతుంది. తానే కాకుండా ఆ జ్వాలముఖి మణి కోసం కాలేజ్ లో ఎవరో వెతుకుతున్నారని ఎవరు అన్నది ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన వస్తుంది. అనుకున్నట్టుగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ రికార్డ్స్ అడుగుతాడు. కాని అవన్ని అలా ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి వెళ్ళమని చెప్తాడు ప్రిన్సిపాల్. తెలివైన వాడికి కాదు అన్న సమాధానం మింగుడు పడదు కదా! తన కంప్యూటర్ టెక్నాలజీ అంతా ఉపయోగించి ప్రిన్సిపాల్ రికార్డ్స్ హ్యక్ చేస్తాడు. ఆ రికార్డ్లో ఏ విద్యార్థి పేరు రాజుల పేర్లలా ఉంటుందో చూసి ఆ విద్యార్థిని గమనించాలనుకొంటాడు. కాని అతనికి ఒక విద్యార్థి పేరు మాత్రమే రాజకుటుంబికుల పేర్లలా అనిపిస్తుంది. అంటే అతనే ఆ జ్వాలముఖి మణి యొక్క చిత్రం మాయం చేసి ఉంటాడని అనుమానిస్తాడు.

          అతనెవరు అన్నది చూడాలనుకుంటాడు. అతను మరెవరో కాదు చైతన్య వర్మ. వారం రోజులు గమనించాకే అతనే ఆ జ్వాలముఖి మణి కోసం వెతుకుతున్నది అని తెలుసుకుని చైతన్య దగ్గరికి వెళ్ళి తనని తను పరిచయం చేసుకొని తానెవరు ఎందుకు ఆ కాలేజ్ లో చేరాడో చెప్తాడు. నిన్ను వారం నుండి గమనిస్తున్నాను నేను ఏ కార్యం కోసం ఇక్కడ చేరానో నువ్వు అందుకోసమే వచ్చావని తెలుసు. ఇద్దరం కలిసి వెతుకుదాం ఫలితం సమానంగా పంచుకుందాం అని చెప్తాడు. చైతన్యకి కూడా కృష్ణప్రతిక్ గురించి అతని తెలివి గురించి తెలుసు కాబట్టి ఒప్పుకుంటాడు. ఒంటరిగా వెతుకుదామని వచ్చి ఇలా ఇద్దరుగా అయ్యారు. కాని ఎవరికి వారు మనస్సులో తమకే పూర్తి ఫలితం దక్కాలి అన్న స్వార్ధం ఉంది.  

          వీరిద్దరికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళని ఇంకొక మనిషి గమనిస్తున్నారని, తానే అపూర్వ అని తెలియదు. అపూర్వకి మొదట రోజు నుండి వీరిద్దరి ప్రవర్తన చూసిని వీళ్ళూ దేనికోసమో బాగా బలంగా వెతుకుతున్నారు అని అర్ధం అయ్యిద్ది. అది ఏంటి అన్నది కనిపెట్టాలి అనుకుంటది. కృష్ణప్రతిక్ అపూర్వ మొదట చూపులోనే నచ్చిన కనీసం పేరు కూడా కనుకునే సాహసం కూడా చేయలేదు. అందుకే తాను ఎదురుపడితే చూడడమే తప్ప తానెవరు ఏం చేస్తుంది అనేవి తెలీవు. ఇక చైతన్య, మన వాడు చదువుకి ఎంత దూరమో అమ్మాయిలకి అంతే దూరం. కాబట్టి అపూర్వ అనే పేరు కాని అమ్మాయి కాని తెలీదు చైతన్యకి.   

          ప్రతి సంవత్సరం లాగే కాలేజ్  లో “Treasure Hunt”(నిధి అన్వెశణ) ని నిర్వహిస్తాడు ప్రిన్సిపాల్ . ఎవరి కన్నా ఏదన్న పురాతన వస్తువు కాలేజ్  నాలుగుమూలల్లో దొరికితే వారికి పెద్ద “బహుమతి” ఇస్తానని చెబుతాడు. అందరు విద్యార్థులు వెతికి వెతికి నిరాశగా తిరిగొస్తారు. అపూర్వ కి మాత్రం ఒక పుస్తకం దొరకుతుంది. అది సంస్కృతంలో ఉంటుంది. ఏమి అర్ధం కాక వెళ్ళి ప్రిన్సిపాల్ కి చూపిస్తుంది. అదేదో గ్రంథాలయంలోని పాతపుస్తకాల్లో ఒకటి అనుకుంటా అని చెప్పి తన దగ్గరే పెట్టుకోమని చెప్తాడు. అది తీసుకుని వెళ్ళి ఒక “ఫౌంటేన్” దగ్గర కూర్చుంటుంది అపూర్వ.  చేయి జారి ఆ పుస్తకం ఫౌంటేన్ లో పడిపోతుంది. నీళ్ళలో పడగానే ఆ పుస్తకంలోని కొన్ని అక్షరాలు నీలం రంగులోకి మారి ప్రకాశిస్తూ ఉంటాయి. అవి ఒక అపూర్వ కి మాత్రమే కనిపిస్తాయి. చుట్టూ ఉన్న స్నేహితురాళ్లకి కనపడదు. ఆ నీటిలోని పుస్తకం తీస్తుంటే అపూర్వ కి ఏదో జ్ఞాపకం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పుస్తకం తనతోపాటు ఇంటికి తీసుకెళ్తుంది. అలా నీలం రంగులోకి మారిన అక్షరాలను పేరుస్తుంది అపూర్వ. ఆ అక్షరాలన్ని కలిపి చూసిద్ది అపూర్వ కాని ఏమి అర్ధం కాదు. ఆ నీలం రంగులో మెరిసిన అక్షరాలలో ఆఖరి పదం చెరిగిపోయి ఉంటుంది. అలా ఆ అక్షరమాలికలో ఆఖరి పదం ఉండదు.

          అపూర్వ ఇంకో కాలేజ్ లో చేరినా తన స్నేహితురాలి కోసం ఈ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఏదో అతీత శక్తి చేత ఆకర్షింపబడి పట్టుబట్టి AVIT యూనివర్సిటీలో చేరుతుంది. కృష్ణప్రతిక్, చైతన్య దేనికోసమో వెతుకుతున్నారని అర్ధం కాదు.

          ఇక కృష్ణప్రతిక్, చైతన్యని జ్వాలముఖి మణి కి సంబంధించిన  చిత్రపటం గురించి అడుగుతాడు. కృష్ణప్రతిక్ ఏం అడుగుతున్నాడో అర్ధం అవదు చైతన్యకి. అప్పుడు డైరీ చూపించి ఇందులో నుండి చైతన్య చించిన జ్వాలముఖి మణి యొక్క చిత్రపటం గురించి అని చెప్తాడు. తాను ఏ కాగితం చించలేదని, ఆ డైరీని అప్పుడే చుస్తున్నానని చెబుతాడు చైతన్య. ఊహించని సమాధానంకి కంగుతింటాడు కృష్ణప్రతిక్. అంటే చైతన్య ఆ పటం తీయకపోతే ఇంకెవరు తీసుంటారు? అంటే వీరిద్దరు కాకుండా జ్వాలముఖి మణి కోసం ఇంకెవరైనా వెతుకుతున్నారా? ఎవరై ఉంటారు? ఇలా వివిధ ప్రశ్నలతో తల తిరిగినట్టు అనిపిస్తుంది కృష్ణప్రతిక్ కి. పటం గురించి చైతన్యకి చెప్పి ఎవరి పైన అయినా అనుమానం ఉందా అని అడుగుతాడు.

          దానికి చైతన్య మొదటి రోజు నుండి కృష్ణప్రతిక్ ని మాత్రమే గమనిస్తున్నట్టు ఇంకెవరిపైనా అనుమానం లేదని చెబుతాడు. ఎలాతెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటాడు కృష్ణప్రతిక్. రికార్డ్స్ లో అందరి పేర్లు చూసాడు ఎవరు కూడా రాజ కుటుంబ మనుషులు కారు. రాజుల వంశస్థులకి తప్ప వేరెవరికి ఆ జ్వాలముఖి మణి గురించి తెలీదు. తెలిసే అవకాశం తక్కువ. “ఇలా కాలయాపన చేయడం వ్యర్ధం! ఆ జ్వాలముఖి మణి మరొకరి కంటే ముందు తామె స్వాధీనం చేసుకుందాం” అని చెప్పి కృష్ణప్రతిక్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు చైతన్య. ఎలా అన్నదానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తుంటారు.

          చైతన్య దగ్గర ఉన్నా కాలేజ్  మ్యాప్ ని క్షున్నంగా పరీశిలిస్తుంటాడు కృష్ణప్రతిక్. అప్పుడో అలోచన తడుతుంది. ఆ కాలేజ్  మొత్తం రాణి వారి రాజకోట. ఆ కోటలో రాణివారి ఆంతరంగిక మందిరం ఏదో కనుక్కోగలిగితే రాణి తన చెలికెత్తని పంపిన భూగర్భ రహస్యదారి కనుక్కోవడం సులువుగా అవుతుంది. ఎందుకంటే అలాంటి రహస్య దారి ప్రతి రాజ్యంలో రాజు రాణి ఆంతరంగిక మందిరం నుండే ఉంటాయి కాబట్టి జ్వాలముఖి మణి దొరికే అవకాశాలు ఎక్కువవుతాయి మనకి అని చైతన్యకి చెబుతూ ఉంటాడు. కాని ఎలాగ తెలుసుకోవడం అని అడుగుతాడు చైతన్య. తాను కాలేజ్ లో చేరిన మొదట్లో పరిసరాల్లో ఉన్నా 3-4 గ్రంథాలయాల్లో తిరిగాను, అందులో ఒక దానిలో రాణి వారి జీవిత చరిత్రకి సంబంధించిన పుస్తకం ఒకటి ఉంది కాకపోతే నేను వెళ్ళిన సమయానికి ఎవరో చదువుతూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి ఆ గ్రంథాలయంలో చూస్తాను. ఎదైనా ఆధారం దొరకవచ్చు అని చైతన్యతో చెప్పి బయలుదేరుతాడు కృష్ణప్రతిక్. ఈ సంభాషణ అంతా చైతన్య సోదరి వింటుంది. కాని ఆమెకి ఏమి అర్ధం కాదు.

          ఆ రోజు సాయంత్రం ఆ అమ్మాయి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుంది. అక్కడ స్నేహితురాలి తండ్రి కనిపిస్తే పలకరిస్తుంది. ఆయన ఆ అమ్మాయిని చూసి “మీ అన్నయ్య ఇంకా పోకిరి వేషాలు వేస్తున్నాడా? ఏమన్నా మారాడా?” అని అడుగుతాడు. దానికి ఈ అమ్మాయి “లేదు మా అన్నయ్య తన స్నేహితుడితో కలిసి ఏదో విలువైన జ్వాలముఖి మణి కోసం వాళ్ళ కాలేజ్  లో వెతుకుతున్నారు” అని తాను విన్న చైతన్య-కృష్ణప్రతిక్ సంభాషణ మొత్తం వివరిస్తుంది. అదంతా వింటున్న ఆ స్నేహితురాలి తండ్రి మరెవరో కాదు! ర్యాగింగ్ నుండి తప్పించుకోవడానికి చైతన్య ఒక పోలీస్ ని పిలుస్తాడుగా. ఆ పోలీస్ ఇతనే. ఇతని పేరు “శేఖర్”.

          మరోవైపు కృష్ణప్రతిక్ ఆ గ్రంథాలయానికి వెళ్ళి ఆ పుస్తకం సంపాదించి చదవడం మొదలు పెడతాడు. ఆ పుస్తకంలో రాణి గారి చిత్రపటం చూసి నిర్ఘాంతపోతాడు. చిత్రంలోని పోలికలు అపూర్వ లా అనిపిస్తాయి. కాని ఎక్కువగా పట్టించుకోడు, ఎందుకంటే అపూర్వ కి రాజుల కుటుంబానికి సంబంధం లేదు కాబట్టి ఆ పుస్తకం మొత్తం చదివిన ఆ రాజకోటలో రాణివారి మందిరం ఎక్కడో అంతుచిక్కదు. ఏమి చేయాలో పాలుపోదు. ఆ మందిరం ఎక్కడ ఉందో అని ఆలోచిస్తున్న కృష్ణప్రతిక్ కి వాళ్ళ తాతగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఓ రాజ కోటలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని మార్పులు చేసిన ఆ రహస్య దారిని మాత్రం ఏం చేసిన మారదు అని. ఎందుకంటే రాజుల కాలంలో రహస్య దారులు చాల బలంగా కడుతారు ఎవరు దానిని కుల్చాడానికి కూడా ధైర్య సాహసాలు చెయ్యరు అంతా బలంగా గట్టిగా కడుతారు. అప్పుడు కాలేజ్ లో అసలు మార్పులు జరగని స్థలం ఏదన్నా ఉందా అని చైతన్యని అడుగుతాడు. కాలేజ్ వెనక భాగంలో గ్రౌండ్ వెనకాల ఒక తామర పువ్వు కట్టినట్టు ఉండి ఆ తామరపై సరస్వతీ దేవి విగ్రహం ఉంచారు. కాలేజ్ లో ఎన్ని మార్పులు చేసిన ఆ విగ్రహం, తామర పువ్వు కట్టడం మాత్రం అలానే ఉన్నాయి. ఆ విగ్రహం నాలుగు మూలలు 4 స్తంభాలు కట్టారు. వాటికి రంగులు దిద్దడమే తప్ప ఆ గుడిని ఎప్పుడు ఏ మార్పులు చేయలేదని చెప్తాడు.  

          అదే రాణి వారి ఆంతరంగిక మందిరం, ఆ పువ్వు కిందనే ఆ రహస్య దారి ఉందని చెప్తాడు కృష్ణప్రతిక్. ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు చైతన్య. రాణిగారి జీవిత చరిత్ర చదివినప్పుడు తన మందిరం మధ్యలో ఒక తామర పువ్వు కట్టించుకుందని అది అంటే మహారాణికి చాలా ఇష్టం అని రాసి ఉందని చెప్తాడు. ఆ జ్వాలముఖి మణి తామర పువ్వులో నుండే వచ్చింది కాబట్టి ఆ రహస్య దారికి గుర్తుగా ఆ తామర పువ్వు కట్టించుకొని ఉండొచ్చు అని, ముందు వెళ్ళి ఆ విగ్రహం కింద చూడాలి అనుకొంటారు ఇద్దరు.

          ఇంతలోపు వీరిద్దరిని కలవడానికి శేఖర్ వస్తాడు, అది చూసి ఆందోళనలో పడిపోతారు ఇద్దరు. “మీరిద్దరు మాఫియా వాళ్ళని మాకు  సమాచారం వచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను” అని చెప్తాడు శేఖర్. ఆ మాటకి కంగుతింటాడు చైతన్య. అదేంటి మాకేమి తెలియదు అని చెప్తారు. “ఇప్పుడు మీరేమి చేస్తున్నారు. ఏదో పథకం వేస్తున్నారు. దేని గురించో మాకు తెలుసు. మీరు మర్యాదగ ఒప్పుకుంటే మంచిది లేకపోతే కేసు పెట్టి జైల్లో పెడతానని భయపెడతాడు” శేఖర్.

          చూడడానికి గంభీరంగా కనిపించినా చైతన్య చాలా భయస్తుడు. జైలు అనేసరికి భయపడి కృష్ణప్రతిక్ వాదిస్తున్నా వినకుండా మొత్తం చెబుతాడు. దానికి శేఖర్ ఆ జ్వాలముఖి మణి గురించి తనకి ముందే తెలుసని, చాలా రోజులుగా దానిగురించి తను వెతుకుతున్నానని చెబుతాడు. సరే ముగ్గరం కలిసి వెతుకుదాం అంటాడు శేఖర్. చేసేదేమి లేక ఒప్పుకుంటారు. ముగ్గురూ వెళ్ళి ప్రిన్సిపాల్ ని అడుగుతారు. ఆ తామరపువ్వు ప్రక్కకి జరపాలని. సరస్వతీ విగ్రహం జరపడానికి ససేమిరా ఒప్పుకోడు ప్రిన్సిపాల్. అది అశుభం అని చెప్తాడు. శేఖర్ కి గవర్నమెంట్ లో ఉన్న పలుకుబడి అంతా ఉపయోగించి ఆ గుడి జరపడానికి అవసరమైన దరఖాస్తులు చేయించి సంబధిత అధికారి సంతకం తీసుకొని ఆ గుడి జరిపే ఉత్తర్వులతో వస్తాడు. చేసేదేమీ లేక ప్రిన్సిపాల్ ఒప్పుకొంటారు. ముగ్గురు కలిసి వెళ్ళి ఆ సరస్వతీ దేవి విగ్రహం పక్కన ప్రతిష్టించి ఆ తామరపువ్వుని తొలగించి చూస్తే ఆ రహస్య ద్వారం కనబడుతుంది. మిక్కిలి సంతోషితులౌతారు. కాని ఆ ద్వారాన్ని తెరవాలంటే ఆ ద్వారం మీదా కొన్ని సంస్కృతం పదాలు ఉంటాయి కాని అవి ఏంటో అర్థం కావు కాని ఆ ద్వారం తెరవడానికి ఒక పదం(కోడ్) వాడి ఏదో విధంగా సంస్కృతం పధాలు కలపాలి. ఆ పదం మూడు ప్రయత్నాలలోపు తేర్చకపోతే ఇక ఎప్పటికి అది తెరచుకోదు అని రాణి వారి చరిత్రలో రాసి ఉండటం గుర్తొచ్చి చెబుతాడు కృష్ణప్రతిక్. మరి ఆ ద్వారం తెరిచే పదం ఉందా ఆ పుస్తకంలో అని అడుగుతారు, కాని ఉండదు. ఆ పనిని కృష్ణప్రతిక్ మేధస్సుకి వదిలేస్తాడు శేఖర్. కృష్ణప్రతిక్ ఆలోచించి జన్మనామం అని రాణీవారు పుట్టిన తేదిని పడాలుగ పేరుస్తాడు. ఆ వరుస క్రమాన్ని సంస్కృతంలోకి మార్చి ఆ క్రమంతో ద్వారం తెరవడానికి ప్రయత్నిస్తాడు. కాని తెరచుకోదు. ఇంకా రెండు సారులు మాత్రమే ప్రయత్నించవచ్చు. ఆలోచిస్తాడు కృష్ణప్రతిక్. రాణి వారు తన పేరుని, రాజు వారి పేరు కలిపి పెట్టి ఉండవచ్చు అని సంస్కృతంలో క్రమంలో పేర్చి ప్రయత్నం చేసి విఫలం అవుతాడు. కోపంతో ఊగిపోతాడు శేఖర్. కృష్ణప్రతిక్ కి గన్ చూపిస్తూ “నాటకాలు ఆడుతున్నవా? జాగ్రత్తగా ఆలోచించు. ఈ సారి తెరవకపోతే నిన్ను జైలో పెడతాను”- అని హెచ్చరిస్తాడు. బాగా ఆలోచిస్తూంటాడు కృష్ణప్రతిక్. అందరు కంగారు పడుతుంటారు. అక్కడ ఉన్న తామర పువ్వుని తీక్షణంగా గమనిస్తుంటాడు కృష్ణప్రతిక్. రాణి వారు ఎందుకు కట్టించుంటారు అని ఆలోచిస్తుంటాడు.

          ఇన్ని రోజుల శ్రమ వృధా అయిపోతుంది అని భయపడుతుంటారు. ఆ తామర రెక్కల వైపు అదే పనిగా చూస్తుంటే సంస్కృతంలో ఏదో కనిపిస్తుంది. అన్ని రెక్కలపై ఒకో అక్షరం ఉంటుంది. ఆ సంస్కృతం పదాలు జతచేయగా వచ్చిన పదంతోనే ఆ ద్వారం తెరవచ్చు అని అర్ధం అవుతుంది. అన్ని సరిక్రమంలో పెట్టి ఆ ద్వారం పై అమరుస్తాడు. మొత్తానికి విజయుడై ద్వారం తెరుచుకోగా ముగ్గురు సంతోషంగా లోపలికి ప్రవేశిస్తుంటారు. ఆ దారి ద్వారం మొదలు నుండి ఆఖరు వరకు వెతికి ఆ జ్వాలముఖి మణి కనబడక నిరాశ చెందుతారు. వారికి ఆ రహస్య దారిలో మనుషుల అస్థిపంజరాలు కనిపిస్తాయి. చైతన్యకు వారి తాతగారు చెప్పింది గుర్తొస్తుంది. ఎందరో లోపలికి వచ్చి బయటకి రాలేరని. ఆ దారి పొడువున గోడలపై ఏవో సంకేతాలు, రేఖాచిత్రాలు కనిపిస్తాయి కాని ఎవరికి అర్ధం కాదు. అంతటా వెతికి నిరాశతో బయటకి వస్తారు! పిమ్మట ఎదైనా ఆధారం కోసం వెతకడం ఉత్తమమాని భావిస్తారు.

          ఆ ముగ్గురిలో ఏ ఒక్కరికి ఆ జ్వాలముఖి మణి ఎలా ఉంటుందో తెలియదు. ఆ డైరీలోని చిత్ర పటం ఎలా కనుమరుగైందో కాని అది ఉండుంటే వెతకడం సులువు అయ్యి ఉండేదెమో అని అంటాడు చైతన్య, ఆ మాట వినగానే కృష్ణప్రతిక్ ఆ చిత్రపటం ఎవరు తీసి ఉంటారు అని అలోచిస్తూ జ్వాలముఖి మణి గురించి తెలిసింది రాజుల కుటుంబికులకి, శేఖర్ కి మిగతావారు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుండగా ఆ డైరీ రాసిన ఆచార్యులు గుర్తొస్తారు. డైరీలో ఎక్కడి నుండీ తీసానో అక్కడే పెట్టాను అని రాసి ఉంది. కాని ఆ దారిలో జ్వాలముఖి మణి లేదు అంటే ఆ డైరీ రాసిన ఆయన కుటుంబీకులని కలిస్తే ఎదైనా ఆధారం దొరకవచ్చు అనుకొని ముగ్గరు వారికి తోచిన విధంగా ఆ ఆచార్యులు కుటుంబం గురించి కనుక్కోవడం మొదలు పెట్టారు. చివరికి వారి కుటుంబీకులు ఎవరో తెలుసుకొని నిర్ఘంత పోవడం వారి వంతు అయింది. ఆ ఆచార్యులు వారి మనవడు వరెవరో కాదు ఆ కాలేజ్ గణితం మాస్టారు అదే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ గారే!!

(ఇంకా ఉంది)

భాగాలు: 1234