మంచి విద్యాసంస్థను ఎంచుకునేందుకు కొన్ని మార్గాలు

          మనకు ఉన్నతమైన భవిష్యత్తును అందించేది విద్య. జీవితంలో చదువు అనేది యెంత ముఖ్యమైనదో మనకు తెలియంది కాదు. అలాంటి చదువును అందించే కళాశాలల, విశ్వవిద్యాలయాల మొదలగు వాటి పట్ల మనం ఎంతో గౌరవ మర్యాదలు చూపుతుంటాం. కానీ ఈ మధ్య కొన్ని విద్యాలయాలు అంత నాణ్యమైన చదువును అందించకపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.

          విద్యాలయాలు నాణ్యమైన విద్య అందించకపోయినా చదవాలనే తీవ్ర కాంక్ష ఉంటె పట్టాను చిటికెలో సాధించగలగడం తేలికే అని వినడం మనం వినే ఉంటాం. నిజమే… కానీ అది అన్నంత తెలికేమీ కాదు. చప్పట్లు ఒంటి చేత్తో మొగవుగా!… రెండు చేతులు కలుస్తేనే అవి మొగేవి. విద్యార్థుల్లో చదవాలనే కాంక్ష ఉన్నట్టే బోధించాలి అనే భావన కలిగుండే విద్యాలయాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే అటు విద్యార్థులు పైకి ఎదిగేది అలాగే వారితో పాటు విద్యాలయాలకు పేరు, ప్రతిష్టలు వచ్చేది.

          ఇవన్నీ చెప్పడానికి కారణం ఓ విషయం మీకు చెప్పడానికి.

          చేరబోయే విద్యాలయం ఏదైనా కానివ్వండి ఉదా: పాఠశాల, ఇన్స్టిట్యూట్, కళాశాల, విశ్వవిద్యాలయం ఇలా ఏదైనా అవని.. కానీ వాటిల్లో చేరబోయే ముందు ఆయా విద్యాలయాల గురించి మనకు వివరాలు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఉన్నతమైన చదువు అభ్యసించాలనే మీ వాంచ, మీకు అక్కడ అధ్యాపకులు మంచి విద్యను బోధిస్తేనే కదా నెరవేరేది. అందుకే కనీస జ్ఞానం ఆయా విద్యాలయాల గురించి ఉండాలనేది నా భావన. అసలు ఎందుకు తెలుసుకోవడం అంటారా? చెప్తాను… మీరు ఒక కళాశాలలో చేరారు. కానీ అక్కడ అధ్యాపకులు మీకు పాఠాలను బోధించడం లేదనుకుందాం. అపుడు ఏం చేస్తారు మీరు? తెలివిగల విద్యార్థులు అయితే చేరిపోయాం కదా చేసేదేం లేదు అని వారంతట వారే ఇంటి దగ్గరో, ఫ్రెండ్స్ దగ్గరో చదువుకుని ఎలాగోలా కానిచ్చేస్తారు. కానీ తెలివిగలవాళ్ళు కాని వారి పరిస్థితి ఏంటి? అందరు వారంతట వారుగా చదువుకోలేరు.. అధ్యాపకులు చెబితేనే తలకు ఎక్కుతుంది కొందరికి. అలాంటపుడు వీరి పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదంటే ఆ విద్యాలయం గురించిన వివరాలు మనకు తెలియాల్సిందే. కాదంటారా?

దిగులు చెందకండి మీకు పలానా విద్యాలయంలో సీటు రాలేదని

          చాలా మంది ఉన్నతమైన చదువులకోసం ప్రసిద్ధ కళాశాలలో, విశ్వవిద్యాయాలయాల్లో ప్రవేశ పరీక్ష రాస్తుంటారు. వాటిల్లో సీట్లు రావడం అధిక మార్కులు వచ్చిన వారికీ సులువే, కానీ తక్కువ మార్కులు స్కోరు చేసిన వారికే సమస్య అంతా. వారికి ఆ విద్యాలయాల్లో సీట్లు రాకపోతే వారిలో కొందరి పరిస్థితి వర్ణానాతీతం. చాలా దిగులు పడిపోతుంటారు.

ఎంతలా అంటే ఆ దిగులులో ఎక్కడైనా సరే సీటు వస్తే చాలు అన్నంతలా. అలా సీటు ఎక్కడో చోట రాకమానదు (డబ్బులు పెడితే). సీటు దొరికింది అదే పదివేలు అనేసుకుని వీళ్ళు అందులో చేరిపోతారు ఆ విద్యాలయం ఎలాంటిదో అందులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో … అసలు ఉన్నాయో లేవో అనే విషయాలు ఏవి తెలుసుకోకుండానే. ఆ తరువాతా అక్కడ వారు ఆశించినట్టు లేకపోతే … అందులో విద్యను అభ్యసించే కనీస సౌకర్యాలు లేకుంటే వారి పరిస్థితి అంతే. కాబట్టి ఎక్కువ దిగులు పడకూడదు, చేరాలనే తొందరలో దేంట్లో పడితే దాంట్లో చేరకూడదు.

          ఇపుడు ఏదేని ఒక విద్యాలయం (పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం మొదలగు వాటి)లో చేరేముందు మనం పరిశీలించవలసిన కొన్ని అంశాలు చెప్పాలనుకుంటున్నాను.

  • ఒక విద్యాలయంలో చేరేముందు ఏ ప్రదేశం (పక్క నగరం, రాష్ట్రం లేదా పొరుగు దేశం) లో చేరాలనుకుంటున్నారో అక్కడ ఉండే అన్ని విద్యాసంస్థల వివరాలు తెలుసుకోవాలి. వాటితో పాటు అక్కడ విద్య ఎలా ఉంటుంది అనగా నాణ్యమైనదే అందిస్తార లేదా అని కూడా తెలుసుకోవడం ముఖ్యం. దీంతో పాటు ప్లేస్మెంట్ ఎలా ఉందన్నదీ చూడాలి. ఆ తర్వాత అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయో అన్న విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే సౌకర్యాలు కూడా ముఖ్యమే కదా. ఉదాహరణకు సైన్సు మొదలగు విద్యార్థులకు ల్యాబ్ వంటి సౌకర్యాలు లేకుంటే వారు ఎలా విద్యనూ అభ్యసిస్తారు? కాబట్టి ఇలాంటివి చూడాలి.
  • అలాగే ఇంటర్నెట్ ద్వారా ఆయా విద్యాలయాల సైట్లను వీక్షించి కూడా తెలుసుకోవడం మంచిది. అలాగే ఆ విద్యాలయాల గురించి నెట్ లో ఎలా టాక్ ఉందో అన్నదీ చూడాలి. అలాగే ఆ సంస్థ పై సమీక్షలు చదవాలి. వీటి బట్టి మనం ఒక అంచనాకు రాగలం. కానీ అన్నివేళలా సమీక్షలను నమ్మలేము. అవి అబద్ధపు సమీక్షలు కూడా అయుండొచ్చు. కాబట్టి పూర్తిగా సమీక్షలను బట్టి నిర్ణయం తీసుకోకూడదు. ఇవి ఆ సంస్థ గురించి మనము ఒక అంచనాకి రావడానికి మాత్రమే దోహదపడతాయి.
  • ఇవన్నీ తెలుసుకున్నాక కూడా సంతృప్తి చెందకపోతే నేరుగా విద్యసంస్థకే వెళ్లి వివరాలు తెలుసుకుంటే సరి. అలా వెళ్ళినంత మాత్రాన కూడా అన్నీ తెలియవనుకోండి. కానీ అవకాశం లేకపోదు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అధ్యాపకులు ఎలా బోధిస్తారు లాంటి వివరాలు తెలుసుకోవాలి. అలాగే అక్కడ ప్రస్తుతం చదివే విద్యార్థులను అడిగి ఆ సంస్థ గురించి తెలుసుకోవడం కాస్త మంచిది. వీలయితే ఆ సంస్థలో చదివిన పూర్వ విద్యార్థులు గనక మీకు తెలిసినట్టు అయితే వారిని అడిగి తెలుసుకోవడం కూడా ఉత్తమమే.

          నేనిప్పుడు పైన చెప్పిన మూడు కూడా ఆ విద్యాసంస్థ గురించి మీరు పూర్తీ వివరాలు తెలుసుకోవడంలో దోహదపడక పోవచ్చు. ఎందుకంటే అన్ని వివరాలు అందులో చేరితే కాని తెలియవు. పైన నేను చెప్పిన వివరాలను అనుసరించడం ద్వారా చదవాలనుకునే విద్యాలయం గురించి దాదాపుగా అంచనా వేయగలిగేంత సమాచారంను మాత్రమే రాబట్టుకోగలం. కాబట్టి చేరే ముందు ఇలా తెలుసుకుని చేరితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అసలు ఈ వ్యాసం రాయడానికి గల కారణం గుడ్డిగా ఏ విషయాలు తెలుసుకోకుండా ఏదో ఒక విద్యాలయంలో చేరకూడదు అని చెప్పడానికే. కాబట్టి నేను చెప్పిన విషయాలు నచ్చితే అనుసరించి చూడండి. అలాగే మీకు విద్యాసంస్థల గురించి తెలుసుకునేందుకు ఇంకేవయినా పద్ధతులు తెలిసుంటే వ్యాఖ్యా పట్టికలో వాటిని పంచుకోవడం మాత్రం మరవకండి!