‘మనీ’షి – కవిత

“మనీ”షి  కనిపెట్టిన   ఇంధనం  ధనం

బ్రతుకు బాటలో సాగడానికి అయ్యిందదే  ప్రధానం!

ఈ నాటి సమాజంలో   జనరంజక మైన  క్రొత్త మతం ధనం

కులాలకతీతంగా  ఆదరణనందుకుంటన్న నవీన “ధన”కులం!

అనురాగం,అభిమానం అంతా ఒక  బూటకం

స్నేహం, అనుబంధం, అన్నవి  మరో  పెద్ద  నర్తనం

ధనాకాంక్ష ముసుగుతో  ’మనీ”షి  ఆడే  అద్భుత నాటకం

ధనమే ప్రధానమన్నది  నేటి  సమాజం అందించే సందేశం!

ధనంలోనే ఉందని   అందరూ కోలిచే  ఆ దైవ స్వరూపం

ఆ దేవుళ్లకు  కూడా  అంటించారు మనిషిలోని ధన దాహం!

శీఘ్ర దర్శనాల   పేరిట  వసూలు  చేసే  సొమ్మే  దానికి నిదర్శనం

ప్రతీ ఆలయాన   అగుపించే  హుండీ  కూడా దానికి  మరో ప్రమాణం!

 ధనబలం  పెరిగినంత  మొదలవుతుంది  మనిషిలో  అహంభావం

అహంభావ తృష్ణ   కొనితెస్తుంది  మనిషికి  అధికార పీఠం!

అధికార దర్పానికి  ఆ దేవుడు కూడా ఇస్తాడు పూర్ణ కుంభ స్వాగతం 

ధనాధికార  బలాలే  కాబోలు    ఆ దేవునికి    కూడా ప్రీతి ప్రాయం!

ధనముంటే   ప్రధాన ద్వారం నుండే అవుతుంది దైవ దర్శనం

అది లేకుంటే   అగచాట్లతో  చేసుకోవాలి సర్వదర్శనం!

విభజించి పాలించే  రాజకీయ రంగానికి  తీసి పోదు ఏ మాత్రం

అసమానతని  ప్రస్పుటంగా  పురిగొల్పే  నేటి ఆలయాల సముదాయం!

ఎంత సంపాదించావన్నదే   ఈ నాటి  సమాజ ప్రధాన లక్ష్యం!

ఎలా సంపాదించావన్నది   చూడదు  నేటి  నవీన జన సందోహం!

ఆ దేవుడనే వానికి  సమర్పిస్తే  చాలు  సంపాదనలో  కొంత భాగం

పరిశుద్దుడైపోతావని   చాటుతోంది  నేటి ఆధ్యాత్మికతా భావం!

పేరాశతో  ధనంకోసం  ’మనీ’షి  చేసే  దోపిడిలకి  ఆలవాలం

సమారాధనా కూటముల పేరుతో   చేసే హంగు  ఆర్భాటం!

ధనాకాంక్షతో మూఢనమ్మకాలను  ప్రేరేపించి ప్రజలలో  పెంచితే భయం 

మానవత్వ మనుగడే   ప్రశ్నార్ధక మవడమన్నది   ఖాయం!

అవసరానికి సరిపడా ఉంటేనే నిలిచుంటుంది మానవత్వం

ఏ మాత్రం అటు ఇటు అయినా  పెచ్చరిల్లుతుంది క్రూరత్వం!

దైవం పేరుతో    పెంచుతూంటే  సమజంలో  ధనదాహం

కచ్చితంగా పెరుగుతుంది  జనాలలో  హేతువాద భావోద్వేగం.