మట్టిపోగు – కవిత

పొడారిన ఆకాశం 

ఒక్కొక్క రక్తపుబొట్టు కారుస్తోంది 

నెర్రెలు బారిన నేల 

ఆర్తగీతాన్ని వినిపిస్తోంది నలుదిక్కులా 

ఎడారులు పరుచుకున్నా

భూమి పుత్రుల హృదయాల్లొ 

ఒయాసిస్సులు ఉదయించట్లేదు

మబ్బులు మోసం చేస్తూ 

విచ్చు కత్తులు విసురుతుంటే  

రాజ్యం విసిరిన ఆర్థిక  వ్యూహం లో క్షతగాత్రుడవుతున్నాడు 

పడమటి గాలుల సుడిగాలిలో

 చిక్కుకుని విలవిల్లాడి  పోతున్నాడుమట్టియోధుడు 

స్వప్న శిథిలాలమధ్య 

నాగలిని సిలువలా మోస్తున్నాడు రైతన్న

వేల వేల చేతులతో దేశాన్ని పొదివి పట్టుకొన్న  మట్టిపోగులు

కందులో దారాలు తెగినట్లు 

శిశిరంలో ఆకులు రాలినట్లు

ఒక్కొక్కటి తెగిపడుతున్నాయి 

అతనొక యుద్ధవీరుడు 

మనుషుల్ని లోపలి ఆవాహన చేసినవాడు 

మట్టిని ప్రేమించినవాడు 

మట్టిని ప్రాణంగా చూసినవాడు 

మట్టిలో మట్టిగా మారాలని తపించినవాడు 

తన్ను తాను భూమిలో పాతుకొంటున్నాడు 

అతనికోసం కన్నీటి బొట్లు రాల్చకండి 

అక్షరాల పొత్తిళ్ళలో అతనిని పొదివి పట్టుకుందాం రండి 

అతనితో భారతదేశ చిత్రపటంపై ఆకుపచ్చ సంతకం చేయిద్దాం రండి