‘మేఘావృతమైంది’ పుస్తక సమీక్ష

          కవి, సినీగేయ రచయిత, రఘుబాబు సోమవారపు గారి మొదటి పుస్తకం మేఘావృతమైంది కవితా సంపుటిలో కవితలన్నీ ఆ మేఘ గర్భం నుండి కురిసిన నీటి బిందువులలో కొన్ని అల్చిప్పాలో కలసి ముత్యాలైనట్టు ఆయన కలం నుండి జాలు వారిన ఎన్నో కవితల నుండి కొన్ని ముత్యాలు మనకు మేఘావృతమైంది అని ముత్యాల హారం రూపంలో మన ముందుకు తీసుకురావడం ముదావహం.

          తొలి కవితతోనే అక్షర సేద్యం చేస్తున్న అని ప్రకటించి నిరుద్యోగము, కన్నబిడ్డలు తమ తల్లిదండ్రులను అనాధ ఆశ్రమంలో చేరుస్తున్నారు అని, ఇలా సమాజంలోని ఎన్నో సమస్యలు చూసి తన మదిలో హాలాహలం చేలరింగింది అందుకే నేను అక్షర సేద్యం చేస్తున్న అని తన ఆవేదన వ్యక్తం చేసారు.

          అమ్మ తన బిడ్డలకై చేసే త్యాగాల గురించి రాసిన అమ్మ అనే కవితా చదువుతుంటే కన్నులలో తుఫాను చెలరేగుతుంది. ఒక ప్రభాత వేళలో అరణ్యము తన రోదన గురించి ఈ కవి గారికి చెప్పడంతో దాని ఆ అడవి తల్లి భాదను కళ్ళకు కట్టినట్లు చూపారు. ఆటవిక సంస్కృతి, బడుగుల దుస్తితి, చెట్టును తల్లితో పోలుస్తూ వర్ణించిన కవిత ఇలా ఆయన కవితా వస్తువులు అన్ని సామజిక అంశాలను సృజించాయి.

          ఆ తరువాత ఈ కవి తన బాల్య స్మృతులు గురించి, నమ్మకం లేక విచ్చినం అవుతున్న కుటుంబ బంధాల గురించి ఆందోళన వ్యక్తం చేసారు. తను నివసించే భాగ్య నగరం గురించి ఆ నగర జీవనం గురించి సూటిగా తెలియజేసారు.

          ఒంటరితనం కష్టాలను, శ్రామికుడి చమట చుక్కల గురించి, ఫేస్ బుక్ చేసే మాయల గురించి ఆక్సిడెంట్ లో బలౌతున్న యువకుల గురించి.. ఒక్క నిమిషం చాలు జీవితం అటో ఇటో నిర్దేశించడానికి అని చాల చక్కగా వివరించారు.

          ప్రేమికుల ఎదురుచూపుల గురించి, పోస్ట్ మ్యాన్ జీవితం గురించి రైతు ఘోష, ఆడపిల్లల కష్టాలు, పల్లె పట్టణానికి వలస వెళ్తున్నది అని ఇలా అనేక సామాజిక అంశాలను తన కవితా వస్తువులుగా తీసుకోని ఈ అందమైన పుస్తకాన్ని మన ముందు ఉంచారు.. ఇందులోని కవితలన్నీ అక్షర ముత్యాలే..!!

పుస్తకం: మేఘావృతమైంది

కవి: రఘుబాబు సోమవారపు