ప్రణయమా… స్వార్థమా? | ధారావాహిక ఎ-2

          ఏం జరిగిందో అర్థం కాలేదు కాత్యాయనికి. కాల్ కట్ చేసి మళ్ళీ అపూర్వ నంబరుకి డయల్ చేసింది. ఊహూ.. ఎత్తలేదు. ఏమైందో అంతుబట్టలేదు. ‘వరుణ్ కి చేస్తా’ అనుకుంటూ అతనికి డయల్ చేసింది. రింగ్ అయిన చాలా సేపటికి ఎత్తాడు.

          “హలో” అన్నాడు వరుణ్ అవతలి నుండి.

          “వరుణ్.. ఏమైంది అపూర్వకి” కంగారు ఆమె గొంతులో స్పష్టంగా కనిపిస్తోంది.

          “వ్వాట్? ఇదే టైపు జోకు కాత్యా? అపూర్వకేమవుతుంది? హాయిగా ఇంట్లో ఉంది. నేను ఆఫీసులో ఉన్న” తాపీగా పలికింది అతని గొంతు.

          తన చెవులను తానే నమ్మలేకపోయింది కాత్యాయని. “ఏంటి జోకా? ఇపుడేగా నేను అపూర్వతో ఫోనులో మాట్లాడుతుండగా ఇంటికొచ్చావ్? ఏమైంది దానికి? అడుగుతే నేను జోకు వేస్తున్నా అంటున్నావు? ఏంటి బావా ఇది?”

          “హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్… ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు సీరియస్?”

          “ఏంటి వేళాకోలమా? డబుల్ సీరియస్ ఇక్కడ”

ప్రణయమా... స్వార్థమా? | ధారావాహిక ఎ-2

          “నేను ఇంటికి రావడమేంటి కాత్యా? నేను ఆఫీసులో ఉన్నా. ఇంతకీ నువ్వు ఎప్పుడు కాల్ చేశావు?”

          “ఇప్పుడే రెండు మూడు నిమిషాలు కూడా అయుండదు”

          “వ్వాట్! ఆర్ యు క్రేజీ? నేను ఆఫీసుకి వచ్చి అరగంట పైనే అవుతుంది. అయిన నీకెవరు చెప్పారు నేను ఇంటికెళ్ళానని? అపూర్వ నువ్వు కలిసి నా మీద ఏదైనా ప్రాక్టికల్ జోకు చేస్తున్నారా ఏంటి?” చిలిపిగా పలికింది అతని కంఠం.

          మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాక్ అయినట్టు అనిపించింది అపూర్వకి. ‘వరుణ్ ఇంటికి వెళ్ళలేదా? మరి అపూర్వ నాతో ఫోనులో మాట్లాడుతుండగా వచ్చింది ఎవరు? బావే రాకపోతే అపూర్వ ఎందుకు ‘వరుణ్’ అని అనింది? ఆ తర్వాత ఎందుకలా అరిచింది? అసలు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు!’ కందిరీగలు ముసిరినట్టు ఒక్కసారిగా ప్రశ్నలు ఆమె మనసును నిలువనివ్వకుండా చేయసాగాయి.

          “కాత్యాయనీ.. కాత్యాయనీ.. ఏంటి ఏం మాట్లాడవు?” వరుణ్ పిలుపుతో ఆలోచనల్లో నుండి బయటకు వచ్చి “వరుణ్… ప్లీజ్ నిజం చెప్పు! నన్ను భయపెట్టడానికి ఇలా అబద్ధం చెప్తున్నావ్ కదా” ఎక్కడో ఏదో ఆశ ఆమె కళ్ళల్లో, గొంతులో ప్రతిఫలిస్తుంటే అంది ఆదుర్దగా.

          “కాత్యా నేను ఆఫీసు టైమ్లో నీతో ఎప్పుడైనా పరాచికాలు ఆడానా? అసలేమైంది?”

          మొబైల్లో మాట్లాడుతుండగా కాల్ కట్ చేయకుండా కాలింగ్ బెల్ ఎవరో కొడితే తీయడానికి అపూర్వ వెళ్ళడం. ఆ తరువాత తాను ఫోనులో విన్నదంతా వరుణ్తో చెప్పింది.

          అపూర్వకు కాల్ చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసాడు వరుణ్.

          కాత్యాయని గుండె వేగంగా కొట్టుకుంటోంది. గడియారం వంక చూసింది. క్షణాల ముళ్ళు మెల్లగా కదులుతోంది. సమయం భారంగా గడుస్తోంది.

          అయిదు నిమిషాలకు వరుణ్ నుండి కాల్. రిసీవ్ చేసి “అపూర్వ మాట్లాడిందా?” ఆదుర్దగా అడిగింది.

          “నో రిసీవ్ చేయడం లేదు. నేను ఇప్పుడే ఇంటికి వెళుతున్నాను. నువ్వేం కంగారు పడకు కాత్యాయని. ఇంటికెళ్ళగానే నేనే నీకు కాల్ చేస్తా. ఒకేనా” అని చెప్పి పెట్టేసాడు.

          వరుణ్ కి కూడా అపూర్వ కాల్ రిసీవ్ చేయలేదని అతను చెప్పగానే ఎందుకో ఆమె మనసు అదే పనిగా కీడును శంకించసాగింది. మనసులో మొక్కిన దేవుడికి మొక్కకుండా అందరి దేవుళ్ళకు ప్రార్థిస్తూ వరుణ్ కాల్ కోసం ఎదురు చూడసాగింది మాటిమాటికి గడియారం చూస్తూ.

*        *        *        *        *        *

          నెల రోజుల తరువాత…

          స్నేహితురాలు రావడంతో మాట్లాడుతోంది కాత్యాయని.

          కాత్యాయనితో “నాకు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. అసలు ఒకరికొకరు ఎంత బాగా అన్యోన్యంగా ఉండేవారు. పెళ్లి చేసుకుంటే తనలా ప్రేమించే భర్త నాకూ రావాలని ఆశపడ్డాను. అమ్మో! నాకు అలాంటి మొగుడు రావద్దని ఇపుడు భగవంతున్ని ప్రార్థిస్తున్నా. అసలు ఊహించలేకపోతున్నా” అంది రాణి.

           మౌనంగా వింటుండిపోయింది కాత్యాయని. ఆమె ముఖం విషాదంతో నిండి ఉంది. అప్పటికి అపూర్వ మరణించి నెల రోజులు అవుతోంది.

          “అసలు అతనే చేసాడని నిరూపించేందుకు సాక్ష్యాలేవీ లభించలేదటగా? చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి చేసారన్నమాట” ఆమె మాట్లాడుతూనే ఉంది.

          “కాత్య అపూర్వతో ఫోనులో మాట్లాడుతుండగా… అపూర్వ ఆ ముదనష్టపు వాణ్ని పిలిచిందట. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలమ్మా? వాళ్ళ డబ్బు, పలుకుబడి ముందు మేము ఏమీ చేయలేని చేతకాని వాళ్ళలా వాళ్ళు చేస్తున్నదల్లా చూస్తుండిపోయాము తల్లీ” అప్పుడే లోపలి నుండి వచ్చిన కాత్యాయని తల్లి యశోద ఆ మాటలు విని ఏడుస్తూ అంది.

          “అవును తెలిసింది. కేసు పెద్దగానే అయిందని విన్నా. మరి నువ్వు ఈ విషయం చెప్పలేదా కాత్యా?” అడిగింది రాణి.

          “చెప్పా! కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా?”

          కుతూహలంతో ప్రశ్నార్థకంగా చూసింది రాణి ఆమె వంక.

          “వరుణ్ అని అపూర్వ అనడం విన్నావు, మరి వరుణ్ గొంతు వినలేదా? అనడిగారు”

          “మరి నువ్వేమన్నావు?”

          “వినలేదన్నాను”

          “అదేంటీ?”

          “ఇంకేమంటాను. నేను వినలేదుగా. అదే చెప్పా”

          “వినలేదా? అసలు నువ్వు ఆ రోజు ఫోనులో ఏం విన్నావ్? నాకు క్లియర్ గా చెప్పు. అంతా కన్ఫ్యుసింగ్ గా ఉంది”

          చిన్నగా నిట్టూర్చింది కాత్యాయని.

          “ఇలా జరిగిందంతా కథలా చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు”

          రాణి తల దించుకుంది తన మాటలకు.

          “ఆ రోజు అపూర్వకి కాల్ చేసాను. మాట్లాడుతూ ఉంది. ఇంతలో వాళ్ళింట్లో కాలింగ్ బెల్ మోగడం వినిపించింది. నాతో ఏం చెప్పకుండానే వెళ్లి తలుపు తీసింది. ఆ తరువాతా కొన్ని క్షణాల వరకు ఏమి వినిపించలేదు. నేను ఇటు పక్క అరుస్తూనే ఉన్న హలో హలో అని. కానీ అపూర్వ నుండి సమధానం లేదు. ఇంతలో చిన్నగా అపూర్వ మాటలు వినిపించాయి. ఏంటి వరుణ్ నువ్విలా. అని అనడం. అపుడు అర్థమైంది నాకు – ఫోను పక్కన పెట్టి తలుపు తీయడానికని వెళ్లి ఉంటుందని. బహుశా నాతో మాట్లాడుతున్నదన్న సంగతి మర్చిపోయుంటుందేమో అనుకున్నా. కాసేపయ్యాక కాల్ చేస్తా అనుకున్నా వరుణ్ తో మాట్లాడుతుంది కదాని. ఇంతలో గట్టిగా అపూర్వ అరవడం వినిపించింది. అరుస్తూ వరుణ్ అంటూ ఆర్తనాదాలు. నాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిలిచా .. ఎవరూ పలకలేదు. అపూర్వ ఆర్తనాదాలు తప్ప. కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేశా. మోబైల్ ఎత్తలేదు అపూర్వ. ఇదీ విన్నాను”

          ఏదో సస్పెన్స్ స్టోరీ వింటున్నట్టు ఆసక్తిగా ముఖం పెట్టిన రాణి ముఖం చూడగానే ఒళ్ళు మండింది కాత్యాయనికి. “తల నొప్పిగా ఉంది రాణీ. మళ్ళీ మాట్లాడదాం” అంటూ లేచింది రాణి సమాధానం కోసం చూడకుండా.

*        *        *        *        *        *

          గదిలోకి వచ్చిన కాత్యాయానికి అపూర్వ ముఖమే కళ్ళ ముందు మెదులుతోంది. దుఃఖం పొంగుతోంది ఆమెలో. టేబుల్ మీదున్న ఫోటో ఫ్రేములో అపూర్వ తానూ కలిసి దిగిన ఫోటో చూడగానే ఆమె మనసు కదిలిపోయింది. బల్ల ముందు కూర్చుని ఫోటో చేతిలోకి తీస్కోని మూగగా రోదించసాగింది.

          అలా ఎంత సేపు ఏడుస్తూ ఉందో తనకే తెలీదు. గడియారం గంట కొట్టిన చప్పుడుకు ప్రస్తుతంలోకి వచ్చింది. ‘అపూర్వను చంపిన వరుణ్ ని ఊరికే వదిలిపెట్టకూడదు’ అలా అనుకునగానే ఆవేశంతో ఆమె ముక్కు పుటలు అదిరాయి. ఫోటోను యధాస్థానంలో పెడుతూంటే పక్కనే తన డైరీ కనిపించింది. చివరి సారిగా అపూర్వతో మాట్లాడిన రోజు డైరీ రాయడం ఆపిందంటే ఇప్పటి వరకూ దాని ముఖం చూడలేదు కాత్యాయని. దాన్ని అందుకుని ఆరోజు అపూర్వతో మాట్లాడటం మొదలుకుని ఆ తరువాత జరిగిన ఒక్కో సంఘటన అంతా వివరంగా రాయడం ప్రారంభించింది.

          అపూర్వ, కాత్యాయనిలు ఇద్దరూ కవలలు. వారిలో ఎవరు పెద్దో ఎవరు చిన్నో ఎవరికీ తెలీదు. బహుశా వారి మంచికే అయుంటుంది. ఎందుకంటే పెద్ద చిన్న అనే తారతమ్యాలు వారి మధ్య ఉండవుగా అపుడు!. పేరుకు కవలలైనా వారిద్దరి పోలికలు వేరు వేరు. అపూర్వ కాత్యాయని కంటే అందంగా ఉంటుంది. అందుకే వాళ్ళ బామ్మ ఆమెకి అపూర్వ అనే పేరు పెట్టిందని వాళ్ళమ్మ చెప్తూంటుంది. కానీ కాత్యాయని పేరే పాతచింతకాయపచ్చడిలా ఉందని తెగ బాధ పడుతూ ఉంటుంది కాత్యాయని. ఆ పేరును వాళ్ళ తాతయ్య పెట్టారు.

          డైరీలో రాయడం ప్రారంభించింది కాత్యాయని.

          పుట్టినప్పుడే ఇద్దరం కలిసిపుట్టాం, కడవరకూ కలిసే వుంటాం అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.

          ఇంటికెళ్ళిన వరుణ్ నాకు ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పడం. రక్తం మడుగులో అపూర్వ పడుందని. నేను నమ్మలేదు. వెళ్లి కళ్ళారా … నా రెండు కళ్ళతో చూసాక అలా విగత జీవురాలై ఉన్న అపూర్వని చూడగానే నా తల తిరిగింది. స్పృహ తప్పి పడిపోయాను. సాయంత్రం మెలకువ వచ్చాక తెలిసింది అపూర్వని హత్య చేసారని. అపూర్వని ఎవరో హత్య చేయడమా? నేను నమ్మలేదు. దానికి శత్రువు అనేవాళ్ళే లేరు. అలాంటిది దాన్ని చంపేటంత శత్రువులా. ఆరోజు ఉదయం జరిగిందంతా గుర్తురాగానే ఇన్స్పెక్టర్తో చెప్పాను. నేను అపూర్వతో మాట్లాడుతుండగా కాలింగ్ బెల్ చప్పుడు అవడంతో అపూర్వ వెళ్లి తలుపు తీసింది. వరుణ్ అని పిలవడం నా చెవులతో ఫోన్ లో విన్నా అని. ఈ విషయం చెప్పగానే వరుణ్ మీద అనుమానంతో అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఇన్స్పెక్టర్. కానీ వరుణ్ నాన్న గారి స్నేహితుడు ఈ సిటీలోనే పెద్ద లాయర్. ఎలా తెలిసిందో కానీ వచ్చి లా పాయింట్లు మాట్లాడాడు. వరుణ్ అరస్ట్ కాలేదు.

          గట్టిగా అడుగుతే… ఏ విషయం ఇప్పటికిప్పుడే ఎలా చెప్తాం వెయిట్ చేయండని ఇన్స్పెక్టర్ అన్నారు. కానీ ఆ తరువాత కూడా ఇన్స్పెక్టర్.. ఎవరు కూడా హంతకుణ్ణి పట్టుకోరని జరుగుతున్నా దాన్ని బట్టి అర్థమైంది. వరుణే అపూర్వని చంపాడు అని అనడానికి ఏ ఆధారాలు వారికి లభించలేదు. ఎవరు చంపారూ అన్నది తేల్చలేకపోయారు. అడుగుతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనడం. నాకు ఒళ్ళు మండింది. ఓ రోజు వరుణ్ దగ్గరికి వెళ్లి నిలదీసా.

          “వరుణ్. నిన్ను అపూర్వ పిలవడం నా చెవుల నిండా విన్నా. ఎందుకిలా చేసావ్?”   

          “కాత్యాయని అసలేం మాట్లాడుతున్నావ్? ఎలా అనగలుగుతున్నావ్ ఆ మాటను? నేను? నేను తనని చం…. ఆ మాట అనడానికి కూడా నా నోరు రావడంలేదు. నీకు తెలియదా తనూ నేను ఎంత ప్రేమించుకున్నామో. తను నా ప్రాణం అని నీకు తెలియదా? నా పరిస్థితి చూసైనా నీకు అర్థం కావడం లేదా?” నిస్సహాయంగా అంటున్నట్టు బదులిచ్చాడు. అమాయకంగా ఉన్న అతని మాటలు వింటే ఎవరైనా నిజమే అనుకుంటారు. కానీ నేను కాదు!

          “ఇన్స్పెక్టర్ నిన్ను అన్ని విషయాలు అడిగినపుడు ఆ రోజు అపూర్వకి ఏదో సర్ప్రైజ్ ఇస్తానని నువ్వు చెప్పడం విన్నా. ఇదే అన్నమాట నువ్వు అపూర్వకు ఇచ్చిన సర్ప్రైజ్!” కోపం నన్ను నిలువెల్లా ఊపేస్తుంటే అన్నా.

          అతని ముఖం మారింది.

(ఇంకా ఉంది)

భాగాలు: 12345