ప్రణయమా… స్వార్థమా? – భాగం – 4

          ఉదయం…

          నిన్న తెలుసుకున్న విషయాలేవీ ఇంట్లో చెప్పలేదు కాత్యాయని. రాత్రి రావడం లేటెందుకు అయిందంటే మాత్రం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్పింది. తల్లిదండ్రులకు ఈ విషయాలన్నీ సాక్ష్యాధారాలతో వరుణ్ ని పోలీసులకు పట్టించాకే చెప్పాలని ఆమె భావన. అసలే బాధలో ఉన్న వాళ్లకు ఇవన్నీ చెప్పి మరింత బాధకు గురి చేయడం ఆమెకి ఇష్టం లేదు.

          ఉదయం లేచిన దగ్గర నుండి అస్తిమితంగా ఉంది తను. మనసులో అన్నీ ఆలోచనలే.

          బ్రేక్ ఫాస్ట్ చేసి బెడ్ రూమ్ లోకి వచ్చేసింది.

          నిన్న సీసీ కెమెరా ఫూటేజ్లో తెరిచున్న సుజాత ఇంటి కిటికీ తలుపు, వాళ్ళ ఇంటికి వెనక రోడ్డు వైపు నుండి మరో గుమ్మ ఉండటం చూసి వరుణే ఆ ఇంట్లో నుండి వచ్చి అపూర్వను హత్య చేసాడు అన్న స్థిర భావనకు వచ్చింది ఆమె. కానీ అతనే అలా వచ్చాడని ఎలా నిరూపించాలో ఆమెకి అర్థం కావడం లేదు. ‘వరుణ్ ఇంటి నుండి ఆఫీసుకు వెళ్ళాడు అనే అంటున్నారు అందరూ. వరుణ్ సైతం. వరుణ్ ఇక్కడే ఉంటే అసలు ఆఫీసుకి ఎలా వెళ్తాడు అనేది నా ప్రశ్న? అసలు ఆఫీసుకి వెళ్ళాడా లేదా అనేది ఇపుడు తెలియాలి. ఇలా కిటికీ తెరిచుంది, వరుణే అందులో నుండి వచ్చి హత్య చేసాడు అని చెబితే ఎవరు నమ్ముతారు? ఏది నమ్మాలన్నా, నమ్మించాలి అన్న దానికి సాక్ష్యం కావాలి. దాన్ని ఎలా సంపాదించడం?

          నా దృష్టిలో ఆఫీసుకు వరుణ్ వెళ్ళలేదు. ఈ విషయం తేటతెల్లం చేసేది వరుణ్ ఆఫీసు వాళ్ళే. కానీ ఎవర్ని అడిగేది?’ ఇలా ఆలోచనలతో సతమతం అవుతోంది ఆమె. టక్కున గుర్తుకువచ్చింది తను వరుణ్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అతని గదిలో, స్టాఫ్ హాలులో సీసీ కెమెరాలు ఉండటం. ‘ఆఫీసులో సీసీ కెమెరాలు ఉన్నాయి, అంటే ఒకవేళ వరుణ్ నిజంగానే ఆఫీసుకు వెళ్లుంటే అందులో ఉంటాడుగా?’ అలా అనుకోగానే ఆమె కళ్ళు విప్పారాయి. ‘ఈ ఆలోచన ముందు నుండి ఎందుకు రాలేదు నా మొద్దు బుర్రకు’ తనని తానే నిందించుకుంది. ‘ఆఫీసు సీసీ టీవి ఫూటేజ్ లో ఖచ్చితంగా వరుణ్ ఉండడు. అసలు వస్తే కదా ఉండడానికి. కానీ ఎలా అతని ఆఫీసులోని సీసీ టీవి ఫూటేజ్ ని చూడటం? నేను వెళ్లి చూస్తాను అంటే చూపిస్తారా?’ అనుకుంటూన్న కాత్యాయనిలో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది. అప్పటికప్పుడు రెడీ అయ్యింది. బ్యాగు భుజాన తగిలించుకుని, కీస్ తీస్కుంది. తల్లికి బయటికి వెళ్తున్నానని చెప్పి, స్కూటీ పై నేరుగా వరుణ్ ఆఫీసుకి బయలుదేరింది.

          ఆఫీసు బిల్డింగ్ ముందు పార్కింగ్లో స్కూటి పార్క్ చేసి వరుణ్ కి ఫోన్ చేసింది.

          అవతల అతను ఫోన్ లేపగానే, “వరుణ్ నువ్వు నా దృష్టిలో నిర్దోషివి అని నిరూపించుకోవాలి అనుకుంటే నీ ఆఫీసుకి ఇప్పుడే రా. నేను ఆఫీసు దగ్గరే ఉన్న” అని అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. ఆమెకి తెలుసు వరుణ్ వస్తాడని ఎందుకంటే తనకు తన కుటుంబ సభ్యులకి అతను ఎప్పుడెప్పుడు తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలా అని చూస్తున్నాడని.

          ఆమె అంచనా నిజమయింది. అరగంట గడిచిందో లేదో ఆఘమేఘాల మీద వచ్చాడు వరుణ్ స్పీడుగా తన కారులో. కారులో ఉన్న అతన్నే చూస్తోంది కాత్యాయని. పీక్కుపోయిన ముఖం, మాసిన గడ్డంతో కారు దిగి వడివడిగా వస్తున్నాడు తనవైపే.

          ఆమె దగ్గరికి వచ్చి “కాత్యాయని. చెప్పు నన్ను ఏం చేసి నిరూపించుకోమంటావు నేను నిర్దోషని” అడిగాడు.

          “మీ ఆఫీసులో ఉన్న సీసీ ఫూటేజ్ చూపించు. అందులో తెలిసిపోతుంది. అపూర్వ హత్యకు గురైన రోజు నువ్వు ఆఫీసుకు వచ్చి, నేను ఫోన్ చేసాకే ఇంటికి వెళ్లుంటే అది అందులో రికార్డ్ అవ్తుందిగా. అలా గనక రికార్డ్ అయితే నువ్వు నిర్దోషి అని నమ్ముత. లేకపోతే…”  చెప్పడం ఆపింది.

          “పద చూపిస్తాను” అంటూ కాత్యాయనిని ఆఫీసులోకి తీసుకెళ్ళాడు. వరుణ్ అక్కడ మేనేజర్. సెక్యూరిటీ రూములోకి తీసుకెళ్ళి అపూర్వ హత్యకు గురైన రోజటి డేట్ చెప్పి ఆ వీడియోని ప్లే చేయమని గార్డుతో చెప్పాడు. కాత్యాయనికి వీడియో చూడమని చేత్తో చూపించి గోడకి చేరగిలబడి నిల్చున్నాడు వరుణ్.

          వాళ్ళ ఆఫీసులో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. ఆఫీసు మెయిన్ ఎంట్రెన్స్ లో, స్టాఫ్ హాల్ లో, వరుణ్ గదిలో. మూడు కెమెరాల వీడియోలు స్క్రీన్ పై ప్లే అవుతున్నాయి.

          వీడియోల్లో, ఉదయం ఆఫీసులోకి వచ్చాడు వరుణ్. హాల్లో నుండి నేరుగా తన గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. ఏవో ఫైళ్ళు తిరగేస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. వీడియో ప్లే అవుతోంది. ఆఫీసు బాయ్ టీ తెచ్చిచ్చి వెళ్ళాడు. టీ తాగాడు.

          కాత్యాయని ఊహించని విషయం అది. ఆఫీసు ఫూటేజ్ లో అతను  ఉండడు అనుకుంది. కానీ ఉన్నాడు. అదే నమ్మలేకపోతోంది ఆమె. కానీ ఆమెలో ఎక్కడో ఆశ, ఆఫీసుకి వచ్చినా బయటకి వెళ్ళకపోడా అని. ఎవరికో ఫోనులో మాట్లాడాడు. ఆమె ఊహించినట్టే చైర్లో నుంచి లేచి గదిలోంచి బయటకు వచ్చి టాయిలెట్ గది వైపు వెళ్ళాడు. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. అయిదు నిముషాలు గడిచాయి. ఇక గదిలోంచి రాడు అనే అనుకుంది. కానీ బయటకు వచ్చాడు. వెళ్లి తన గదిలో కూర్చునాడు.

          టైం గడుస్తోంది. అయిదు, పది, ఇరవై.. అరగంట… ఆపైన… కాసేపటికి వరుణ్ కి ఫోన్. ఫోన్ లేపి మాట్లాడుతున్నాడు. టైం చూసింది. ఆ టైమ్లో ఫోన్ చేసింది తానే, తనతోనే మాట్లాడుతున్నాడని అర్థమైంది కాత్యాయనికి. మాట్లాడి ఫోన్ చెవి నుండి తీసి ఏవో బటన్లు నొక్కి మళ్ళీ చెవికి పెట్టుకున్నాడు కానీ ఎవరితో మాట్లాడలేదు. మళ్ళీ చెవి నుండి తీసి ఏవో బటన్లు నొక్కి ఫోనును మళ్ళీ చెవికి పెట్టుకున్నాడు. ఏదో మాట్లాడి ఫోనును ప్యాంట్ జేబులో పెట్టుకుని, కారు తాళం చెవులు తీస్కుని బయల్దేరాడు. అదంతా చూసిన కాత్యాయనికి మైండ్ బ్లాక్ అయింది. ‘అంటే… అంటే.. వరుణ్ నిజమే చెప్పాడు. అపూర్వను వరుణ్ చంపలేదా?’ అలా ఆలోచించేసరికి ఒక్కసారిగా తల తిరిగినట్టు అయింది కాత్యాయనికి.

          కాత్యాయని తూలడం చూసి వరుణ్ చప్పున ఆమె భుజాలను పట్టుకున్నాడు పడకుండా. “కాత్యాయని. ఆర్ యు ఓకే?” గాబరాగా అడిగాడు.

          తనని తాను నిలదొక్కుకుని తలూపింది అవునంటూ. ‘ఇంత మంచి వరుణ్ ని నేను అనుమానించానా? ఛ!’ అనుకుంది.

          “ఇపుడు చూసాక అయినా నన్ను నమ్ముతావా కాత్యాయని” బేలగా ఆమెనే చూస్తూ అన్నాడు.

          ఆ క్షణం అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది కాత్యాయని. తలవంచుకుంది. క్షమాపణ చెప్పడానికి కూడా ఆమెకు గొంతు పెగలడం లేదు. “న… నన్ను క్షమించు వరుణ్” అంది.

*        *        *        *        *        *

          ఇంటికి వస్తూనే ఈ విషయం అమ్మానాన్నలకి చెప్పింది కాత్యాయని. ఇపుడు అందరిలో ఒకటే ప్రశ్న వరుణ్ హత్య చేయకపోతే ఎవరు చేసారు అని.

          తన గదిలోకి వెళ్ళింది. ‘వరుణ్ అనే అనుకున్న ఇన్ని రోజులు కాని ఇపుడు సీసీ టీవి వల్ల హంతకుడు అతను కాదని తెలిసింది. ఇంకెవరు అయుంటారు? ఒకవేళ వరుణే కిరాయి హంతకుల్ని పెట్టించి చంపించాడా? ఛ ఛ మళ్ళీ ఇలాగే ఎందుకు ఆలోచిస్తున్న. ఇప్పుడే కాదని అందరికి చెప్పా మళ్ళీ.. ఇదే ఆలోచనా. అసలు వరుణ్ మీద నాకు అనుమానం ఎలా వచ్చింది? ఫోనులో అపూర్వ ‘వరుణ్’ అని అన్నది. ఎస్. అందుకే అనుమానించా. ఇంటి నుండి ఆఫీసుకి వెళ్ళిన వరుణ్ తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయం సీసీ ఫూటేజ్ లో స్పష్టం అవుతోంది. మరి అపూర్వ ఎందుకు వరుణ్ అని అంది? ఎవర్ని అంది వరుణ్ అని?’ తల భారంగా అనిపించి బెడ్ పై పడుకుంది. ‘హత్య చేసింది ఎవరో కానీ అపూర్వని చంపి హ్యాపీ గా ఉన్నారు’ అనుకుంది బాధతో కళ్ళు మూసుకుంటూ. ‘అసలు నాకు తెలియని అపూర్వ శత్రువులు ఎవరు? లేక నా దగ్గర ఏమైనా దాచిందా అపూర్వ? ఊహూ! చిన్నప్పటి నుండి మా మధ్య ఏ దాపరికాలూ లేవే అలాంటిది ఇపుడు … నో నో. కానీ సంతింగ్ హాపెండ్.

          రాత్రి ఫూటేజ్ లో సుజాత ఇంటి కిటికీ తెరిచుంది. అసలు సుజాత కిటికీ ఎందుకు మూయకుండా ఊరెళ్ళింది? దీనికి సమాధానం సుజాతతో మాట్లాడితే కాని తెలియదు’ అనుకుంది.

          సుజాత ఇంటికి బయల్దేరింది కాత్యాయని.

          గేటు ముందు స్కూటీ ఆపి స్టాండ్ వేసి గేటు తీసుకుని సుజాత ఇంటికి నడిచింది.

          తలుపు మూసుంది. కాలింగ్ బెల్ నొక్కింది. వెంటనే డోర్ తెరుచుకుంది.

          తలుపు తీసిన సుజాత, ఎదురుగా కాత్యాయనిని చూసి “ఏంటి కాత్య ఇంత ప్రొద్దున్నే?”  ఆశ్చర్యంగా అని “రా.. లోపలికి” అంది. వెళ్ళింది కాత్యాయని.

          కూర్చోమని సోఫాని చూపించి కాత్యాయని వద్దన్నా వినకుండా టీ తీసుకురావడానికి వంట రూమ్ లోకి వెళ్ళింది.

          చుట్టూ చూస్తూ కూర్చుంది కాత్యాయని. ఎదురుగా సిసి టీవి ఫూటేజీలో తెరిచున్న కిటికీ కనిపించింది. ఇపుడు మూసుంది అది. లేచేళ్ళింది. సుజాతది మోడ్రన్ హౌస్. అద్దాల కిటికీ అది. దానికి ఊచలు లేవు. ‘ఎవరన్న అద్దం పగల గొట్టి ఇంట్లోకి వస్తారన్న భయం లేదా వీళ్ళకు? ఇలా కట్టారు?’ అనుకుంది కిటికీని పట్టిపట్టి చూస్తూ.

          కాసేపటికి టీ కప్పులతో వచ్చింది సుజాత. “ఏంటి కాత్యా అక్కడ నిలబడ్డావ్? రాత్రి చూసావా? నాకు నిద్ర ఆగలేదు అసలు. అందుకే నువ్వు వెళ్ళమనగానే వచ్చేసా” అంది టీపాయి మీద కప్పులను పెట్టి కూర్చుంటూ.

          “ఈ కిటికీలేంటి ఇలా ఉన్నాయి. ఎంత మోడరన్ అయితే మాత్రం ఊచలు పెట్టించరా?” వచ్చి కూర్చుంటు అంది కాత్యాయని.

          చిన్నగా నిట్టూర్చింది సుజాత. “నీకు మోడరన్ లా అనిపించిందా. ఏం చెప్పాలి. ఈ ఇల్లు కట్టిన వాడు చాలా క్రాక్. ఒకటి చెప్తే ఒకటి. డబ్బుని నీళ్ళలా ఖర్చు పెట్టించాడు. ఈ ఇల్లుని కూడా సమయానికి కట్టిస్తేనా. మేము కాస్త బాగా గట్టిగ మాట్లాడేసరికి ఇదిగో ఇలా ఆ కిటికీలను బిగించాడు. ఈ ఫ్లోరింగు చూడు ఎలా వేయించాడు..” అంటూ ఇల్లు కట్టినతీరు అంతా చెప్పుకొచ్చింది సుజాత.

          ‘ఈ ఇల్లుని కట్టినవాడు సరిగ్గా కట్టుంటే, ఎవరంటే వాళ్ళు వెళ్లి వచ్చేలా ఉన్న ఈ కిటికీలు ఉండకపోయేవి. బహుశా అపూర్వ హత్య కూడా జరగకపోయేదేమో’ అనిపించింది కాత్యాయనికి.

          తాను వచ్చిన విషయం గుర్తొచ్చి “నేను నిన్ను ఓ విషయం అడుగుదామని వచ్చా సుజాత” అంది.

          “చెప్పు”

          “అపూర్వ హత్యకు ముందు ఊరు వెళ్ళా అని చెప్పావు కదా. మరి ఊరెళ్ళేటప్పుడు ఇంట్లో కిటికీలను మూసి వెళ్ళలేదా?” అడిగింది కాత్యాయని.

          “కిటికీలా” ఓ క్షణం సేపు ఆగి. “నేను మూసే వెళ్లానే” అంది.

          అలా టక్కున బదులు ఇవ్వకుండా ఓ క్షణం సేపు ఆగడం కాత్యయనిలో అనుమానాన్ని రేకెత్తించింది. ‘ఎందుకు ఓ క్షణం ఆగింది? గుర్తు తెచ్చుకోడానికా లేకా నాకు ఏం సమాధానం చెప్పాలోనని ఆలోచించడానికా?’ అనుకుంది. నిన్న సిసి టీవీ ఫూటేజ్ లో ఆమె ఇంటి కిటికీ తెరిచి ఉండటం చూశానని చెప్పింది ‘ఇపుడెం చెప్తుందో చూడాలి’ అనుకుంటూ.

          “అవునా… బహుశా మర్చిపోయి ఉంటా కాత్యా. ఆరోజు హడావుడిలో వెళ్లాను”

          కాత్యాయనికి అనుమానించేంతగా సుజాత ముఖంలో ఏ భావమూ కనిపించలేదు. ‘సుజాత నిజంగా నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో అర్థం కావడం లేదు. ఒకవేళ అబద్ధం చెప్తే ఎందుకు చెప్పినట్టు? సుజాతకు అపూర్వకి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? ఛ ఛ. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నానేంటి? సుజాత చేసి ఉండకపోవచ్చు.

          ఎందుకు చేసుండకూడదు? ఏమో? ఎప్పుడు ఏ మనిషి ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. నా అంచనా నిజమైతే అసలు అపూర్వను హత్య చేసిన హంతకులు ఆశ్రయం పొందిన ఇల్లు సుజాత ఇల్లు. సుజాతని ఎందుకు అనుమానించకూడదు?’ అనుకుంది. ‘హంతకులు సుజాత ఇంటి వెనక డోర్ నుండి వచ్చుండొచ్చు అనుకున్నా. ఒకవేళ సుజాత అమాయకురాలు అయుంటే హత్య చేసిన మనిషి ఈ ఇంట్లోకి ఇంటి వెనకవైపు డోర్ నుంచి వచ్చుండాలి’ అనుకుని  “ఒకసారి మీ ఇంటి వెనక డోర్ చూడవచ్చా?”  అడిగింది సుజాతని.

          సుజాత ముఖం మారింది.

          “ఏంటి కాత్య నువ్వు నన్ను అనుమానిస్తున్నావా?” అడిగింది సీరియస్ గా.

          ఆమె అలా రియాక్ట్ అవుతుందని ఊహించలేదు కాత్యాయని.

(ఇంకా ఉంది)

భాగాలు: 12345