ప్రణయమా… స్వార్థమా? – చివరి భాగం

          వినీత్ గురించి హోటల్ రిసెప్షన్ లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

          రిసెప్షనిస్ట్ వారికి అతను హోటల్లోనే ఉన్నాడు వస్తాడని చెప్తోంది.

          సరిగ్గా అదే సమయంలో లోపల నుండి రిసెప్షన్ హాల్లోకి పరిగెత్తుకొచ్చాడు వినీత్. అతని ఒళ్ళంతా స్వేదంతో తడిసిపోయుంది. ఎదురుగా కనిపించిన పోలీసులను చూడగానే ఒక్కసారిగా షాక్ అయి అక్కడికక్కడే ఆగిపోయాడు శిలలా.

          “సర్ అదిగో వినీత్ సర్ వచ్చారు” రిసెప్షనిస్ట్ పోలీసులకు వినీత్ ని చూపిస్తూ చెప్పింది.

          “నువ్వు చేసిన నేరం ఎవరు కనిపెట్టలేరు అనుకున్నావా?” గంభీరంగా అంటూ అతని దగ్గరికి వెళ్ళారు పోలీసులు. క్షణాల్లో వారు అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి బయలుదేరారు.

*        *        *        *        *        *

          రెండు రోజుల తరువాత ఎవ్వరూ ఊహించని ముఖ్యంగా కాత్యాయని ఎంత మాత్రం ఊహించని వార్త వచ్చింది. అపూర్వ భర్త వరుణే ఆమెను హత్య చేసాడనీ అతన్ని అరెస్ట్ చేసారనేది దాని సారాంశం.

          ‘అరకు నుండి ఇంటికి వచ్చి రెండు రోజులు అవుతోంది. ఈ రెండు రోజుల్లో ఎన్నో విధాలుగా ఆలోచించినా నాకు వరుణ్ మీద రాని అనుమానం అతని పై పోలీసులకు ఎందుకు వచ్చింది? దేని ఆధారంగా అంత ఖచ్చితంగా అతనే చేసాడని తేల్చారు? మొన్న వినీత్ స్నేహితుడు వరుణ్ చేసాడని అన్నారు? మరి.. ఇపుడేంటి ఇలా?’ అనుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏదీ తెలియదు ఇన్స్పెక్టర్ ని కలవాలి అనుకుని అప్పటికప్పుడు బయలుదేరింది కాత్యాయని.

          ఆమె వెళ్లేసరికి స్టేషన్ లోనే ఉన్నాడు ఇన్స్పెక్టర్ అజయ్.

          లోనకు వస్తున్న కాత్యాయనిని చూడగానే “మొదటి నుండి మీరు వరుణే మీ అపూర్వని చంపారని అన్నారు కానీ ఆధారం లేకుండా ఎవ్వరినీ దోషిగా నిర్ధారించలేంగా” బల్లకు ఎదురుగ ఉన్న కుర్చీని ఆమెకు చేత్తో చూపిస్తూ అన్నాడు అజయ్.

          “కానీ ఇన్స్పెక్టర్, హత్య జరిగిన సమయంలో వరుణ్ తన ఆఫీసులోనే ఉన్నాడు కదా. ఈ విషయాన్ని సీసి టీవీ ఫూటేజ్ నిర్ధారిస్తోందిగా?” అంది కూర్చుంటూ.

          చిన్నగా నవ్వాడు అజయ్.

          “ఎందుకు నవ్వుతున్నారు?” అర్థం కాలేదు కాత్యాయనికి.

          “ఈ టెక్నాలజీతో వచ్చిన చిక్కల్లా ఇదే. దీనివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అంతే రెట్లు ప్రమాదం కూడా ఉంటుంది”

          “మీ మాటలు నాకు అర్థం కావడం లేదు”

          “ఎక్కడో దేశంలో ఉండి ఇంకేదో దేశంలోని కంప్యుటర్లో డేటాను మాయం చేయగలుగుతున్న ఈరోజుల్లో ఈ సీసీ టీవీ ఫూటేజ్ మార్చడం పెద్ద విషయమేమీ కాదు కాత్యాయని. సీసీ టీవీ ఫూటేజ్ లో ఉన్నది తొలగించి దాని స్థానంలో ఇంకో ఫూటేజ్ జోడించినా ఏమాత్రం అనుమానం రానటువంటి టెక్నాలజీ ఇపుడు ఉంది”

          “వ్వాట్?” నమ్మశక్యం కాలేదు కాత్యయనికి.

          “ఎస్. వరుణ్ ఆఫీస్ లోని ఫూటేజ్ విషయంలోనూ ఇదే జరిగింది. సీసీ టీవి ఫూటేజ్ ని మార్చి మమ్మల్ని తప్పుదారి పట్టించాడు. ఆ ఫేక్ ఫూటేజ్ చూసి అతన్ని అమాయకుడు అని మేము భ్రమించాము”

          “ఎలా అది ఫేక్ ఫూటేజ్ అని తెలిసింది మీకు?”

          “ఉదయం ఓ కొరియర్ వచ్చింది. అందులో ఉంది అసలు సీసీ టీవీ ఫూటేజ్”

          “ఎవరు పంపించారు?”

          చిన్నగా నవ్వి “ఎవరో తెలియదు. పేరు లేదు. భార్యనే చంపగలిగిన వాడికి తప్పులు చేయడం అలవాటు ఉండదా? ఎంత మందికి ఇలా అన్యాయం చేసాడో.. వారిలో ఏ బాధితులో ఈ అసలు సిడిని పంపించి ఉంటారు” అన్నాడు. “అసలు ఫూటేజ్ లో వరుణ్ ఆఫీస్ కి వచ్చాడు. కానీ బాత్రూమ్ కి అని వెళ్లి అటునుంచి అటే బయటకు వెళ్ళిపోయాడు. చాలాసేపటికి తిరిగి ఆఫీసుకు వచ్చాడు. ఆ మధ్య గ్యాప్ లోనే భార్యను చంపి వచ్చుంటాడు” చెప్పాడు అజయ్.

          తన చెవులని తానె నమ్మలేకపోయింది కాత్యాయని. ‘అంటే నేను చూసిన ఫూటేజ్ నకిలీదా? వరుణ్ అపూర్వని చంపి తెలివిగా సీసీ టీవీ ఫూటేజ్ కూడా మార్చేసాడా? అంతటి కౄరుడా? ఎందుకు చేసావు వరుణ్ ఇదంతా?’ కాత్యాయని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

          “నిజం చెప్పాలంటే వరుణ్ కి ఈ పాటికి శిక్ష కూడా పడేది. కానీ అతను చాలా తెలివిగా ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఎవిడెన్స్ లో ఒక ముఖ్యమైన దాన్ని మాయం చేయించాడు. ఎవిడెన్స్ లెక్క చూసిన నిపుణులు అందులో ఒకటి మిస్ అయిందని గుర్తించారు. ఎంత తెలివిగా డబ్బులిచ్చి మాయం చేయించినా మా పోలీసుల నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు కదా. ఎవిడెన్స్ మిస్ కావడానికి కారణమైన వ్యక్తిని పట్టుకున్నాం. వరుణ్ చేయమంటే చేసానని చెప్పాడు ఆ వ్యక్తీ. ఆ అతి కీలకమైన ఎవిడెన్స్ ని తిరిగి ఫోరెన్సిక్ లాబ్ కి పంపించాం”

          “ఏంటా ఎవిడెన్స్?” గొంతు పెగుల్చుకుని అడిగింది.

          “వెంట్రుకలు. ఫోరెన్సిక్ రిపోర్టులో అవి వరుణ్ వి అని నిర్ధారణ అయ్యింది. ఆ వెంట్రుకలు అపూర్వ చేతి పిడికిలిలో ఉన్నాయి. వరుణ్ ఆమెని చంపే క్రమంలో అతడి నుండి తప్పించుకోవడానికి అపూర్వ అతని జుట్టు పట్టి లాగినట్టుంది. అలా అతని వెంట్రుకలు ఆమె చేతిలోకి ఊడి వచ్చుంటాయి”

          ఆ దృశ్యం ఊహించుకునగానే కాత్యాయనికి ఒళ్ళంత కంపించిపోయింది అపూర్వ ఎంత బాధకు గురయిందోనని.

          “అసలు… అసలు .. అంతగా అపూర్వని ప్రేమించిన వరుణ్ ఇలా ఎందుకు చేసినట్టు?” తనలో తనే ఏడుస్తూ గొణిగినట్టు అంది.

          “అనుమానం. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు కాత్యాయని. అరకులో ఉండే వినీత్ చెన్నై లో ఉండే అతని ఫ్రెండ్ వరుణ్ ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే విషయాలు అన్ని బయట పడ్డాయి. అరకులో అందరి అమ్మాయిలతో ప్రవర్తించినట్టే అపూర్వతో వినీత్ ప్రవర్తించాడట. దాంతో ఆమె కోపంతో వినీత్ చెంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయిందట. ఆ అవమానం పట్టలేక ఆమె మీద పగతో వరుణ్ కి అపూర్వ నా ఫ్రెండ్ లవర్, వాడిని మోసం చేసి వెళ్ళిపోయి నిన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పాడట. ఆ తరువాత దంపతులిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంకో సారి తన స్నేహిడితో నీ భార్య నా లవర్ అని చెప్పించాడట.

          ఇంకేముంది వరుణ్ భార్య మీద కసిని పెంచుకునుంటాడు ఆమెని అంతమొందించి నేరం తన మీదికి రాకుండా నీట్ గా ప్లాన్ చేసాడు. అది కాస్త ఫ్లాప్ అయింది”

          కాత్యాయనికి ఇదంతా వింటూంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది.

          ఆమె పరిస్థితి గమనించి మంచి నీళ్ళ గ్లాసు అందించాడు అజయ్.

          మంచి నీళ్ళు తాగనైతే తాగింది కానీ ఆమె మనసింకా అలాగే ఉంది. “నేనే తప్పు చేయలేదు అని వరుణ్ చెబితే ఎంత పిచ్చిగా నమ్మేసా నేను” అంది అదురుతున్నట్టు.

          అది విన్న అజయ్ “నేరం చేయగలిగినవాడికి అలా చెప్పడం పెద్ద విషయమేమీ కాదు” అని “కానీ నాకొకటి అర్థం కావడంలేదు నేరం రుజువయినా కూడా వరుణ్ ఇంకా తానూ ఏ తప్పు చేయలేదు అని ఎందుకు అంటున్నాడో అనేది. ఐ థింక్ తప్పించుకోవడానికి ఇంకేదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు పాపం తప్పించుకోలేడు అని తెలియక. రేపు వరుణ్ ని కోర్టుకి తీసుకువెళుతున్నాం” చెప్పాడు అజయ్.

          ఆ తర్వాత కాత్యాయని స్టేషన్ నుండి ఇంటికి ఎలాగోలా వచ్చింది కానీ వరుణ్ చేసిన కిరాతకం తలచుకుంటే ఆమెకి అతన్ని చంపేంత కోపం వస్తోంది, దాంతో పాటే అపూర్వ లేదన్న బాధ ఆమె హృదయాన్ని చీల్చేస్తోంది. ‘వాడికి తగిన శిక్ష పడాలి. అలా గాని జరగకపోతే నేనే వరుణ్ ని చంపేస్తా’ ఎరుపెక్కిన కళ్ళతో మనసులో కసిగా అనుకుంది.

*        *        *        *        *        *

          వారం రోజుల తరువాత…

          ఆరోజు కాత్యాయని ఇంట్లో ఆనందకర వాతావరణం సంతరించుకునుంది. కారణం వరుణ్, అతని తల్లిదండ్రులు వారింటికి రావడమే.

          “కాత్య నీ ఋణం ఎలా తీర్చుకోను తల్లీ. ఆ రోజు నువ్వు రాకుంటే వాడి జీవితం ఏమయిపోవునో” అంటూ కాత్యాయనిని గుండెలకు హత్తుకుని రోధించింది విమల.

          “ఎందుకు అత్తయ్యా ఇంకా ఆ విషయాన్ని గుర్తుతెచ్చుకుంటారు. ఒక్క అపూర్వ లేని లోటు తప్ప అంతా మునుపటిలా అయిపోయిందిగా” అంది కాత్యాయని.

          “ఇలా ఎప్పటిలా అవడానికి కారణం నువ్వే కాత్య. లేకపోతే….” అంటూ మాటలను ఆపేసాడు వరుణ్.

          “వరుణ్ నువ్వు కూడా నన్ను పొగిడేస్తున్నావా. నేనేం చేసాను చెప్పు..” చిన్నగా నవ్వుతూ అంది కాత్యాయని.

          “చాలా చేసావు కాత్య. నువ్వు అలా అన్నంత మాత్రాన నిజం నిజం కాకుండా పోతుందా” అన్నాడు వరుణ్.

          నవ్వేస్తూ “సరే చాలిక” అంది.

          “కాత్యా” గట్టిగా పిలుస్తూ ఇంట్లోకి వచ్చింది రాణి.

          “రాణి! ఎప్పుడు వచ్చావే ఊరు నుండి?” దగ్గరికెళుతూ అడిగింది కాత్యాయని.

          “ఈరోజే. ఇంటికి వస్తూనే ఇక్కడికి పరిగెట్టుకొచ్చేసా. నేను విన్నది నిజమేనా… మీ బావ వరుణ్…” అంటూ అక్కడే హాల్లో కూర్చునున్న వరుణ్ ని చూసి మాటలను మధ్యలోనే టక్కున ఆపేసింది రాణి.

          “నువ్వు విన్నదంతా నిజమే” చిన్నగా నవ్వుతూ అంది కాత్యాయని.

          “అవునా?” నోరింతలా చేస్తూ అంది రాణి.

          “దీనికి ఇలాంటి ముచ్చట్లంటే చాలా ఇష్టం. వెళ్ళండమ్మా… లోపలికి వెళ్లి మాట్లాడుకోండి. ఇదీ దీని ప్రశ్నలు. ఇపుడు అవన్నీ మాట్లాడి ఇపుడున్న ఈ కాస్త ప్రశాంతతని పోగొట్టకండి. కాత్యా తీసుకెళ్ళు నీ రూమ్ కి” అంది విమల.

          దాంతో ముఖం మాడ్చుకుంది రాణి.

          “పద” అంటూ రాణిని తన గదిలోకి తీసుకెళ్ళింది కాత్యాయని.

          “చెప్పవే ఎలా ఉన్నావ్? అంతా కులాసా నేనా?” అడిగింది కాత్యాయని ఇద్దరు కూర్చున్నాక.

          “అబ్బా నాకేం లేవే నేను బానే ఉన్నా. నువ్వు ఇది చెప్పు ముందు. వరుణ్ అపూర్వని చంపాడని అరెస్ట్ చేసాక  సరిగ్గా కోర్టులో శిక్ష పడే సమయంలో అసలు నేరస్తుడు వరుణ్ కాడని తెలిసిందటగా? అదెలా? అసలు నువ్వేనట కదా చంపింది ఎవరో కనిపెట్టింది? నిజమైన మర్డరర్ ని నువ్వు ఎలా కనిపెట్టావ్?” ప్రశ్నల వర్షం కురిపించింది రాణి.

          ‘అసలు దీనికి ఫీలింగ్సే లేవు. సినిమా స్టోరీ ని అడిగినట్టు అడుగుతుంది’ మనసులోనే అనుకుంటూ గట్టిగా శ్వాసించి “నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాకాని కాస్త నిదానంగా అడగవే తల్లి. అవేం ప్రశ్నలు ఒకదాని వెంటే ఒకటి” అంది కాత్యాయని.

          “నువ్వు ముందు చెప్పే. ఏం జరిగి ఉంటుందో అని ఆలోచించి చించీ నా బుర్ర బద్దలు అవుతోంది”

          “నీకు అన్ని చెప్పాలంటే నేను అరకు వెళ్ళిన దగ్గర నుండి చెప్పుకు రావాలి”

          “అయితే చెప్పు”

          అరకులో వినీత్ గురించి మొదలుకుని అతని మొబైల్లో అపూర్వ ఫోటో ని చూపించడం వరకు అంతా చెప్పి “ఆ ఫోటో చూడగానే వాడి దగ్గర ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయని అర్థమైంది. ఎందుకంటే వాడు నోటితో చెప్పేది ఒకటి అసలు జరిగేది ఒకటి కదా. ఈ విషయం నిత్య కి జరిగినదాన్ని బట్టి నాకు అర్థమైంది. ఎలాగైనా గదిలోకి రప్పించాలని, గదిలోకి రండని పిలిచా వాడ్ని. వచ్చాడు. రాగానే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేస్ తో అతని తలపై బలంగా మోదా. అంతే కిక్కురుమనకుండా స్పృహ తప్పి పడిపోయాడు. నేను నా గది డోర్ మూసేసి కుర్చీలో వాడ్ని కూర్చో బెట్టి బెడ్ షీట్ తో కట్టేసా. తరువాత వాడి ముఖం పై నీళ్ళు చల్లి లేపి అపూర్వ గురించి అడిగా. మొదట బెట్టు చేసాడు. నేను ఊరుకుంటానా లాగి పెట్టి నాలుగు తగిలించా. అంతే! అడుగు చెప్తా అన్నాడు. అడిగా. అపూర్వతో పిచ్చిగా ప్రవర్తిస్తే అపూర్వ అతన్ని కొట్టిందనీ దాంతో దాని మీద పగబట్టి వరుణ్ తో నీ భార్య నా ఫ్రెండ్ ఒకప్పటి లవర్, వాడ్ని మోసం చేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందని చెప్పాడట. ఆ తరువాత వరుణ్ అపూర్వ హైదరాబాద్ వెళ్ళిపోగానే వీడు వాడి ఫ్రెండ్ కి చెప్పి ఇంకోసారి వరుణ్ కి ఫోన్ చేయించాడట. వాడు వీడు చెప్పినట్టే చేసాడు. నేను ఇదంతా విన్నాక వీళ్ళిద్దరూ కలిసి వరుణ్ అపూర్వల మధ్య అపార్థాలు తీసుకురావడానికి చేసారని అర్థమైంది. నాకు ఒక క్షణం పాటు వరుణ్ మీద కూడా అనుమానం వచ్చింది. తన మీద అనుమానంతో చంపలేదు కదా అని. నిత్య గురించి అందరికి చెడుగా చెప్పడం నాకు గుర్తొచ్చి అపూర్వ గురించి కూడా చెడుగా ఇంకెవరికైనా చెప్పావా అని అడిగా. అపుడు ఓ కొత్త విషయం చెప్పాడు. కానీ అపుడు అది అంత ముఖ్యమైన విషయం గా నాకు అనిపించక దాన్ని వదిలేశా. ఇంతలో వాడు ఎప్పుడు నేను కట్టిన కట్లు తెంచుకున్నాడో తెలియదు కాని కట్లు తీసేసుకుని నన్ను పక్కకు తోసేసి గది తలుపు తీసుకుని పారిపోయాడు. వాడి దురదృష్టం కొద్ది అప్పుడే హోటల్లోకి పోలీసులు వచ్చారట. వీడ్ని చూసి పట్టుకుపోయారు” చెప్పడం ఆపింది కాత్యాయని.

          “ఇంతకీ ఏంటా ముఖ్యమైన విషయం?”

          “వాడు అపూర్వ గురించి చాలా మందికి చెప్పాడట నాకు చెప్పినట్టే. ఎవరెవరికి చెప్పావని అడిగా. చెప్పాడు అయితే అందరు మామూలుగా విన్నా వాళ్ళల్లో ఒక అమ్మాయి మాత్రం అది విని చాలా ఆనందపడిందట. ఆమెది కూడా హైదరాబాదే, పేరు శ్వేత అని చెప్పాడు. నేను ఈ విషయాన్ని అంత పట్టించుకోలేదు. ఎందుకంటే వరుణ్ మరదలు శ్వేత అమెరికా లో ఉంది కదా. ఇంకెవరో అనుకున్న. తీరా ఇంటికి వచ్చాకా రెండు రోజులకే వరుణ్ హంతకుడని అరెస్ట్ చేసారు. నేనూ నిజమే అని నమ్మేసా. కానీ ఇన్స్పెక్టర్ నాతో అన్నమాట గుర్తొచ్చింది. వరుణ్ ఇంకా తాను ఏ నేరం చేయలేదు అని అనడం. ఆలోచించా. వరుణ్ ఇంటికి వెళితే ఏమైనా డీటైల్స్ తెలుస్తాయని వెళ్ళా. కానీ ఇంటికి తాళం ఉంది. సుజాతని కనుక్కుంటే అంతా శ్వేత వాళ్ళింట్లో ఉన్నారని చెప్పింది. తాళం చెవి తెచ్చుకుని వరుణ్ ఇల్లు చూద్దాం అనుకుని శ్వేత వాళ్ళింటికి వెళ్ళా. కానీ వరుణ్ పేరెంట్స్ అక్కడి నుండి అప్పుడే శ్వేత తండ్రిని కలవడానికి అతని ఆఫీసుకి వెళ్ళారని వాళ్ళింట్లో ఉండే పనిపిల్ల చెప్పింది. ఇంట్లోకి ఎలాగో వచ్చాను కదా శ్వేతతో మాట్లాడి వెళదామని మేడ మీది తన గదికి వెళ్ళా. గదిలో ఎవరూ లేరు. వెళదామని వెనుదిరిగా కానీ సరిగ్గా అప్పుడే నా దృష్టి సగం తెరిచున్న బిరూవాపై పడింది. అందులో అపూర్వ పోగొట్టుకున్న నెక్లెస్ లాంటి నెక్లెస్ నాకు కనిపించింది. దగ్గరికెళ్ళి చూసా అది నిజంగా అపూర్వదేనా కాదా అని, ఆ నెక్లెస్ అపూర్వదే. ఎందుకు అంటే అపూర్వ నెక్లెస్ లో ఓ డైమైండ్ వంకరగ పొదిగి ఉండటం నాకు ఇంకా గుర్తుంది. ఈ నెక్లెస్ కి అదే చోట అలాగే ఉండడంతో అనుమానం స్థానంలో నమ్మకం ఏర్పడింది నాకు.

          అప్పట్లో ఆ నెక్లెస్ తో పాటే శ్వేతకు కూడా ఓ చైన్ కొనుక్కొచ్చాడట వరుణ్. అపూర్వకి డైమండ్ నెక్లెస్ ఇచ్చి శ్వేతకి చైన్ ఇచ్చాడట. వరుణ్ వెళ్ళాక శ్వేత అపూర్వతో ‘వరుణ్ ఎప్పుడూ అందరికి కలిపి గిఫ్టులు తెచ్చినప్పుడు నాకే అందరికంటే ఖరీదైన గిఫ్ట్ తెచ్చేవాడు. కానీ నీతో పెళ్ళయ్యాక తొలిసారిగా అందరికి కలిపి గిఫ్ట్ లు తెచ్చాడు. కానీ ఈ సారి అందరికంటే ఖరీదైన గిఫ్ట్ నాకు కాకుండా నీకు ఇచ్చాడు’ అందట. ఈ విషయం అప్పట్లో నాకు అపూర్వ చెప్పింది. అది గుర్తు రాగానే నాలో మళ్ళీ ఆలోచనలు. సరిగ్గా అదే సమయంలో ఆ గదిలోని బాత్రూం డోర్ తెరుచుకున్న చప్పుడు అవడంతో నేను ఉన్నపళాన మంచం కింద వెళ్లి దాక్కున్న నాకు తెలియకుండానే. నేను శ్వేత గదిలో లేదనుకున్నా కానీ బాత్రూమ్లో ఉందనుకోలేదు. అపుడే ఆమెకు ఫోన్ రావడంతో మాట్లాడింది. నాకు అసలు విషయం అప్పుడు ఆమె మాటల్లో తెలిసింది” ఆగింది కాత్యాయని.

          “ఏంటది?” ఆసక్తిగా అడిగింది రాణి.

          “ఫోన్ లేపుతూనే నాన్న మన ప్లాన్ దాదాపు సక్సెస్ అయినట్టే అంది శ్వేత”

          నోరు తెరిచి వింటోంది రాణి.

          “దాని దురదృష్టమో ఏమో కానీ అన్ని విషయాలు ఫోనులో మాట్లాడుతోంది. నాకు అప్పుడు ఓ బ్రహ్మాండమైన ఆలోచన తట్టి నా మొబైల్లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి విడియోలో శ్వేత బొమ్మ పడేట్టు చెయ్యి కాస్త ముందుకు చాపి  మొబైల్ పట్టుకుని అంతా రికార్డ్ చేయసాగా.

          ఫోనులో శ్వేత, ‘నా అదృష్టం కొద్ది నేను అనుకోకుండా అమెరికా నుండి ఫ్రెండ్ ని కలవడానికి అరకు వెళ్ళడమేంటి అక్కడ ఆ వినీత్ కనిపించడమేంటీ.. అనుకోకుండా మాట్లాడితే వాడు అపూర్వ సంగతి చెప్పడం ఏంటీ.. ఆ తరువాత నాకు బ్రహ్మాండమైన ఆలోచన రావడమేంటి. అంతా నా అదృష్టం నాన్న. ఆ తరువాత మనం ప్లాన్ వేసినట్టు నేను అపూర్వ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టి అక్కడ వరుణ్ అన్న పేరుతో ఉన్న గిఫ్ట్ బాక్స్ పెట్టి పక్కన నిలబడ్డ. ఆ పిచ్చిది తలుపు తీసి దాని మీదున్న వరుణ్ పేరును గట్టిగా చదివింది. కానీ అప్పుడు నేను ఏ పొరబాటు చేసిన ఆ టైం లో కాత్యాయని ఫోనులో నా మాట వినేదే. ఆ విషయం నాకు తెలియకున్నా చాకచక్యంగా గబుక్కున లోనకెళ్ళి దాని నోరు నొక్కి కత్తితో పొడిచేశా. అలా చేయడం మంచిదయింది. ఆ తరువాత దాని చేతిలో వరుణ్ వెంట్రుకలు పెట్టి వచ్చేసా. ఆ తరువాత మనమే ఆ వెంట్రుకలు ఫోరెన్సిక్ నిపుణుల్లో ఒకన్ని డబ్బుతో కొనేసి దాన్ని మాయం చేయించి లాస్ట్ లో మనమే ఆ నిపుణున్ని పోలీసులకి దొరికేలా చేసి అతనితో వరుణ్ చేయమంటే చేసానని చెప్పించి నేరం వరుణ్ మీదకి నేట్టేసాం. ఇప్పుడు వరుణ్ పూర్తిగా వచ్చేసాడు మన వల లోకి.

          ఇపుడు మనం చేయవలసిందల్ల వరుణ్ కి శిక్ష పడ్డాక అతన్ని బయటకి తేవడం. అప్పుడే మన ప్లాన్ పూర్తిగా ఫలిస్తుంది. చెయ్యని నేరానికి ప్రపంచం దృష్టిలో నేరస్తుడిగా ముద్రింపబడినందుకు వరుణ్ కుమిలి కుమిలి పోతున్న సమయంలో నేను తనకు దగ్గరవుతా. అపూర్వ జ్ఞాపకాలను పూర్తిగా తొలగించేస్తా. ఆ తరువాత ఇక్కడికి దూరంగా నాతో పాటు అమెరికాకి తీసుకెళత. అక్కడ తను నేను ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము.

          నువ్వన్నట్టు కేవలం అపూర్వనే చంపి ఆ నేరం ఎవరి మీదో డబ్బుతో తోసేయోచ్చు నాన్నా. కానీ వరుణ్ ఆ అపూర్వ కోసమే బాధపడుతూ ఉంటాడు. అలా ఉండకూడదు అంటే తననే ఈ ప్రపంచం దృష్టిలో నేరస్తుడిగా చిత్రీకరిస్తే అతని మనసు అపూర్వ నుండి ఈ లోకం మాటలపై మరలుతుంది. ఆ కాస్త అవకాశం నాకు చాలు నాన్న వరుణ్  మనసులో నుండి అపూర్వ జ్ఞాపకాలను తుడిచేయడానికి. వరుణ్ ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా నాన్న. అంత సులభంగా తనని ఎలా వదులుకుంటా? వరుణ్ నా వాడు అయినా అతని ఆలోచనలు అన్నీ నా గురించే ఉండాలి.. ఇంకొకరి గురించి ఉండకూడదు… అపూర్వ గురించి కూడా. అందుకే ఇంత పెద్ద ప్లాను వేసాను అంటూ మాట్లాడటం వినగానే అక్కడికక్కడే దాన్ని చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది నాకు. కానీ నేనా పని చేస్తే శ్వేత చేసిన తప్పు ఈ లోకానికి ఎలా తెలుస్తుంది? అందుకే శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోగానే సైలెంట్ గా అక్కడినుండి వచ్చి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్ళా.

          వాళ్ళు శ్వేతని అరెస్ట్ చేసారు. అప్పుడు కూడా శ్వేత నిజం ఒప్పుకోడానికి నిరాకరించింది. కానీ చివరికి అది చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఆమె తన తండ్రి కలిసి ఇదంతా చేసామని చెప్పింది.

          అలా అసలు మర్డరర్ ని కనుక్కోగలిగా” చెప్పడం ముగించింది కాత్యాయని.

          కాత్యాయని అన్ని చెప్పినా రాణిని ఓ సందేహం ఇంకా తొలుస్తోంటే “సీసీ టీవిలో వరుణ్ ఆఫీసులో లేనట్టు ఉన్న సిడి పోలీసులకు వచ్చిందట గా. సీసీ టీవీ ఫూటేజ్ మార్చారని విన్నా?” అంది.

“నిజానికి నకిలీ సీసీ ఫూటేజ్ పోలీసులకి వచ్చింది. ఆఫీసులోని మొదటి ఫూటేజే అసలైనది. దాన్ని మార్పించి అసలుది నకిలీ అనుకోవాలని ఆ సీడీని సృష్టించి పంపించారు. వరుణే అసలు నేరస్తుడు అని నమ్మించడానికి. ఈ విషయం శ్వేతే పోలీసుల దగ్గర ఒప్పుకుంది”

          అంతా విన్న రాణికి అందమైన అపూర్వ ముఖం కళ్ళ ముందు మెదిలిలేసరికి ఆమె మనసు కదిలిపోయింది. “ప్రేమ కోసం తమ ప్రాణాల్ని త్యాగం చేస్తారు కానీ ఇలా అభం శుభం తెలియని వారిని తమ స్వార్థం కోసం చంపడం చాలా పాపం కాత్య. అసలు శ్వేతది ప్రేమ కాదు దానిది స్వార్థపూరిత ప్రేమ అందుకే ఇంతటి ఘోరం చేసి.. ప్రాణంగా ప్రేమించానన్న వరుణ్ నే కటకటాలకు పంపాలని చూసింది. అసలు.. దానిదీ ఒక ప్రేమేనా!!” అంది ఈసడింపుగా.

          అపూర్వ సుందరమైన రూపం కళ్ళ ముందు గుర్తుచేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది కాత్యాయని.

*        *        *        *        *        *

          డాబా మీద ఒంటరిగా వెళ్లి కూర్చున్నాడు వరుణ్. జేబులో నుండి ఓ చిన్న డబ్బాను తీసి దాని మూత తెరిచాడు. అందులో అపూర్వ ఇష్టపడే లేత గులాబి రంగులో ఉన్న వజ్రపు ఉంగరం తళుక్కుమంటూ మెరుస్తోంది. అపూర్వకి సర్ప్రైజ్ గా ఇద్దామనుకున్న ఉంగరం అది. అతని కళ్ళల్లో నుండి కన్నీటి బిందువు జారి ఆ వజ్రపుటుంగరం పై పడింది. కళ్ళు మూసుకుని అపూర్వని తలచుకుంటూ ఆ ఉంగరాన్ని తన వేలుకు పెట్టుకుంటూ… ‘నువ్వు లేకున్నా ఎప్పుడూ నాతోనే ఉంటావు అపూర్వ’ అనుకున్నాడు.

భాగాలు: 1234567