తెలుగు భాష – కవిత

ఏమని వర్ణించను తెలుగుభాష గొప్పదనం

ఆ భాషలోనే ఇమిడి ఉంది తెలుగు ప్రజల హుందాతనం.

సంస్కృతి సాంప్రదాయాలకు తెలుగుగడ్డ ఆనవాలం

పురాణేతిహాసాలకు పుట్టినిల్లు మన త్రిలింగ దేశం.

భావ వ్యక్తీకరణలో బహుముఖ ప్రజ్ఞాశాలి

మనుష్యుల అంతరంగాన్ని తట్టిలేపేది తెలుగు అక్షరం.

కవుల కలాల నుండి జాలువారిన తేటతెలుగు అద్భుతం

ప్రజల నరనరాలలో దేశభక్తిని ప్రజ్వరిల్లించడానికి తెలుగుభాషే ముఖ్య కారణం.

తెలుగు జాతి గొప్పదనం, తెలుగువీరుల పౌరుషం

తెల్లదొరల గుండెల్లో గుబులు పుట్టించిన వైనం,

ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిపోయే స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టం

ప్రజల మనసులో తిమిరావళిని పారద్రోలే గొప్ప సమ్మోహనాస్త్రం తెలుగు అక్షరం.

జనజీవన స్రవంతిని అతలాకుతలం చేసే క్రూరమృగాల పాలిట సింహస్వప్నం

భావిభారత పౌరులకు తెలుగు అక్షరమాల చూపించును దిశానిర్దేశం.

ఛాటువులతో చమత్కారాలను, నుడికారాలతో భావాలను,

చంధస్సుతో సమస్యాపూరణాలను తెలియపరచడం తెలుగుభాషకే సొంతం.

తెలుగు భాషలోని హొయలు, కావ్యాలలోని వర్ణనలు,

అష్టావధానాలు ప్రజల మదిలో చిరస్మరణీయం.

“అమ్మ” అనే కమ్మనైన పిలుపును పరిచయం చేసిన తెలుగుభాషా నీకు వందనం.

తెలుగు గడ్డపై పుట్టి తెలుగుభాష మాట్లాడుకోవడం ఎన్నో జన్మల

పూర్వఫలం ఈ భువి పై తెలుగు భాష నిలవాలి కలకాలం.