‘విప్లవ సూర్యుడు’ – పుస్తక సమీక్ష

          విప్లవం… అంటే తిరుగుబాటు. ఈ విప్లవ భావాలు ఏర్పడటానికి కారణాలు ఎన్నో. విప్లవానికి దేశంలోని రాజ్యాంగాన్నే మార్చగల శక్తి ఉంది. విప్లవ భావాలతో జాని భాష చరణ్ .తక్కెడశిల గారు రాసిన కవితా సంపుటి ‘విప్లవ సూర్యుడు’. ఇందులో 40 కవితలు ఉన్నాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇవన్ని ఒక్కరోజులో రాసినవని. ఈ విషయం పుస్తకం తెరవగానే చూడవచ్చు.

          ఒక్కరోజులో విప్లవాత్మక భావాలతో ఏకంగా 40 కవితలు రాయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పవచ్చు. గొప్ప కవులకు, కవయిత్రులకు ఇది మామూలే అయుండొచ్చు అయినా ఓ యువకవి ఇలాంటి అభ్యుదయ భావాలతో ఒకేరోజు అన్నింటిని రాయడం అనేది సాధారణం కాదనేది నా భావన.

కవి

          జాని భాష చరణ్ ‘నా పలుకులు’లో తన భావాలను పంచుకున్నారు. ‘ప్రతి ఒక్కరు ప్రేమించాలి, కానీ ముందు జీవితంలో స్థిరపడాలి, తరువాతే ప్రేమించాలి, అప్పుడే రెండింటిలో విజయాన్ని సాధించగల’మని అఖిలాశ (కవి కలం పేరు) పేర్కొన్నారు. ఇందుకు నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేటి సమాజంలో కొందరు యువత జీవితంలో స్థిరపడకముందే ప్రేమ అనే మెట్లెక్కి ఆ తరువాత పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. ఆ తరువాత ఏంటి? ప్రేమ అనేది జీవితాంతం ఉండేది. అంతే కాని పెళ్లి వరకు వచ్చి ఆగిపోయేది కాదు. పెళ్లి అయ్యాక పూర్తిచేయని నిర్దిష్టమైన చదువుతో ఏ పదవులు పొందుతారు జీవితాన్ని ఎలా సాగిస్తారు… ఇలాంటివేవి ఆలోచించకుండా గాలిలో మేడలు కట్టేసి ఎదో చేస్తున్నామని ఎదో చేస్తారు. ఇలా చేసినవారిలో కొందరు తీరం చేరతారు కొందరు చేరారు. ఇలాంటివి నిత్యం పేపర్లోనో, టీవీ లోనో చూస్తూనే ఉన్నాం. అయినా అదే ధోరణి. కానీ ఈ ధోరణి మారాలి. ఈ మార్పు అనేది కేవలం వారిలోనే కాదు, అందరిలో రావాలి ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులలో.

          ‘విప్లవ సూర్యుడు’ అన్ని కవితల గురించి రాద్దామనుకున్నా కానీ అలా రాస్తే ఎలా? కాబట్టి కొన్ని కోవితల పై నా అభిప్రాయం రాస్తున్నా.

  1. వాదం

          నీదే వాదం… నాదే వాదం అంటూ ప్రారంభమయిన కవిత మన చుట్టూ ఉన్న సమాజంలో కొందరి స్వభావం పై సాగింది. అంతిమంగా అదుపు తప్పినా ఇంద్రియాలని మనసుతో దారిలో పెట్టమంటూ చైతన్య పరిచే భావంతో ముగిసింది.

  1. వజ్రాయుధం

          ఏంతో గొప్ప భావం ఈ కవిత సొంతం.

          కనపడినది నిజం కాదు

          కనిపించనిది అబద్దం కాదు

          స్వప్నంలో కనిపించేది అబద్దం

          స్వప్నాలను కని నిజం చేసుకో

          అదే నిజం…! అదే నిజం..!

          ఇవి వజ్రాయుధం 26 పంక్తుల కవితలో తోలి ఐదు. నిజమే కదా! నిద్రలో వచ్చే కల నిజిం కాదు. కానీ మన జీవితంలో ఎదగాలనే కలలు మన చేతిలో ఉన్నాయి, వాటిని నిజం చేసుకోవాడం, కపోవడం అనేది మనపై ఆధారపడుంది. నిత్యం పరిగేడుతూండు కానీ కోరికలకి కాదు అంటూ ఇంకెంతో భావంతో మేల్కొలుపుతుంది ఈ కవిత.

  1. పిశాచి

          విలువని మానవత్వానికి ఇవ్వు మతానికి కాదు అని చెబుతూ సాగిన ఈ కవిత ఎంతో అర్థంతో ఉంది. ఈ కవితలో నాకు అమితంగా నచ్చినది సూర్యచంద్రులు ఏ ఒక్క మతం కోసమో ఉదయించట్లేదు అనేది. మతోన్మాదుల పై రాసిన ఈ కవిత అందరినీ ఆలోచింపజేసేదిగా ఉంది.

          ఇలా ‘విప్లవ సూర్యుడు’లో ఎన్నో కవితలు మరెంతో లోతైన భావంతో ఉన్న అఖిలాశ కవితలను చదవచ్చు. యువత, సమాజం, మతం, రాజకీయం, మూడనమ్మకాలు, కాలుష్యం లాంటి ఎన్నో అంశాలు కవితలలో కనిపిస్తాయి. మొత్తంగా అఖిలాశ కవితలను చాలా బాగా రాసారు.

పుస్తకం పేరు: విప్లవ సూర్యుడు

కవి: జాని భాష చరణ్ .తక్కెడశిల

ప్రచురణ: J.V పబ్లికేషన్స్